కేసీయార్ కసి అర్జంటుగా గుజరాత్ మీదేనట...

Update: 2022-11-04 09:28 GMT
టీయారెస్ నుంచి బీయారెస్ అధినేతగా మారిన కేసీయార్ రాజకీయంగా మంచి కసి మీద ఉన్నారు. ఈ దేశాన్ని బీజేపీ సర్వనాశనం చేసింది అని ఆయన లేటెస్ట్ గా మీడియా మీటింగ్ పెట్టి మరీ చెడా మడా వాయించేశారు. ఇదే బీజేపీ మరిన్నాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉంటే దేశం మరో వందేళ్ళు వెనక్కిపోవడం ఖాయమని కూడా ఆయన ఆడిపోసుకున్నారు. నా తెలంగాణా గడ్డ మీదకు వచ్చి మా ఎమ్మెల్యేలనే కొనడానికి బేరసారాలు సాగిస్తారా ఎంత ధైర్యం అని కేసీయార్ సార్ హూంకరిస్తున్నారు. నేను దీనిని సహించగలనా అంటూ ఆయన మండిపడుతున్నారు.

బీజేపీ కధను తేలుస్తాను అని వీర లెవెల్ లో శపధం చేస్తున్నారు. అలాంటి కేసీయార్ కి ఇపుడు అర్జంటు గా గుజరాత్ గుర్తుకురావడం విశేషం ఏమీ కాదు. గుజరాత్ కోట బీజేపీది. అక్కడ మూడు దశాబ్దాలుగా పీఠమేసుకుని కూర్చున్న బీజేపీని ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కదిపి కుదిపే పని చేయలేకపోయాయి. మరోసారి ఎన్నికలు వచ్చాయి. ఈ డిసెంబర్ 1, 5 తేదీలలో గుజరాత్ లో ఎన్నికలు జరగనున్నాయి. మరి మాస్టర్ మైండ్ గేం ఆడే కేసీయార్ ఏమి చేయబోతున్నారు అన్నదే అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

టీయారెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ చూస్తోందని, ప్రజాస్వామ్యాన్ని దేశంలో హత్య కావిస్తోందని మీడియా సమావేశం పెట్టి మరీ కాషాయం పార్టీ పరువు తీసిన కేసీయార్ ఇపుడు ఊరకే చేతులు ముడుచుకుని కూర్చుంటారు అని ఎవరూ అనుకోవడంలేదు. పైగా మోడీ షాల సొంత స్టేట్ అయిన గుజరాత్ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి తన శక్తి మేరకు ఆయన పనిచేస్తారు అని అంటున్నారు. ఎటూ మునుగోడు ఉప ఎన్నిక పూర్తి అయింది ఇక బీయారెస్ ని విస్తరించే పనిలోనే కేసీయార్ పడ్డారు అని అంటున్నారు.

గుజరాత్ లో చూస్తే ఆప్ బీజేపీకి గట్టి సవాల్ చేస్తోంది. దాంతో పాటు ఆప్ అధినేత కేజ్రీవాల్ తో కేసీయార్ కి మంచి రిలేషన్స్ ఉన్నాయి. దాంతో గుజరాత్ లో ఆప్ కి బీయారెస్ మద్దతు ప్రకటించడం ఖాయమని అంటున్నారు. అదే విధంగా గుజరాత్ నుంచి విమానం వేసుకుని మరీ వచ్చిన ఒకనాటి బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా కూడా బీయారెస్ కి మద్దతు ఇచ్చారు. దాంతో అక్కడ వాఘేలాకు మద్దతుగా బీయారెస్ నిలబడుతుందని అంటున్నారు.

వేడి మీద ఉన్న టీయారెస్ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారాన్ని మోడీ సొంత గడ్డ మీదనే చర్చకు పెట్టి తేల్చుకునేందుకు కేసీయార్ రెడీ అవుతారు అని అంటున్నారు. ఒక విధంగా చూస్తే తాను జాతీయ నాయకుడిగా ఎదిగేందుకు ఇదే సరైన సమయం అని కూడా ఆయన భావిస్తున్నారుట.

సో ఎలా చూసుకున్న కేసీయార్ స్పెషల్ ఫ్లైట్ డైరెక్ట్ గా హైదరాబాద్ నుంచి వెళ్ళి ల్యాండ్ అయ్యేది గుజరాత్ లోనే అని అంటున్నారు. అయితే కేసీయార్ దూకుడుకు కళ్ళెం వేసే కొత్త ఎత్తులు బీజేపీ వద్ద ఉన్నాయని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఆయనని ఇరికించి తమాషా చూడడానికి కమలనాధులు కూడా సై అంటారని అంటున్నారు. చూడాలి మరి గులాబీ బాస్ తో కాషాయధారుల సమరంలో ఎవరు పై చేయి సాధిస్తారో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News