సెప్టెంబ‌రు 10లోపే అసెంబ్లీ ర‌ద్దు..ఎందుకంటే?

Update: 2018-08-26 05:08 GMT
ముంద‌స్తుకు వెళ్లే ఆలోచ‌న‌లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. అందుకు సంబంధించిన పావుల్ని చ‌క‌చ‌కా క‌దుపుతున్న సంగ‌తి తెలిసిందే. ముంద‌స్తు నిర్వ‌హించ‌టం ద్వారా భారీ ఫ‌లితాన్ని ఆశిస్తున్న ఆయ‌న‌.. ఎక్క‌డా ఎలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మ‌న‌సులోకి ఇలా వ‌చ్చిన ఐడియాను అలా అమ‌లు చేయ‌కుండా ప‌క్కాగా ఆయ‌న అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా జ‌ర‌గ‌టానికి వీల్లేని రీతిలో ఎదుర‌య్యే సాంకేతిక అంశాల్ని సైతం కేసీఆర్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నార‌ని చెబుతున్నారు. కేంద్రంతో స‌న్నిహితంగా ఉండ‌టం.. ప్ర‌ధాని మోడీతో ద‌గ్గ‌ర‌గా ఉంటూ ఆయ‌న చేత చేయించుకోవాల్సిన ప‌నుల్ని చేయించుకుంటున్న తీరు చూస్తే.. కేసీఆర్ తెలివి ఇట్టే అర్థం కాక మాన‌దు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. మోడీపైన భ‌రోసా పెట్టుకొని ముంద‌స్తుకు సిద్ధ‌మ‌వుతున్న కేసీఆర్.. ఏదైనా తేడా కొడితే..తాను అనుకున్న‌ట్లుగా షెడ్యూల్ కంటే ముందే ఎన్నిక‌లు జ‌ర‌గ‌టానికి అవ‌స‌ర‌మైన సాంకేతిక అంశాల్ని ప్లాన్ బిగా రెఢీ చేసుకున్న‌ట్లు చెప్పాలి.

మ‌రింత వివ‌రంగా చెప్పాలంటే.. ఈ ఏడాది న‌వంబ‌రు లేదంటే డిసెంబ‌రులో అసెంబ్లీ ఎన్నిక‌ల్ని పూర్తి చేయాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్నారు. ఇందుకు ప్ర‌ధాన‌మంత్రి చేత లోగుట్టుగా ఓకే చేయించుకున్నా.. ఆయ‌న ప్లాన్ కు గండి కొట్టేలా ఈసీ వ్య‌వ‌హ‌రిస్తే?  మొద‌టికే మోసం వ‌స్తుంది. గ‌తంలో అంటే.. 2003లోనూ చంద్ర‌బాబు మ‌హా కాన్ఫిడెంట్ గా ముంద‌స్తుకు వెళ్లేందుకు సిద్ధమై.. స‌రిగా క‌స‌ర‌త్తు చేయ‌కుండా అసెంబ్లీని ర‌ద్దు చేస్తే.. ఆయ‌న కోరుకున్న‌ట్లు కాకుండా త‌ర్వాత ఎన్నిక‌ల్ని నిర్వ‌హిస్తూ ఈసీ నిర్ణ‌యం తీసుకుంది.

తాజాగా అలాంటి ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదురుకాకుండా కేసీఆర్ జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. అసెంబ్లీ ర‌ద్దు త‌ర్వాత ఆర్నెల్ల లోపు ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సిందేన‌ని.. ఇందులో ఎవ‌రి జోక్యం ఉండ‌ద‌ని చెప్పినా.. న‌చ్చ‌న‌ప్పుడు ఎలాగైనా కొర్రీ పెట్టే అంశాలు ఉంటాయి. అందుకే.. అలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేలా కేసీఆర్ ప్లానింగ్ ఉంద‌ని చెప్పాలి.

ప్ర‌జాప్రాతినిధ్య చ‌ట్టంలో కానీ రాజ్యాంగంలో కానీ అసెంబ్లీ ర‌ద్దు త‌ర్వాత ఎన్ని నెల‌ల లోపు ఎన్నిక‌లు నిర్వ‌హించాలి? అన్న అంశంపై స్ప‌ష్ట‌త లేక‌పోవ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. అయితే.. గుజ‌రాత్ కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పు ప్ర‌కారం ఆర్నెల్ల లోపు ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సిందేన‌ని చెబుతున్నారు. ఈ కార‌ణంలోనే సెప్టెంబ‌రు 10 లోపు అసెంబ్లీని ర‌ద్దుచేస్తే.. కేసీఆర్ కోరుకున్న‌ట్లుగా ఎన్నిక‌లు జ‌రిగే వీలుంది.

అంతేకాదు.. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 174 ప్ర‌కారం ఒక అసెంబ్లీ స‌మావేశానికి.. మ‌రో అసెంబ్లీ స‌మావేశానికి మ‌ధ్య గ‌రిష్ఠంగా ఆర్నెల్ల గ‌డువు త‌ప్ప‌నిస‌రి. ఈ నేప‌థ్యంలో సార్వ‌త్రికెన్నిక‌లతో ముడిప‌డ‌ని రీతిలో అసెంబ్లీని ర‌ద్దు చేసి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.  ఓవైపు ప్ర‌ధాని మోడీ భ‌రోసా కోరుతున్న‌ట్లే క‌నిపిస్తూ.. మ‌రోవైపు సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేలా ముంద‌స్తును తాము కోరుకున్న‌ట్లే జ‌రిగేలా కేసీఆర్ ప‌క్కా ప్లానింగ్ తో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News