ముంబైలో కేసీఆర్.... ఎవరెవరిని కలిశారంటే?

Update: 2019-06-14 12:59 GMT
టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ ముఖ్యమంత్రి శుక్రవారం మధ్యాహ్నం మహారాష్ట్ర రాజధాని ముంబైలో ల్యాండయ్యారు. హైదరాబాద్ లో ఫ్లైటెక్కి.... ముంబైలో దిగీ దిగంగానే కేసీఆర్ బిజీ అయిపోయారు. ముంబై ఎయిర్ పోర్టు నుంచి నేరుగా రాజ్ భవన్ చేరుకున్న కేసీఆర్ అక్కడ హహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుతో భేటీ అయ్యారు. ఆ తర్వాత రాజ్ భవన్ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్... నేరుగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వద్దకు వెళ్లిపోయారు. ఫడ్నవీస్ తోనూ చాలా సేపు చర్చలు జరిపిన కేసీఆర్... ఈ నెల జరగనున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. గవర్నర్ విద్యాసాగర్ రావును కూడా కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు.

అయినా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్రకు చెందిన వారిని కేసీఆర్ ఎందుకు పిలుస్తున్నారన్న విషయానికి వస్తే... కాళేశ్వరం ప్రాజెక్టుపై గోదావరికి ఎగువన ఉన్న మహారాష్ట్రతో భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకూడదన్న భావనతో కేసీఆర్ వ్యవహరించిన విషయం తెలిసిందే కదా. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు, పునరావాసం తదితరాలపై మహారాష్ట్ర సీఎంగా ఉన్న ఫడ్నవీస్ తో కేసీఆర్ ఓ ఒప్పందం చేసుకున్నారు. భవిష్యత్తు వివాదాలకు తావు లేని విధంగా వ్యవహరించాలన్న కేసీఆర్ ఆలోచనను స్వాగతించిన ఫడ్నవీస్... కేసీఆర్ కోరిందే తడవుగా తెలంగాణతో ఓ కీలక ఒప్పందానికి జైకొట్టారు. ఈ  క్రమంలో కుదిరిన ఒప్పందంపై ఇరు రాష్ట్రాల సీఎంల హోదాలో ఫడ్నవీస్, కేసీఆర్ సంతకాలు చేశారు. మహారాష్ట్రతో కుదిరిన ఒప్పందం కారణంగానే కాళేశ్వరం త్వరితగతిన పూర్తి అయ్యిందని కూడా చెప్పక తప్పదు.

ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఫడ్నవీస్ తో పాటు మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న తెలంగాణ వాసి విద్యాసాగర్ రావును కేసీఆర్ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు ఫడ్నవీస్ తో పాటు విద్యాసాగర్ రావు కూడా కాళేశ్వరం ప్రారంభోత్సవానికి తప్పనిసరిగానే హాజరయ్యే అవకాశాలున్నాయి. ఇక కాళేశ్వరం ఆహ్వానాలను మహారాష్ట్ర నుంచే ప్రారంభించిన కేసీఆర్ ముంబైలొ బిజీ బిజీగానే గడిపారు. ఒకే రోజు సీఎం, గవర్నర్ లను ఆహ్వానించడంతో పాటు పలువురు ప్రముఖులను కూడా ఆయన కాళేశ్వరం ప్రారంబోత్సవానికి ఆహ్వానించినట్లుగా సమాచారం.

Tags:    

Similar News