ఒవైసీ తో కేసీఆర్ భారీ ప్లాన్ !

Update: 2018-12-11 13:16 GMT
తెలంగాణ ఎన్నికలలో ముందస్తు ఎన్నికలలో ఊహించని విజయంతో జోష్‌ మీదున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు జాతీయ స్థాయి రాజకీయాలలో చక్రం తిప్పనున్నారు. అదికూడా తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడిలా గుడ్డిగా వెళ్లడం కాకుండా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఇందుకోసం మజ్లిస్ పార్టీ అధినేత అసద్దుద్దిన్‌ తో చేతులు కలుపుతున్నారు. వీరిద్దరూ దేశంలోని ప్రధాన పార్టీల నాయకులను కలవడమే కాకుండా దేశవ్యాప్తంగా చెల్లాచెదురుగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకుందుకు పాచికలు వేస్తున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు య‌థాలాపంగా ప్రకటించారు. అసదుద్దిన్ ఒవైసీకి దేశవ్యాప్తంగా ముస్లింలలో మంచి పట్టుంది. అలాగే కేసీఆర్‌ కు  కొన్ని వర్గాలలో మద్దతుంది. వీటికి తోడు తెలంగాణలో సాధించిన అపూర్వ విజయం కూడా కేసీఆర్‌ కు తోడవుతుంది. అసదుద్దిన్ బలగం - కేసీఆర్ బలం రెండు కలసి జాతీయ స్దాయి రాజకీయాలలో ఓ ఊపు తీసుకు రానున్నాయి. ఇప్పటికే బంగ్లాదేశ్ నుంచి సరిహద్దు రాష్ట్రాలు తరలి వచ్చిన ముస్లిం మైనారిటీల పట్ల భారతీయ జనతా పార్టీ కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఈ వివాదం జాతీయ స్దాయిలో రగులు కుంటోంది. ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు - అసదుద్దిన్ ఒవైసీ ఏర్పాటు చేసే కొత్త కూటమిలో ఇదే ప్రధానాంశం కానుంది. దీంతో పాటు రైతులు ఇంకో పెద్ద అజెండా.

జాతీయ స్దాయిలో భారతీయ జనతా పార్టీ - కాంగ్రెస్ పార్టీలను బలహీన పరిచేందుకు మైనారిటీల మద్దతు కీలకం కానుంది. దీనిని గుర్తించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన మిత్రుడు - మజ్లిస్ అధ్య‌క్షుడు అసదుద్దిన్ తో కలసి కూటమిగా ఏర్పడి ఇతర పార్టీలను కూడా కలుపుకోవాలని వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ - కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి - తమిళనాడులో డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్‌ లతో కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమావేశమయ్యారు. ఉత్తరాదిలో ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీలతో కూడా సమావేశం కానున్నారు. ఈ నెల 10 వ తేదీన చంద్రబాబు నాయుడు ఢిల్లీలో 14 పార్టీలతో సమవేశం నిర్వహించారు. అయితే తెలంగాణ ఫలితాలు తర్వాత ఆ కూటమి నాయకులు చంద్రబాబును విశ్వసించే అవకాశం తగ్గింది. చంద్రబాబును నమ్ముకుంటే తిప్పలు తప్పవనే ఆలోచనతో ఆ పార్టీల నాయకులలో కొంద‌రు కేసీఆర్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు. అయితే, కేసీఆర్ అజెండాపై అది ఆధార‌ప‌డి ఉంటుంది. పైగా కేసీఆర్ తీసుకు వచ్చిన మైనార్టీ ఓట్ల ఫార్ములా కూడా బీజేపీ కాంగ్రెస్‌ లను ఇరుకున పెడుతుందని అన్ని పార్టీలు విశ్వసించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవ‌ల బీజేపీ మీద గెల‌వ‌డానికి కాంగ్రెస్ ముస్లింలను కొంచెం దూరం పెడుతోంది. దీనిని క్యాచ్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నారు కేసీఆర్. ప్ర‌స్తుతం ఆ ప్లాన్‌ పైనే వ‌ర్క‌వుట్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News