ఆ ఇష్యూలో కేసీఆర్‌.. బాబు సేమ్ టు సేమ్‌

Update: 2017-12-08 04:46 GMT
చేసింది చూస్తూ ఉండాలి. ఒక‌వేళ అడ‌గాలంటే ముద్దుముద్దుగా మాట్లాడాలే కానీ ప్ర‌శ్నించేట‌ట్లు అస్స‌లు ఉండ‌కూడ‌దు. ఆగ్రహం పాల‌కుల‌కు ఉండాలే కానీ ప్ర‌తిప‌క్షానికి కాదు. విమ‌ర్శించ‌టం అధికార‌ప‌క్షానికి ఆయుధం కావాలే కానీ.. ఆ ఆయుధం అవ‌స‌రం గురించి కూడా విప‌క్షం ఆలోచించ‌కూడ‌దు. అధికారం త‌మ‌కు మాత్ర‌మే ఉండాలి. ఆ దిశ‌గా ఎవ‌రూ ఆలోచించ‌కూడ‌దు. ఒక‌వేళ ఆలోచించే తత్త్వం ఉన్న‌ట్లు అనిపిస్తే.. ఎన్ని యాంగిల్స్ లో ఇబ్బంది పెట్టాలో అన్ని యాంగిల్స్ లో ఇబ్బంది పెట్టాలి. ఇలాంటి ల‌క్ష‌ణాలు ఎవ‌రికి ఉంటాయో నిత్యం రాజ‌కీయ వార్త‌ల్ని.. తెలుగు రాష్ట్రాల్లో పాలిటిక్స్ చూసే వారికి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు.

తెలంగాణ‌లో త‌ర‌చూ క‌నిపించే దృశ్యం ఒక‌టి తాజాగా ఏపీలో క‌నిపించింది. తెలంగాణ స‌ర్కారు పెద్ద ఎత్తున ప్రాజెక్టుల్ని చేప‌ట్టింది. కాంగ్రెస్ హ‌యాంలో పూర్తికాని ప్రాజెక్టుల్ని చేప‌ట్టి.. వాటిని పూర్తి చేయ‌టం ఒక ఎత్తు అయితే.. మ‌రికొన్ని ప్రాజెక్టుల్ని రీడిజైనింగ్ పేరుతో రూపురేఖ‌లు మార్చేశారు. దీని కార‌ణంగా ఖ‌ర్చు పెర‌గ‌టంతో పాటు.. మ‌రిన్ని అంశాలు తెర మీద‌కు వ‌చ్చాయి.

దీనిపై తెలంగాణ రాష్ట్ర విప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ.. ప్రాజెక్టుల విష‌యంలో స‌ర్కారు తీరును త‌ప్పుప‌డుతూ కోర్టుల్లో కేసులు వేశారు. న్యాయ‌పోరాటానికి దిగారు. ఈ తీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు కోపం తెప్పిస్తోంది. ప్రాజెక్టుల్ని అడ్డుకోవ‌టానికి.. అభివృద్ధికి చెక్ పెట్టేలా కాంగ్రెస్ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. అవ‌స‌రం లేకున్నా.. కోర్టుల్లో కేసులు వేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు.

కేసీఆర్ కు కౌంట‌రిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు.. ప్రాజెక్టుల‌కు సంబంధించి లోపాలు లేకుండా ఉంటే తాము కేసులు ఎందుకు వేస్తామ‌ని బదులిస్తారు. కేసులు విష‌యంపై త‌మ‌కున్న సందేహాల్ని ఎత్తి చూపుతున్న కాంగ్రెస్ నేత‌ల‌కు కేసీఆర్ సంతృప్తిక‌ర‌మైన స‌మాధానాలు ఇవ్వ‌టం లేద‌న్న విమ‌ర్శ ఉంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూడా కేసీఆర్ తీరులో రియాక్ట్ కావ‌టం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పోల‌వ‌రంపై అఖిల‌ప‌క్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాల‌న్న సూచ‌న చేసిన మిత్రుడు ప‌వ‌న్ మాట‌ను కొట్టిపారేయ‌ట‌మేకాదు.. అఖిల‌ప‌క్షం వేసి అన‌వ‌స‌ర‌మైన వివాదం చేసుకోవాలా? అని ప్ర‌శ్నిస్తుంటారు. అంతేకాదు. ప్రాజెక్టుల విష‌యంలో కోర్టుల‌కు వెళుతూ అభివృద్ధిని అడ్డుకుంటున్నార‌న్నారు.

కేంద్రం ద‌గ్గ‌ర ఒక మాట‌.. కోర్టుల ద‌గ్గ‌ర మ‌రో మాట మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డ ఆయ‌న‌.. రాష్ట్రంలో చేప‌ట్టిన ప్ర‌తి సాగునీటి ప్రాజెక్టును విప‌క్ష నేత‌లు అడ్డుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. మొన్న‌టి వ‌ర‌కూ పోల‌వ‌రం కాంట్రాక్ట‌ర్‌ను తాము స‌మ‌ర్థిస్తున్న‌ట్లుగా త‌ప్పు ప‌ట్టార‌ని.. ఇప్పుడేమో పోల‌వ‌రం కాంట్రాక్ట‌ర్‌ ను వ్య‌తిరేకంగా ఉన్నామంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప్రాజెక్టుల విష‌యంలో కేసీఆర్ నోట్లో నుంచి ఏ త‌ర‌హాలో మాట‌లు వ‌స్తాయో.. తాజాగా అదే రీతిలో చంద్ర‌బాబు నోటి నుంచి వ్యాఖ్య‌లు వ‌చ్చాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఏపీ ముఖ్య‌మంత్రిలో కేసీఆర్ కోణం తాజా వ్యాఖ్య‌ల్లో క‌నిపించింద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయ‌.
Tags:    

Similar News