గులాబీ ద‌ళాన్ని గ‌మ్మున ఉండ‌మ‌న్న కేసీఆర్‌

Update: 2017-05-23 07:02 GMT
తెలంగాణ‌ను టార్గెట్ చేసుకున్న బీజేపీ.. అందులో భాగంగా బీజేపీ చీఫ్ అమిత్ షా రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌ల్ని టీఆర్ఎస్‌ నిశితంగా ప‌రిశీలిస్తోంది. ఆయ‌న ఎక్క‌డేం మాట్లాడుతున్నారు? ప‌్ర‌భుత్వంపై ఎలాంటి విమ‌ర్శ‌లు చేస్తున్నారు? ఆయ‌న మాట‌ల వ‌ల్ల ప్ర‌భుత్వానికి క‌లిగే న‌ష్టం ఎంత‌న్న అంశంపై తెలంగాణ అధికార‌ప‌క్షం జాగ్ర‌త్త‌గా లెక్క‌లేస్తోంది.

అమిత్ షా ప్ర‌సంగాల్ని నిశితంగా ప‌రిశీలించాలే త‌ప్పించి.. తొంద‌ర‌ప‌డి ఆయ‌న మాట‌కు మాట అనొద్ద‌ని.. త్వ‌ర‌ప‌డి విమ‌ర్శ‌లు చేయొద్దంటూ టీఆర్ఎస్ అధినేత‌.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

తెలంగాణ‌లో మూడు రోజుల పాటు ప‌ర్య‌టించున్న అమిత్ షా.. ప‌లు గ్రామాల్లో ప‌ర్య‌టించి కేంద్రం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు ఎలా అందుతున్నాయ‌న్న విష‌యాన్ని ప‌రిశీలించ‌నున్నారు. ఇదే స‌మ‌యంలో.. తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌కు తాము త‌ప్పించి మ‌రెవ‌రూ ప్ర‌త్యామ్నాయం కానే కాద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌టంతో పాటు.. 2019లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తామే విజ‌యం సాధిస్తామ‌న్న మాట‌ను చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో అమిత్ షా ప‌ర్య‌ట‌న‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాలే కానీ.. త్వ‌ర‌ప‌డి ఎదురుదాడి చేయొద్ద‌ని పార్టీ క్యాడ‌ర్‌కు ఆదేశాలు జారీ అయిన‌ట్లుగా చెబుతున్నారు. ప‌వ‌ర్ లోకి వ‌చ్చి మూడేళ్లు కావ‌టం.. కేంద్రంలోని మోడీ స‌ర్కారుతో సంబంధాలు ఒకింత బాగున్న వేళ‌.. త్వ‌ర‌ప‌డి నోరు జారితే న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం ఉంద‌న్న భావ‌న‌ను టీఆర్ఎస్ అధినాయ‌క‌త్వం వ్య‌క్తం చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల వ్య‌వ‌ధి ఉన్న నేప‌థ్యంలో సంక్షేమ కార్య‌క్ర‌మాల విష‌యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కొత్త త‌ర‌హాలో దూకుడు పెంచ‌టం తెలిసిందే. కోర‌కుండానే వ‌రాల వ‌ర్షం కురిపిస్తున్న ఆయ‌న‌.. రైతులు.. మ‌హిళ‌ల‌తో పాటు.. వివిధ కుల వృత్తుల‌కు అడ‌గ‌కుండానే వ‌రాలు ఇచ్చేస్తున్నారు. మ‌రోవైపు తెలంగాణ‌లో పాగా వేయ‌టం ద్వారా ద‌క్షిణాదిన  త‌మ బ‌లాన్ని పెంచుకోవాల‌న్న త‌హ‌త‌హ బీజేపీలో అంత‌కంత‌కూ పెరుగుతోంది. కేసీఆర్ స‌ర్కారుపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతుంద‌న్న భావ‌న‌లో ఉన్న బీజేపీ.. క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తే ఫ‌లితం ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇదిలా ఉంటే.. కేంద్రంలో భాగ‌స్వామ్యం కాకున్నా.. మోడీ స‌ర్కారుతో స్నేహంగా ఉంటూనే రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు అవ‌స‌ర‌మైన ప‌నుల్ని చేయించుకుంటున్న వేళ‌.. అమిత్ షా మీద నోరు జారితే దాని ప్ర‌భావం కేంద్ర - రాష్ట్ర సంబంధాల మీద ఉంటుంద‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. అందుకే.. అమిత్ షా తాజా ప‌ర్య‌ట‌న‌ను కామ్ గా ప‌రిశీలించి.. ఒక అంచ‌నా త‌ర్వాత బీజేపీ మీద ఎలాంటి ఎదురుదాడి చేయాలో డిసైడ్ చేయాల‌ని టీఆర్ఎస్ అధినాయ‌క‌త్వం అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వ్యూహాత్మ‌క మౌనాన్ని ఆశ్ర‌యించాలే కానీ.. తొంద‌ర‌ప‌డి మాట జార కూడ‌ద‌ని క్యాడ‌ర్‌కు కేసీఆర్ స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు.


Tags:    

Similar News