కేసీఆర్ మౌనం.. మరో పెను తుఫానేనా.?

Update: 2018-09-21 06:20 GMT
కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే దాని వెనుకు ఏదో జరగబోతోందని అందరూ గ్రహించాల్సిందే.. ఆయన మౌనం వెనుక తుఫాన్ ఉంటుందని టీఆర్ఎస్ సీనియర్లు కథలు కథలుగా చెబుతారు. ఉద్యమ సమయంలో ఆయనపై ఎన్ని విమర్శలు వచ్చినా చాలా రోజులు బయటకు వచ్చే వారు కాదు.. ఎంత డ్యామేజ్ జరిగినా నోరు మెదిపే వారు కాదు.. ఆ తర్వాత సభలోనో, సమావేశంలోనో విరుచుకుపడుతూ సెంటిమెంట్ రగిల్చి ప్రజలందరి దృష్టి తనవైపు తిప్పుకునే వారు. అప్పటి వరకూ వచ్చిన విమర్శల్ని ఒక్క దెబ్బతో పొగొట్టే సానుభూతి పొందేవారు. ఆ అలవాటు కేసీఆర్ కు ఎప్పటినుంచో ఉందనేది ఆయన సన్నిహితుల మాట..

తెలంగాణ ఏర్పడ్డప్పుడు కూడా మీడియా అంతా కక్షకట్టి తనను అభాసుపాలు చేస్తూ పక్క రాష్ట్రం ఏపీ సీఎం చంద్రబాబును నెత్తిన పెట్టుకున్నప్పుడు కేసీఆర్ మౌనం వహించారు. చాలా రోజులు వెయిట్ చేసి అంసెబ్లీలో ఎమ్మెల్యేలను మీడియా  అవమానించిన తీరును ఎండగట్టి ఏకంగా కొన్ని చానెల్స్ ను తెలంగాణలో నిషేధించి మొత్తం మీడియానే తన కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు.

ఓటుకు నోటు కేసు ముందర కూడా కేసీఆర్ చాలా గుంభనంగా వ్యవహరించారు. చంద్రబాబు డబ్బులతో ఎమ్మెల్సీలకు ఎరవేసి గెలుద్దామని ప్రయత్నించినప్పుడు ఏ మీడియా కానీ.. ఎవ్వరూ కానీ అసలు ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఇలా బాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కవుతాడని.. కేసీఆర్ అంత సైలెంట్ గా ఉండి  బాబును బుక్ చేస్తాడని అనుకోలేదు. ఇది జాతీయ స్థాయిలో పెనుదుమారమే రేపింది.

ఇప్పుడు కొండా సురేఖ దంపతులు టీఆర్ ఎస్ పై తిరుగుబావుటా ఎగురవేసి హెచ్చరికలు పంపినా కేసీఆర్ స్పందించడం లేదు. వారి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మౌనం వహించాడు. మీడియా ముందుకు, ప్రజల్లోకి రావడం లేదు. ఫామ్ హౌస్ లోనే ఉంటూ సైలెంట్ గా గెలుపు వ్యూహాలు - ఎత్తుగడలు రచిస్తున్నారు. కేసీఆర్ వ్యూహాత్మక మౌనం తర్వాత ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వైరి వర్గాల్లో వ్యక్తమవుతోంది.

మహాకూటమి పొత్తుల ఎత్తులను కేసీఆర్ చాలా నిశితంగా గమనిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ బలం పుంజుకోకుండా.. కూటమిని ఎత్తులను చిత్తు చేసేలా వ్యూహరచన చేస్తున్నట్టు చెబుతున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ సీనియర్లకు చెక్ పెట్టేందుకు వారి స్థానాలపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇలా కేసీఆర్ ప్రస్తుత వ్యూహాత్మక మౌనం ఎంత పెద్ద అలజడిని రేపుతుందోనన్న టెన్షన్ టీఆర్ ఎస్ శ్రేణులనే కాదు.. ప్రతిపక్షాలను షేక్ చేస్తోంది.
   

Tags:    

Similar News