ఈపాస్ లొల్లితో కేసీఆర్ కు చిరాకు.. త్వరలో కీలక నిర్ణయం

Update: 2021-06-15 10:30 GMT
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో  లాక్ డౌన్ విధించటం తెలిసిందే. దీంతో.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి విషయంలో పరిమితులు విధించటం.. రాష్ట్రానికి వచ్చే వారు ఎవరైనా సరే.. తప్పనిసరిగా ఈపాస్ తీసుకోవాలన్న నిబంధనను తెర మీదకు తీసుకొచ్చారు. లాక్ డౌన్ పరిమితుల్ని దశల వారీగా ఎత్తేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్ డౌన్ ను ఎత్తేయటం తెలిసిందే.

లాక్ డౌన్ ఎత్తేసినప్పటికీ.. ఆ వేళలోనూ తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాలనుకునే ప్రయాణికులతో కూడిన వాహనాలు తప్పనిసరిగా ఈపాస్ ను వెంట తెచ్చుకోవాల్సిందే. ఒకవేళ ఎవరిదగ్గరైనా ఈపాస్ లేకుంటే వారిని తెలంగాణలోకి అనుమతించకుండా ఏపీకి తిరిగి పంపిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం తరచూ వివాదంగా మారుతోంది. ఆదివారం సంగతే చూస్తే.. ఏపీ నుంచి వచ్చిన దాదాపు 1500లకు పైగా వాహనానాలను తెలంగాణ పోలీసులు ఏపీకి తిప్పి పంపించటం తెలిసిందే. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఉదంతం మీడియాలోనూ పెద్ద ఎత్తున కవర్ అయ్యింది. ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారట. ఏపీ నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాల్ని నిలిపివేసేందుకు కారణమైన ఈపాస్ సంగతి చూడాలని అధికారులకు సూచించినట్లు చెబుతున్నారు. లాక్ డౌన్ ను సడలించి.. రానున్న రోజుల్లో మరింత సడలించే అవకాశం ఉన్నందున.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈపాస్ పంచాయితీని తేల్చేయాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నారని.. అలాంటప్పుడు ఏపీ నుంచి తెలంగాణలోకి వచ్చే వారికి మాత్రం కచ్ఛితంగా ఈపాస్ ఉండాలనటం సరికాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈపాస్ ఎత్తేయాలన్న యోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఎందుకంటే.. కేసుల నమోదు భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈపాస్ అవసరం లేదన్న భావనకు ఆయన వచ్చినట్లుగా తెలుస్తోంది. అన్ని అనుకుంటే త్వరలోనే ఈపాస్ ఎత్తివేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఈపాస్ లేకుండా చేస్తే.. ఒక లొల్లి పోతుందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News