అదేదో.. ఢిల్లీలోనే చేయాల్సింది కేసీఆర్

Update: 2016-11-23 04:15 GMT
కొన్ని నిర్ణయాల్ని ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది. ఓపక్క ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్న వేళ.. వారి తిప్పల్నితగ్గించే ప్రయత్నం చేయాల్సిన అవసరం పాలకుల మీద ఉంటుంది. నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజల కష్టాల్ని పూర్తి స్థాయిలో తీర్చలేకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వాలు తాము చేయగలిగిన పనిని చేయాల్సిన అవసరం ఉంది. కానీ.. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు చేసిందేమీ లేదని చెప్పక తప్పదు. ఒకవేళ తమకు ఐడియాలు రాకున్నా.. పక్కనున్న రాష్ట్రాలు ఏం చేస్తున్నారో చూసి.. వారిని ఫాలో అయినా కొంతలో కొంత చిక్కులు తగ్గే వీలుంది.

రద్దు నిర్ణయం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చి పడే ఇబ్బందులపై అధ్యయనం చేసే విషయంలో బిజీ అయిపోయిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. అందుకు తగినట్లుగా మేధావులు.. ఆర్థికవేత్తలు.. సీనియర్ అధికారులతో వరుస భేటీలు నిర్వహించారు. తాను తెలుసుకున్న విషయాల్ని ప్రధానికి చెప్పటంతో పాటు.. నోట్ల రద్దు కారణంగా చోటు చేసుకుంటున్న ఇబ్బందులకు పరిష్కారాల్ని తెలిపే ప్రయత్నం చేశారు. కేసీఆర్ మాటలతో కన్వీన్స్ అయిన ప్రధాని.. ఆయన్ను ఢిల్లీకి రావాలని.. తనను కలవాలని కోరారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. ప్రధాని మోడీతో పాటు.. కేంద్రమంత్రులు పలువురిని కలుసుకొన్నారు. రాష్ట్రానికి అవసరమైన అంశాల్ని ప్రస్తావించారు. అంతాబాగానే చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని తీర్చే అంశంపై పెద్దగా ఫోకస్ చేయని పరిస్థితి. తమ పక్కనున్న మరో తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎక్కడికి వెళ్లకుండా ప్రజలు ఎదుర్కొంటున్న చిల్లర కష్టాలపై ఫోకస్ చేసి.. ఆర్ బీఐ తో మాట్లాడుకొని.. తమకు అర్జెంట్ గా కరెన్సీ కావాలని.. బ్యాంకుల్లో తీవ్ర కొరతను ఎదుర్కొంటున్న విషయాన్ని తెలియజేయటమే కాదు.. ముంబయికి రాష్ట్ర సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా పంపించి.. రాష్ట్రానికి అవసరమైన చిల్లర నోట్లలో కొంతమొత్తాన్ని తెచ్చుకోగలిగారు.

చంద్రబాబు చొరవతో ఆర్ బీఐ రూ.2200 కోట్ల కరెన్సీని ఏపీకి పంపింది.ఈ మొత్తం ఆదివారం నాటికే ఏపీకి చేరిపోయింది. ఇదే సమయంలో.. కరెన్సీ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా ప్రయత్నించింది లేదు. తాజాగా తమకు రూ.5వేల కోట్ల కరెన్సీ కావాలని.. అర్జెంట్ గా పంపాలంటూ తెలంగాణ సర్కారు లేఖరాసింది. ఇదేదో.. మొన్న ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి.. ప్రధానితోనో.. కేంద్ర ఆర్థికమంత్రితోనో చెప్పి యుద్ధ ప్రాతిపదికన తెప్పించుకుంటే.. ప్రజలు నోట్ల కష్టాలు ఎంతోకొంత తగ్గేది.

తన ఢిల్లీ పర్యటనలో గుర్తించని ముఖ్యమంత్రి.. రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత కరెన్సీ నోట్ల కోసం ఆర్ బీఐకి లేఖ రాయటం చూస్తే.. ప్రజలు పడుతున్న కష్టాల్నితీర్చే విషయంలో కేసీఆర్ సర్కారు చురుగ్గా వ్యవహరించటం లేదన్న భావన కలగటం ఖాయం. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో తెలంగాణోని బ్యాంకులకు రూ.8వేల కోట్ల విలువైన నోట్లను ఆర్ బీఐ పంపిణీ చేసింది. ఇందులో అత్యధికం రూ.2వేల నోట్లు కాగా.. మిగిలినవి రూ.100నోట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తంలో దాదాపు రూ.6వేల కోట్ల నగదు మార్పిడి జరిగిందని చెప్పొచ్చు. ఆర్ బీఐ కొత్తగా విడుదల చేసిన రూ.500నోట్లు రాకపోవటంతో చిల్లర సమస్య తెలంగాణలో తీవ్రంగా ఉంది.

ఈ కారణంతోనే రాష్ట్రంలో 7548 ఏటీఎంలు ఉన్నప్పటికీ.. ప్రజలకు అక్కరకు రాకుండా పోయిన పరిస్థితి. ఇంత భారీగా ఏటీఎంలు ఉన్నప్పటికీ.. వాటిల్లో 3620 ఏటీఎంలు మాత్రమే కొత్త నగదును జారీ చేసేలా మారగా.. వాటిల్లో 1653 ఏటీఎంలు మాత్రమే నగదు అందుబాటులో ఉన్నట్లుగా బ్యాంకర్లు చెబుతున్నారు. ఓపక్క ఏటీఎంలు పని చేయకపోవటం.. కరెన్సీ నోట్ల కొరతతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురి అవుతున్నారు. ఈ నేపథ్యంలో నోట్ల కొరతను తీర్చేందుకు వీలుగా రూ.5వేల కోట్ల మొత్తాన్ని అర్జెంటుగా రాష్ట్రానికి పంపాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఆ పనేదో ముందే చేసి ఉంటే.. ఈపాటికి అదనంగా ఎంతోకొంత కరెన్సీ నోట్లు వచ్చి ఉండేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానికే సలహాలు ఇచ్చే ముఖ్యమంత్రి.. ప్రజల కష్టాలు తీర్చే అంశంపై ఎందుకంత ఆలస్యంగా స్పందించినట్లు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News