ఇద్ద‌రు చంద్రుళ్లు చెప్పిన‌ట్లే చేశాన‌న్న సీఎం

Update: 2018-06-06 04:26 GMT
క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు.  బీజేపీతో జ‌ట్టు క‌ట్ట‌కుండా కాంగ్రెస్ తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టం వెనుక త‌న‌కున్న అండ గురించి సంచ‌ల‌న విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌ల‌హాల‌తోనే తాను కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న‌ట్లుగా ఆయ‌న వెల్ల‌డించారు.

ఇద్ద‌రు చంద్రుళ్లు మాత్ర‌మే కాదు.. ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెనర్జీ కూడా కాంగ్రెస్ తో వెళ్లాల‌న్న సూచ‌న చేసిన‌ట్లుగా చెప్పారు. కేసీఆర్‌.. చంద్ర‌బాబులు త‌న‌తో మాట్లాడార‌ని.. వారు కాంగ్రెస్ తో అవ‌గాహ‌న వ‌చ్చి సెక్యుల‌ర్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల‌ని.. రాబోయే రోజుల్లో ఈ నిర్ణ‌యం లాభిస్తుంద‌ని చెప్పిన‌ట్లుగా వెల్ల‌డించారు.

వారి సూచ‌న‌తోనే తాను కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్ట‌న్లుగా వెల్ల‌డించారు. ది వీక్ అనే ప‌త్రిక‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల్ని వెల్ల‌డించారు.

ఇంట‌ర్వ్యూలో కుమార‌స్వామి చెప్పిన మాట‌ల్లో కీల‌క విష‌యాల్ని చూస్తే..

+ బీజేపీ.. కాంగ్రెస్ ల‌లో ఎక్కువ‌గా బీజేపీ నుంచే ముప్పు ఉంది

+ 2006లో బీజేపీతో క‌లిసి సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశా. అది మా నాన్న‌కు ఇస్టం లేదు.

+ బీజేపీతో క‌ల‌వ‌టం కార‌ణంగా ఏళ్ల త‌ర‌బ‌డి సంపాదించుకున్న సెక్యుల‌ర్ ఇమేజ్ మొత్తం నా వ‌ల్ల దెబ్బ‌తింది

+ 1997లో వాజ్ పేయ్ కోరిన‌ప్పుడు కూడా మ‌ద్ద‌తు ఇవ్వ‌లేదు. నా నిర్ణ‌యం కార‌ణంగా నాన్న ఆరోగ్యం ఖ‌రాబైంది

+ దీన్ని స‌రిదిద్దాల‌న్న ఉద్దేశంతోనే తాజా నిర్ణ‌యం తీసుకున్నా. నాన్న ఇమేజ్ ను ఈసారైనా కాపాడాల‌నుకున్నా.

+ నేను ఎందుకూ ప‌నికి రాన‌ని మా నాన్న న‌న్ను త‌ర‌చూ తిట్టే వారు.

+ చిన్న‌ప్పుడు బాగా చ‌దివి ఉంటే ఐఏఎస్ అయ్యేవాడిని.

+ కానీ.. ఏం చేద్దాం.. జీవితంలో ఎన్నో మార్పులు వ‌స్తాయి క‌దా!

+ చ‌దువులో మొద్దునే. వెనుక బెంచీల్లో కూర్చునేవాడిని.

+ ముందు బెంచీల్లోకూర్చుంటే ఏదైనా ప్ర‌శ్న అడుగుతార‌న్న భ‌యం ఉండేది.

+ సినీ న‌టుడు రాజ్ కుమార్‌కు వీరాభిమానిని.  ఆయ‌న సినిమాలు మిస్ కాకుండా చూసేవాడిని.

+ కాంగ్రెస్‌ లో క‌ల‌వ‌టం కార‌ణంగా జేడీఎస్ ఉనికికి ఎలాంటి ఢోకా ఉండ‌దు


Tags:    

Similar News