మోడీకి కేసీఆర్ ఆహ్వానం వెన‌క‌..!

Update: 2016-07-17 10:41 GMT
సెంటిమెంటును ఎక్కువ‌గా న‌మ్మే తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఎందురు ఎన్ని అన్న‌ప్ప‌టికీ.. తాను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన ఆయుత చండీ యాగాన్ని అంబ‌రాన్నంటే సంబ‌రంతో నిర్వహించి జాతీయ స్థాయి మీడియాలోనూ సంచ‌ల‌నం సృష్టించారు. సీఎం హోదాలో ఉండి యాగాలు చేసిన తొలి సీఎంగా కూడా ఆయ‌న రికార్డు సృష్టించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే.. యాగాలు చేస్తాన‌ని - తిరుమ‌ల వెంక‌న్న‌కు - బెజ‌వాడ దుర్గ‌మ్మ‌కు మొక్కులు మొక్కుకున్న కేసీఆర్ ఇప్ప‌టికే తిరుమ‌ల వెంక‌న్న మొక్కును తీర్చేశారు కూడా. దీనికి ముందే ఆయుత చండీ యాగాన్ని నిర్విఘ్నంగా ఘ‌నంగా ఆకాశ‌మంత పందిరి వేసి..  ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కు ఎంద‌రో ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించి దీనిని ప‌రిస‌మాప్తి చేశారు.

 తాజాగా.. కేసీఆర్ మ‌రో యాగానికి సిద్ధ‌మైన‌ట్టు క‌నిపిస్తోంది. ఈ సారి ఆయ‌న సుద‌ర్శ‌న యాగం నిర్వ‌హిస్తున్న‌ట్టు స‌మాచారం. దీనికి కూడా కేసీఆర్ వ్య‌వ‌సాయ క్షేత్రం(ఫాం హౌస్‌) వేదిక కానుంది. ఇక‌, ఈ యాగం నిర్వ‌హించ‌డం వెనుక‌ కేసీఆర్ సెంటిమెంట్ ఏమై ఉంటుంద‌నేది స‌ర్వ‌త్రా తొలిచేస్తున్న ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతానికి ఈ విష‌యం స‌స్పెన్స్‌ లో ఉంది. కాగా, తన సొంత నియోజకవర్గంలో మిషన్ భగీరథను ప్రారంభించడంతో పాటు సుదర్శన యాగాన్ని నిర్వ‌హించాల‌ని ప‌క్కా ప్లాన్ సిద్ధం చేసిన కేసీఆర్ ఈ యాగానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని సాద‌రంగా ఆహ్వానించనున్న‌ట్టు తెలిసింది. గ‌తంలో నిర్వ‌హించి ఆయుత చండీయాగానికి మోడీని ఆహ్వానించినా.. కొన్ని కార‌ణాల‌తో ఆయ‌న రాలేక‌పోయారు. కానీ, యాగం విజయవంతంగా పూర్తి చేసినందుకు కేసీఆర్ ను అభినందిస్తూ లేఖ పంపారు.

కానీ, ఈ ద‌ఫా మాత్రం ప్ర‌ధాని వ‌చ్చేలా ప‌క్కా ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నార‌ట కేసీఆర్‌. అదేవిధంగా గ‌తంలో ఆహ్వానించినా వెళ్ల‌లేని ప‌రిస్థితి వ‌చ్చింద‌ని, ఈ సారి మాత్రం త‌ప్ప‌కుండా వెళ్లాల‌ని ప్ర‌ధాని మోడీ నిర్ణ‌యించుకునే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. ఇదే జ‌రిగితే.. ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టాక మోడీ తొలిసారి తెలంగాణకు రావ‌డంతో పాటు.. అందునా సీఎం కేసీఆర్ సెంటిమెంట్ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన‌ట్టు ఉంటుంద‌ని, ఇది రికార్డేనన్న  చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.
Tags:    

Similar News