మరిన్నేళ్ళు మోడీయేనా...మనసు పరిచేసిన కేసీయార్..?

Update: 2022-09-17 09:30 GMT
కేసీయార్ విజ్ఞులు. వివేకవంతులు. ఆయన తెలుగు  భాషాప్రతిభ  కానీ, ఆయన ఆలోచనా పటిమ కానీ చాలా మంది రాజకీయ నాయకులకు అయితే  ఉండదు అంతే అతిశయోక్తి కాదు. ఇక అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ఎలాగో తెలంగాణా సాధించి కేసీయార్ నిరూపించారు. ఇక ఆయన ఇపుడు మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ దేశానికి కొత్తగా మరో జాతీయ పార్టీని పరిచయం చేయబోతున్నారు.

నిజానికి గత మూడు నాలుగు దశాబ్దాల కాలంలో ఈ దేశంలో అన్నీ ఫ్రంటుల కధలే అన్నీ  పొత్తుల కసరత్తులే తప్ప ఒక కొత్త  జాతీయ పార్టీ అన్నది ఒక స్థాయిలో ఏర్పడింది అయితే లేనే  లేదు. ఎంతసేపూ అతుకుల బొంతలనే కలిపి కుట్టి దేశం మీదకు వదిలే విచిత్ర వ్యూహాలను వాటి తాలూకా విన్యాస  రాజకీయాలనే అంతా చూశారు. అలాంటిది కేసీయార్ ఒక సాహసిగా మారి ఆ బృహత్కార్యం తన భుజాల మీద వేసుకున్నారు.

ఒక విధంగా చెప్పాలీ అంటే చాలా కాలంగా కేసీయార్ ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు. ఈ దేశ ప్రధాని పదవి నుంచి  తక్షణం దిగిపోవాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఈ విషయంలో ఎక్కడా తగ్గేది లేదు అని ఆయన అంటున్నారు. అలాంటి కేసీయార్ మోడీ పుట్టిన రోజు సందర్భంగా గ్రీట్ చేస్తూ తన మనసును అలా పరిచేసారా అన్న చర్చ సాగుతోంది.

మోడీ ఆయురారోగ్యాలతో ఉండాలని కేసీయార్ కోరుకున్నారు. అక్కడ వరకూ ఓకే కానీ  దానితో పాటుగా ఈ దేశానికి మరిన్నేళ్ళు పాటు సేవ చేయాలని కూడా ఆకాక్షించారు. మరి దాని అర్ధమేమి కేసీయార్ సారూ అంటే ఆయన ఏమి చెబుతారో కానీ జనాలకు సూక్ష్మంగా అర్ధమయ్యేది ఏంటి అంటే మరిన్నేళ్ళు ప్రధానిగా మోడీ ఉండాలనేనా అన్నదేనట.  దీని మీదనే ఇపుడు ఒక లెక్కన సెటైర్లు పడుతున్నాయి.

అయితే కేసీయార్ అర్ధాలు పరమార్ధాలు వేరేగా ఉండవచ్చు. మోడీ మాజీ ప్రధానిగా ఉంటూనే దేశానికి తనకు చేతనైన సాయం చేయాలని కూడా ఆయన కోరుకోవచ్చునేమో. అయితే అధికారం పోయాకా దేశానికి అందే సేవలు ఏముంటాయి. పైగా ప్రధానిగా మరోసారి మోడీ  గద్దెనెక్కాలని ఉబలాటపడుతున్న బీజేపీ వారికి  కేసీయార్ గ్రీటింగ్స్ లో సౌండ్స్ వేరేగానే వినిపిస్తాయనుకున్నా తప్పు లేదేమో.

అలా తమ నేత ప్రధాని కావాలనే కేసీయార్ కోరుకుంటున్నారని బీజేపీ వారు అర్ధాన్ని తమకు తోచినట్లుగా భాష్యం చెప్పుకుంటే కాదనేదెవరు.  కానీ  భాషాపండిత్యంలో ఆరితేరిన కేసీయార్ కి ఇందులో వేయి అర్ధాలు కనిపిస్తాయి. ఆయన అలా వాటిని తనకు వీలుగానూ  విప్పి చెప్పగలరు, కాబట్టి ఆయన అర్ధం అయితే మోడీ మాజీ ప్రధాని కావడమే అని అనుకోవాల్సిందేనా.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News