గులాబీ పార్టీకి 'కారు'చౌకకే భూములు.. ఎంత తక్కువకంటే?

Update: 2022-06-24 04:29 GMT
ఆంధ్రోళ్ల పాలనలో తెలంగాణలో అవకాశాలన్ని దెబ్బ తింటున్నాయని.. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ఎంతలా నష్టపోతున్నాయో తెలుసా? అంటూ వీరంగం ఆడిన గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఏలుబడిలో పరిస్థితులు అంతకంటే ఘోరంగా మారాయన్న ఘాటు విమర్శలు అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఉద్యమ నేతలు పలువురు ఉమ్మడి రాష్ట్రంలో చూడని వింతలు.. కేసీఆర్ సర్కారులో చూస్తున్నామని.. సొంత రాష్ట్రంలో సాధించిందేమీ లేదన్న పెదవి విరుపు అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. తమ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం కేసీఆర్ సర్కారు కేటాయింపులు జరిపిన భూముల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

హైదరాబాద్ జిల్లా పార్టీ కార్యాలయం కోసం కేసీఆర్ సర్కారు జారీ చేసిన జీవో నేపథ్యంలో.. హైకోర్టు నోటీసులు జారీ చేయటంతో.. ఈ ఇష్యూ మరోసారి చర్చకు వచ్చింది. రాజకీయ పార్టీలకు భూముల కేటాయింపు విషయంలో ఒక పద్దతి పాడు అన్నది లేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీకి ఒక న్యాయం.. విపక్షాలకు మరో న్యాయం అన్నట్లుగా వారి తీరు ఉందంటున్నారు.

టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల కోసం తీసుకు వచ్చిన కొత్త విధానంపై ఆరోపణలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. కొత్తగా తీసుకొచ్చిన విధానం ఒక్క టీఆర్ఎస్ పార్టీకే వర్తింపచేసి.. మిగిలిన పార్టీలను పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు. అందరికి ఒకే న్యాయం ఉండాలని.. కానీ అందుకు భిన్నంగా కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు.

గజం రూ.100 చొప్పున నిర్ణయించి విలువైన స్థలాల్ని టీఆర్ఎస్ కోట్టేస్తుందని.. జిల్లా కేంద్రాల్లో కోట్లాది రూపాయిల విలువ చేసే స్థలాల్ని లాగేసుకొని పార్టీ కార్యాలయాల్ని నిర్మించటాన్ని తప్పు పడుతున్నారు. ఒకవేళ.. అదే సరైనది అయితే.. తమకూ భూముల్ని ఎందుకు కేటాయించటం లేదని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. హైదరాబాద్ జిల్లా పార్టీ ఆఫీససు కోసం బంజారాహిల్స్ లోని 4935 గజాల ప్రభుత్వ భూమిని కారుచౌకకు కట్టబెట్టేశారు. గజం రూ.100కు మాత్రమే కట్టపెట్టేసిన వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదే విధంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ టీఆర్ఎస్ కార్యాలయాలకు ఇదే తీరులో స్థలాల్ని కేటాయించటాన్ని తప్పు పడుతూ మహేశ్వర్ రాజ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు పార్టీ ప్రధాన కార్యదర్శికి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి.. సీసీఎల్ ఏ.. హైదరాబాద్ కలెక్టర్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేయటం తెలిసిందే. దీంతో ఈ వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది.

రాజకీయ పార్టీలకు భూములు కేటాయించాలన్న విధానం 1987లో అప్పటి ఏపీ ప్రభుత్వం జీవో 826 జారీ చేయటం ద్వారా మొదలైంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు రాష్ట్ర.. జిల్లా కేంద్రాల్లో ఎకరానికి మించకుండా స్థలాన్ని కేటాయించాలని.. 30 ఏళ్లకు లీజు పద్దతిన కేటాయింపులు జరపాలని పేర్కొన్నారు. అవసరమైతే లీజు గడువును పెంచొచ్చని పేర్కొన్నారు.

అయితే.. టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానాన్ని మార్చేశారు. లీజు పద్దతిన కాకుండా పార్టీలకే స్థలాల్ని కేటాయించేలా 2018 ఆగస్టు 16న జీవో జారీ చేశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు జిల్లా కేంద్రాల్లో పార్టీ భవనాల నిర్మాణానికి గజం రూ.100 చొప్పున ఎకరాకు మించకుండా స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా 1987లో తెచ్చిన జీవోకు బదులుగా కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే కొత్త ఉత్తర్వుల ప్రకారం.. కేసీఆర్ సర్కారు టీఆర్ఎస్ ఆఫీసుల కోసం 33 జిల్లాల్లోని జిల్లా కేంద్రాల్లో స్థలాల్ని కేటాయించారే కానీ ఇతర పార్టీలకు మాత్రం కేటాయింపులు జరపలేదు. ఇక.. టీఆర్ఎస్ పార్టీకి కేటాయింపులుజరిపిన విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాంపిల్ గా కొన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం ఎంత చౌకగా కేటాయింపులు జరిపారో ఇట్టే అర్థమవుతుంది.

-  కరీంనగర్ లో గజం రూ.20-25 వేలు పలుకుతుంటే.. కేవలం రూ.3 లక్షలకే భూమి కేటాయించారు. వాస్తవ ధర ప్రకారం చూస్తే.. ఈ భూమి విలువ రూ.12 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.

-  హనుమకొండలో గజం రూ.75 వేలకు పైనే ఉంటే.. గజం రూ.100 చొప్పు 4వేల గజాలు కేటాయించారు.

-  అదిలాబాద్ లోని కైలాస్ నగర్  కాలనీలో గజం రూ.100చొప్పున 36 గుంటల భూమిని కేటాయించారు. వాస్తవ ధర చాలా రెట్లు ఎక్కవని చెబుతున్నారు.

-  మంచిర్యాలలో గజం రూ.21 వేలు ఉంటే.. రూ.100చొప్పున ఎకరం స్థలాన్ని కేటాయించారు.

- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని దుండిగల్ లో ఎకరం భూమిని కేటాయించారు. మార్కెట్ విలువ ప్రకారం దీని ధర రూ.5 కోట్లు ఉంటే.. ఇప్పటివరకు చెల్లింపులు జరిపింది రూ.86 వేలు మాత్రమే.

-  జగిత్యాలలో పార్టీ ఆఫీసు కోసం కేటాయింపులుజరిపిన ప్రాంతంలో గజం రూ.25వేలు ఉంటే.. గజం రూ.100కు కేటాయించారు.

-  వరంగల్..ఖమ్మంలో గజం రూ.30వేలు ఉంటే.. గజం రూ.100కే కేటాయింపులు జరిపారు.
- యాదాద్రి  భువనగిరి జిల్లాలో పార్టీ కార్యాలయం కోసం కేటాయించిన భూమి విలువ రూ.5 కోట్లు ఉంటే.. కేవలం రూ.4.84 లక్షలకే కట్టబెట్టేశారు.

-  సంగారెడ్డి జిల్లా కార్యాలయానికి కేటాయించిన భూమి విలువ రూ.నాలుగైదు కోట్లు ఉంటే కేవలం రూ.2లక్షలకే కేటాయింపులు జరపటం గమనార్హం.

ఇలా కారుచౌకగా జిల్లా పార్టీ కార్యాలయాల కోసం జరిపిన కేటాయింపులపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజా హైకోర్టు నోటీసులు నేపథ్యంలో.. ఇప్పటివరకు జరిపిన భూ కేటాయింపుల వ్యవహారం రచ్చగా మారి పెద్ద ఎత్తున చర్చకు తెర తీయటం ఖాయమంటున్నారు. అయితే.. టీఆర్ఎస్ కు కేటాయించిన తరహాలోనే తమ పార్టీలకు భూములు కేటాయించాలని విపక్షాలు కోరితే.. వాటికి ఇప్పటివరకు భూ కేటాయింపులు జరపలేదంటున్నారు.
Tags:    

Similar News