కేసీయార్...చంద్రబాబుతో ముచ్చట్లు ఉంటాయా...?

Update: 2022-10-06 11:38 GMT
కేసీయార్ జాతీయ పార్టీని పెట్టారు. దాని పేరు బీయారెస్ గా మార్చారు. అంటే కేసీయార్ పార్టీకి ఇపుడు హద్దులు లేవు. ఆయన ఎక్కడైనా వెళ్ళి పోటీ చేయవచ్చు. ఎక్కడ నుంచి అయినా తన రాజకీయాన్ని చేయవచ్చు. ఆ విధంగా టీయారెస్ పరిధులను పరిమితులను ఆయన తెంచేసి మొత్తం రాజకీయాన్ని విస్తృతం చేసారు. దీంతో ఆయనకు ఏపీలో కూడా రాజకీయాలు నిశితంగా పరిశీలించేందుకు అవకాశం, అవసరం పడ్డాయని అనుకోవాలి.

మరి టీడీపీ అధినేత చంద్రబాబు తీరు చూస్తే తానూ జాతీయ పార్టీ అధినేత అంటున్నారు. ఆయన కూడా తెలంగాణాలో ఏపీలో రెండు చోట్లా టీడీపీ ఉందని చెప్పుకుంటున్నారు. ఈ కీలక సమయంలో కేసీయార్ చంద్రబాబుతో ముచ్చట్లు ఏమైనా పెడతారా అన్న చర్చ అయితే రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది.

నిజానికి చూస్తే రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండదు. చంద్రబాబుకు కేసీయార్ కి మధ్య కూడా గ్యాప్ అయితే ఉంది కానీ అది పూడ్చలేనిది కాదు అనే అంటారు. ఇప్పటిదాకా ఆ అవసరం కూడా రాలేదు. ఇపుడు కేసీయార్ జాతీయ రాజకీయం అంటున్నారు కాబట్టి ఆయన అడ్వాన్స్  స్టెప్ తీసుకుని బాబుతో మాట్లాడుతారా అన్న చర్చ అయితే ఉంది.

చంద్రబాబుతో కేసీయార్ త్వరలో సమావేశమై అన్ని విషయాలూ మాట్లాడతారు అని అంటున్నారు. కేసీయార్ కి ఏపీ రాజ‌కీయాల్లో స్పేస్ అవసరం. అక్కడ తన రాజకీయం పండాలి అంటే సోలోగా దిగితే ఏమీ లాభం లేదు. అందువల్ల పొత్తులు పెట్టుకుంటేనే ఎన్నో కొన్ని సీట్లు వస్తాయి. ఏపీలో సీన్ చూస్తే వైసీపీ అయితే పొత్తులకు సుముఖం కాదు. దాంతో అక్కడ విషయం పక్కా క్లారిటీగా ఉంది. ఇక అతి పెద్ద పార్టీగా టీడీపీ ఉంది. దాంతో చంద్రబాబుతో చర్చలు జరిపి ఆయనను ఒప్పించి ఏపీలో బీయారెస్ టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నట్లుగా చెబుతున్నారు.

దానికి బదులుగా తెలంగాణాలో టీడీపీకి బీయారెస్ కొన్ని సీట్లు ఇస్తుంది అని కూడా అంటున్నారు. ఇలా పొత్తు పెట్టుకుంటే ఉభయ కుశలోపరిగా ఉంటుందని కేసీయార్ లెక్కలు వేస్తున్నారు అని అంటున్నారు. ఇక టీడీపీతో పొత్తు ఉంటే కనుక కచ్చితంగా ఏపీలో కొన్ని సీట్లను గెలుచుకోవడంతో పాటు జాతీయ పార్టీగా బీయారెస్ కి గుర్తింపు లభిస్తుంది అని అంటున్నారు.

అయితే బీయారెస్ పార్టీ మీద మీ కామెంట్ ఏంటి అని మీడియా అడిగితే చంద్రబాబు ఒక నవ్వు నవ్వేశారు. అంటే బాబు ఎటూ ఇంకా తేల్చలేదు అన్న మాట. అయితే ఇక్కడ చంద్రబాబు గురించి చెప్పుకోవాలి. ఆయనకు పొత్తులు అంటే ఎపుడూ ఇష్టమే. అవి తన రాజకీయానికి అనుకూలంగా ఉంటే ఆయన స్వాగతిస్తారు కూడా.

ఏపీలో జగన్ని ఓడించాలనుకుంటున్న చంద్రబాబుకు టీయారెస్ కలసివస్తామంటే సంతోషమే కదా. పైగా 2019 ఎన్నికల్లో కేసీయార్ రిటర్న్ గిఫ్ట్ వల్లనే బాబు ఓడారు. ఇపుడు ఆ గిఫ్ట్ ఏదో జగన్ కి కూడా ఇప్పించాలని ఆయన అనుకోవడంతో తప్పు లేదు, అది రాజకీయ ఎత్తుగడ కూడా. పొత్తు పెట్టుకుని కేసీయార్ ని ఏపీకి రప్పిస్తే ఆయన జగన్ మీద చెడుగుడు ఆడడం ఖాయం. ఆ విధంగా రాజకీయంగా తనకు లాభిస్తుంది అనుకుంటే బాబు ఏమైనా చేస్తారు అని అంటున్నారు

అయితే బాబు ఇపుడు బీజేపీతో మైత్రి కోసం చూస్తున్నారు. అయితే బీజేపీ కేంద్రంలో బలంగా ఉందని బాబు ఆలోచిస్తున్నారు. ఒకవేళ 2024 ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు రావని తెలిసినా అలాగే మోడీ మళ్లీ ప్రధాని కారని అంచనాకు వచ్చినా బాబు తన ప్లేట్ మార్చేస్తారు. అపుడు ఆయన పొత్తులకు బీయారెస్ ని ఆహ్వానించినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే మీడియా ముందు ఒక నవ్వు నవ్వి అన్ని ఆప్షన్ల‌ను  బాబు దగ్గర పెట్టుకున్నారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే టీడీపీ నాయకులే టీయారెస్ నిండా ఉన్నారు. వారంతా ఈ రోజుకీ బాబుకు సన్నిహితులే. మరి వారి సలహా సూచనలు అటు కేసీయార్ కి ఇటు చంద్రబాబుకు కూడా ఉంటాయి కాబట్టి ఈ ఇద్దరు నేతలూ కలసి భేటీలు వేసినా ఆశ్చర్యపోనవసరం లేదనే అంటున్నారు. మొత్తానికి కేసీయార్ బాబు చేతులు కలిపితే ఏపీలో జగన్ కి అతి పెద్ద దెబ్బ అవుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News