తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దు డేట్ ఫిక్స్?

Update: 2018-08-25 03:50 GMT
తెలంగాణ రాజకీయ ప‌రిణామాలు వేగంగా మారిపోతున్నాయి. మొన్న‌టి వ‌ర‌కూ ముంద‌స్తు ఒక మాట‌గా మాత్ర‌మే ఉండేది. అది కాస్తా.. రియాల్టీలోకి వ‌చ్చేయ‌ట‌మే కాదు.. త‌ర్వాతి ప‌రిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్వ‌హించిన పార్టీ విస్తృత‌స్థాయి స‌మావేశంలో త‌న ఆలోచ‌న‌ల్ని స్ప‌ష్టంగా చెప్ప‌ట‌మే కాదు.. ఈ ఏడాది చివ‌రి నాటికి ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నున్న అంశానికి సంబంధించి స్ప‌ష్ట‌మైన సంకేతాల్ని ఇచ్చేశార‌న్న అభిప్రాయం స్ప‌ష్టంగా వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇదిలా ఉంటే.. ముంద‌స్తుకు కీల‌క‌మైన అసెంబ్లీ ర‌ద్దు ఎప్పుడన్న‌ది ఇప్పుడో ప్ర‌శ్న‌గా మారింది. దీనికి స‌మాధానం వ‌చ్చేసింది. వ‌చ్చే నెల ఆరు లేదంటే ఏడు తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దు అన్న విష‌యాన్ని వెల్ల‌డించిందో మీడియా సంస్థ‌. ఏదో మాట వ‌ర‌స‌కు కాకుండా.. దానికున్న లాజిక్కును వెల్ల‌డించింది.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అంటూ తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దు డేట్ల‌ను ప్ర‌క‌టించ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. పంచాంగాన్ని.. గ్ర‌హ‌బ‌లాన్ని.. తారాబ‌లాన్ని బాగా న‌మ్మే కేసీఆర్‌.. జాత‌క‌రీత్యా.. రాజ‌కీయ రీత్యా అన్ని లెక్క‌లూ స‌రి చూసుకునే ర‌ద్దు ముహుర్తాన్ని ఎంచుకున్న‌ట్లుగా చెబుతున్నారు.
 
తెలంగాణ భ‌వ‌న్ లో ఏర్పాటు చేసిన టీఆర్ ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ.. శాస‌న‌స‌భాప‌క్షం.. రాష్ట్ర క‌మిటీ సంయుక్త స‌మావేశంలో మాట్లాడిన కేసీఆర్ మ‌రో 10.12 రోజుల త‌ర్వాత క‌లుద్దామ‌ని మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలతో అన్నారు. ఎంతో ప్రాధాన్య‌త ఉంటే త‌ప్పించి.. తర‌చూ భేటీలు కేసీఆర్ కు ఇష్టం లేని విష‌యాల‌న్న‌వి తెలిసిందే.

స‌మావేశం జ‌రిగింది 24.. మ‌రో ప‌ది.. ప‌న్నెండు రోజుల అంటే.. సెప్టెంబ‌రు నాలుగు అవుతుంది. ఆ త‌ర్వాత అంటే ఐదో తేదీ అవుతుంది. ఐదో తేదీని చూస్తే.. ఆ రోజు ఆరుద్ర న‌క్ష‌త్రం.. మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల వ‌ర‌కూ ఉంది. అది కేసీఆర్ జ‌న్మ‌న‌క్ష‌త్ర‌మైన ఆశ్లేష‌కు నైధ‌న‌తార. అంటే.. అదే మాత్రం సూట్ కాదు. ఇక మిగిలిన ఆరో తేదీ విష‌యానికి వ‌స్తే.. ఆ రోజు ఏకాద‌శి.. గురువారం పున‌ర్వ‌సు న‌క్ష‌త్రం. అది కూడా మ‌ధ్యాహ్నం ఒక‌టిన్న‌ర వ‌ర‌కూ ఉంది. ఆ త‌ర్వాత పుష్య‌మి న‌క్ష‌త్రం వ‌స్తుంది. వీటిల్లో పున‌ర్వ‌సు కేసీఆర్ కు మిత్ర తార అయితే.. పుష్య‌మి ప‌ర‌మ‌మైత్ర తార‌.

గ్ర‌హ‌బ‌లాన్ని బాగా న‌మ్మే కేసీఆర్ కు ఆ రోజు బాగా క‌లిసి వ‌చ్చే రోజు. త‌ర్వాతి ఏడో రోజు కూడా బాగానే ఉన్నా.. జాత‌క బ‌లం ప్ర‌కారం చూస్తే.. ఆరోరోజు దివ్యంగా ఉంటుంద‌న్న మాట ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే కేసీఆర్ అదృష్ట సంఖ్య ఆరు. వీట‌న్నింటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే అసెంబ్లీ ర‌ద్దుకు సెప్టెంబ‌రు ఆరో తేదీ దివ్య‌మైన ముహుర్తంగా భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. సెప్టెంబ‌రు ఆరేడు తేదీలే ఎందుకు కావాలి?  త‌ర్వాతి రోజులు ఎందుకు స‌రిపోవు అంటే.. దానికి లెక్క‌లు ఉన్నాయి. సెప్టెంబ‌రు 12 కూడా బాగానే ఉంది. కేసీఆర్ జాత‌కానికి ఆ తేదీ కూడా సూట్ అవుతుంది. అయితే.. గ్ర‌హ‌చారాన్ని బ‌లంగా న‌మ్మే కేసీఆర్ అశుభంగా భావించే శూన్య మాసం లో అసెంబ్లీని ర‌ద్దుచేస్తారా? అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. అదే స‌మ‌యంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌..రాజ‌స్థాన్.. ఛ‌త్తీస్ గ‌ఢ్‌.. మిజోరాంల‌లో డిసెంబ‌రు 15 లోపు ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్తి కావాల్సి ఉంది. ఒక‌వేళ ఆ రాష్ట్రాల‌తో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని  అనుకుంటే సెప్టెంబ‌రు 30 లోపు అసెంబ్లీని ర‌ద్దు చేసి.. ఆ విష‌యాన్ని ఈసీకి అంద‌జేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఇన్ని లెక్క‌ల్ని తీసుకుంటే.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు క‌మిష‌న్ కు 90 నుంచి 100 రోజులు అవ‌స‌రం. ఈ అంశాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే సెప్టెంబ‌రు ఆరు తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దుకు దివ్య‌మైన ముహుర్తంగా అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి.. అధికారికంగా కేసీఆర్ ఈ విష‌యాన్ని ఎప్పుడు ఎలా ప్ర‌క‌టిస్తారో చూడాలి.
Tags:    

Similar News