కాంగ్రెస్ నేత‌లు కుమిలిపోయేలా చేస్తున్న కేసీఆర్‌

Update: 2017-07-03 11:44 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ రాజ‌కీయ వ్యూహాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప‌ట్టిన ప‌ట్టు విడ‌వ‌కుండా ముందుకు సాగ‌డం, ఈ క్ర‌మంలో త‌న‌ను ఇబ్బందిపాలు చేసిన వారికి త‌న  మార్కు రాజ‌కీయ‌ చాణక్యం రుచి చూపించ‌డం ఆయ‌న‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. అలాంటి కేసీఆర్ తాజాగా కాంగ్రెస్ పట్ల వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఆస‌క్తిక‌రంగా మారిందని అంటున్నారు. ఎమ్మెల్యేల‌ను చేర్చుకోవ‌డం మొద‌లు, ఎన్నిక‌ల్లో ఓడించ‌డం వ‌ర‌కు ఇప్ప‌టికే అనేక సంద‌ర్భాల్లో కాంగ్రెస్ పార్టీని ఇర‌కాటంలో ప‌డేసిన కేసీఆర్ తాజాగా రాష్ట్రప‌తి ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆ పార్టీ మ‌రింత‌గా హ‌ర్ట్ అయ్యేలా చేస్తున్నార‌ని అంటున్నారు.

బీజేపీ సార‌థ్యంలోని ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌ నాథ్ కోవింద్‌ ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌క‌ట‌న స‌మ‌యంలోనే మ‌ద్ద‌తు ప‌లికిన కేసీఆర్ ఈనెల 4వ తేదీన కోవింద్‌ హైద‌రాబాద్‌ కు రానున్న స‌మ‌యంలో ఘ‌నంగా స్వాగ‌తం ప‌ల‌కాల‌ని నిర్ణ‌యించారు! అంతేకాకుండా రామ్‌ నాథ్ కోవింద్ పర్యటనను విజయవంతం చేయాలని, ఘనస్వాగతానికి ఏర్పాట్లుచేయాలని టీఆర్‌ ఎస్ శ్రేణులను ఆయన ఆదేశించారు! బీజేపీ అభ్య‌ర్థికి ఎన్డీఏలో భాగ‌స్వామ్య పార్టీ కాక‌పోయిన‌ప్ప‌టికీ ఈ విధంగా పిలుపునివ్వ‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉందని అంటున్నారు. అయితే కేసీఆర్ అంత‌టితో ఆగిపోలేదు. న‌గ‌రంలోకి కీల‌క ప్రాంతాల్లో హోర్డింగ్‌ లు ఏర్పాటుచేయించారు. ``రాష్ట్రప‌తి అభ్య‌ర్థి రామ్‌ నాథ్ కోవింద్ గారికి స్వాగ‌తం. తెలంగాణ రాష్ట్రస‌మితి బ‌ల‌ప‌రుస్తున్న రాష్ట్రప‌తి అభ్య‌ర్థి`` అన్న హోర్డింగ్‌ లు కీల‌క ప్రాంతాల్లో ద‌ర్శ‌న‌మిచ్చాయి. అత్యంత ఆస‌క్తిక‌రంగా ఈ హోర్డింగ్‌ ల‌లో రామ్‌ నాథ్ కోవింద్‌ - కేసీఆర్ ఫోటోలు కూడా ఉంచారు.

ఈ ప‌రిణామంతో అవాక్క‌వ‌డం కాంగ్రెస్ శ్రేణుల వంతు అయిందంటున్నారు. తెలంగాణ ఏర్పాటులో కీల‌క పాత్ర పోషించిన త‌మ పార్టీ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోవ‌డ‌మే కాకుండా, సాక్షాత్తు మీరాకుమార్ హైద‌రాబాద్ వ‌చ్చిన రోజున హైద‌రాబాద్ న‌గ‌రంలో రామ్‌ నాథ్‌ కోవింద్  ఫ్లెక్సీలు ఏర్పాటు చేయ‌డం కాంగ్రెస్‌ ను రెచ్చ‌గొట్టే చ‌ర్యే అంటున్నారు. దీంతోపాటుగా మీరాకుమార్ త‌న ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మ‌ద్ద‌తు కోరేందుకు కేసీఆర్‌ కు ఫోన్ చేసిన‌ప్ప‌టికీ ఆయ‌న స్పందించ‌లేదు. దీంతో సీఎంఓ అధికారులకే స‌మాచారం ఇచ్చిన‌ట్లు మీరాకుమార్ తెలిపారు.

ఇదిలాఉండ‌గా...ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రామ్‌ నాథ్ కోవింద్ హైదరాబాద్‌ కు రానున్నారు. ఉదయం 9 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు. కోవింద్ వెంట కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ - వెంకయ్యనాయుడు - బండారు దత్తాత్రేయ ఉంటారు. విమానాశ్రయంలో కోవింద్‌ కు టీఆర్‌ ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత జితేందర్‌ రెడ్డి - ఉప నేత కే కేశవరావు - డిప్యూటీ సీఎం మహమూద్ అలీ - కడియం శ్రీహరి - టీ హరీశ్ రావు - నాయిని నర్సింహారెడ్డి - ఈటల రాజేందర్ స్వాగతం పలుకుతారు. మధ్యాహ్నం 12.15 గంటలకు నెక్లెస్ రోడ్‌ లోని జలవిహార్‌ లో కోవింద్ ప్రచార కార్యక్రమం ప్రారంభమవుతుంది. జలవిహార్ వద్ద ఆయనకు టీఆర్‌ ఎస్ అధినేత స్వయంగా స్వాగతం పలుకనున్నారు. తమ పార్టీ ప్రజాప్రతినిధులను కోవింద్‌ కు పరిచయం చేయనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు - టీఆర్‌ ఎస్ శాసనసభ్యులు - లోక్‌ సభ సభ్యులు - రాజ్యసభ సభ్యులు - రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు - ఎమ్మెల్సీలు - జెడ్పీ చైర్మన్లు - కార్పొరేషన్ల మేయర్లను ఆహ్వానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News