ఏపీ కాంగ్రెస్‌ నేతలూ.. సెక్షన్‌ 8 మీద మీ మాటేమిటి?

Update: 2015-06-23 10:53 GMT
విభజన చట్టంలోని సెక్షన్‌8 వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరింత మంట పుట్టించేలా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరిస్తున్న గవర్నర్‌ నరసింహన్‌కు అటార్నీ జనరల్‌ నోటి మాటగా సలహా ఇస్తూ.. సెక్షన్‌ 8 ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు సమాన అధికారాలు ఉంటాయని చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ అధికారపక్షం ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొదలుకొని.. తెలంగాణ అధికారపక్ష నేతలు పలువురు ఈ అంశంపై ఇప్పటికే తమ వాదనను వినిపిస్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి అడుగు ముందుకు పడినా.. ఆందోళనలు చేస్తామని.. ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీక్ష చేస్తారన్న మాట కూడా చెబుతున్నారు.

తెలంగాణ అధికారపక్షానికి తోడుగా.. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సైతం విభజన చట్టంలోని సెక్షన్‌ 8 చెల్లదని.. హైదరాబాద్‌ మొత్తం తెలంగాణ రాష్ట్ర కంట్రోల్‌లోనే ఉండాలన్న మాటను చెబుతున్నారు.

తెలంగాణ అధికార.. విపక్షానికి సంబంధించిన నేతలు సెక్షన్‌ 8 మీద రియాక్ట్‌ అవుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపై ఏపీ కాంగ్రెస్‌ నేతలు వాదన ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చిన్న చిన్న విషయాలకు ఢిల్లీ వెళతామని.. ఏపీ ప్రజల ప్రయోజనాలే తమకు కీలకమన్నట్లుగా ఈ మధ్య తెగ బిల్డప్‌లు ఇస్తున్న ఏపీ కాంగ్రెస్‌ నేతలు విభజన చట్టంలోని సెక్షన్‌ 8 మీద తమ వాదనను ఏమని వినిపిస్తారో..?
Tags:    

Similar News