కొత్త సంవత్సరంలో కేసీఆర్ మార్క్ బాదుడు?

Update: 2016-11-03 05:52 GMT
వెన్నపూస రాసినట్లుగా మాట్లాడుతూనే.. వాతలు పెట్టే అలవాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మామూలే. నిత్యం కలల్ని ఆవిష్కరించే ఆయన నోరు తెరిస్తే చాలు రంగుల సినిమా కళ్ల ముందు కనిపించేస్తుంది. కేసీఆర్ పాలనలో ప్రజలు ఉండటాన్ని అదృష్టంగా భావించాలన్నట్లుగా చెప్పే మాటలు ఒకపక్క.. తాము తప్పితే ఇంకెవరికీ పాలన రాదన్నట్లుగా వ్యవహరించే తీరు తెలంగాణ అధికారపక్షం  నోటి మాటలతో తరచూ స్పష్టమవుతూ ఉంటుంది. పథకాల మీద పథకాలు ప్రకటించే కేసీఆర్.. వాటి స్థానే.. ప్రజలకు నేరుగా ప్రయోజనం కలిగేలా.. పన్నులబాదుడు మీద కాస్త కనికరం చూపించండి మహా ప్రభో అంటే మాత్రం అస్సలు పట్టించుకోరనే చెప్పాలి.

ఈ ముచ్చట ఇలా ఉన్నా.. కొత్త సంవత్సరం వేళ.. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సరికొత్త నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర సర్కారు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. రైల్వే స్టేషన్ల మాదిరి.. బస్లాండ్లలోకి ప్రవేశించాలంటే రూ.5 ఫ్లాట్ ఫాం టికెట్ కొనుగోలు చేయాలన్న నియమాన్ని పెట్టాలని ఆలోచిస్తున్నారు. వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభించాలని భావిస్తున్న ఈ పథకాన్నితొలుత హైదరాబాద్ లోని సీబీఎస్.. జేబీఎస్ బస్టాండ్లలో స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు.

నష్టాల్లో తల్లడిల్లుతున్న ఆర్టీసీకి అదనపు ఆదాయాన్ని సమకూర్చేందుకు ఏం చేస్తే బాగుంటుందన్న విషయంపై సమాలోచనలు చేసిన అధికారులు.. టికెట్ చార్జీల పెంపు కారణంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉన్నందున.. రైల్వేస్టేషన్లలో ఫ్లాట్ ఫాం టికెట్ల మాదిరి.. బస్టాండ్లలో కూడా అమలు చేయాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. అయితే.. దీనికి ప్రభుత్వ ఆమోద ముద్ర పడాల్సి ఉంది. తొలుత హైదరాబాద్ లోని రెండు ప్రధాన బస్టాండ్లలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి..  ఫలితాల్ని పరిశీలించిన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నఅన్ని జిల్లాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. అయితే.. బస్టాండ్ల స్థాయికి తగ్గట్లుగా ఫ్లాట్ ఫాం టికెట్ ధర ఉండాలన్న కోణంలో ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే.. కొత్త సంవత్సరంలో సరికొత్త బాదుడుకి తెలంగాణ అధికారపక్షం సిద్ధమైందన్న మాట అధికార వర్గాల నోట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News