జీయర్ స్వామి ఆశ్రమానికి కేసీఆర్.. అక్కడి నుంచి ఫోన్ చేసిందెవరికంటే?

Update: 2022-01-10 04:43 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లారు. అప్పుడప్పుడు ఆయన వద్దకు వెళ్లడం.. ఆయన ఆశీస్సులు తీసుకోవటంతో పాటు.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన యాదాద్రి ఆలయం గురించి ఆయనతో చర్చలు జరపడం తెలిసిందే. తాజాగా ముచ్చింతల్ లోని జీయర్ ఆశ్రమానికి వెళ్లిన సీఎం కేసీఆర్.. స్వామితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణ చేపట్టాలని.. 21 నుంచి మహా సుదర్శన యాగం నిర్వహించాలన్న పాత నిర్ణయం గురించి మరోసారి మాట్లాడటం గమనార్హం.

అంతేకాదు.. దీనికి సంబంధించిన ఏర్పాట్లు.. ఆహ్వానాలకు సంబంధించిన పనుల గురించి ఆయనతో చర్చించారు. తన కలల ప్రాజెక్టు గురించి చర్చించిన కేసీఆర్.. జీయర్ స్వామి కలల ప్రాజెక్టు అయిన రామానుజాచార్యులు విగ్రహావిష్కరణ ఏర్పాట్ల గురించి కూడా చర్చించడం గమనార్హం. ఆశ్రమంలో నిర్వహించే యాగానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాల్సింది రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించటం విశేషం.

ఆశ్రమంలో నిర్వహించే యాగం సందర్భంగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండాలని ఆదేశించటం ఆసక్తికరంగా మారింది. ఆశ్రమం నుంచే ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితో ఫోన్ లో మాట్లాడిన కేసీఆర్.. యాగం వేళ నాన్ స్టాప్ గా విద్యుత్ సరఫరా ఉండాలని.. మిషన్ భగీరథ నీళ్లు అందించాలని అధికారులకు చెప్పారు. యాగానికి సంబంధించిన అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని.. యాగశాల వద్ద ఫైరింజన్లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారుల్ని కోరారు.

ఇదంతా వినేందుకు.. చూసేందుకు బాగున్నట్లు కనిపించినా.. తెలంగాణలో కనురెప్ప మాటున కూడా కరెంటు పోవటం లేదని అదే పనిగా చెప్పే కేసీఆర్.. యాగం వేళ.. నాన్ స్టాప్ గా కరెంటు ఉండాలని ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ.. ఆ శాఖ పెద్దాయనకు చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే.. కనురెప్ప మాటున కూడా కరెంటు పోదన్న తన మాట మీద ముఖ్యమంత్రి కేసీఆర్ కు సందేహాలు ఉన్నాయా? అన్న సందేహం రాక మానదు. కాదంటారా? అయినా.. ఆశ్రమంలో జరిగే యాగం.. ప్రభుత్వ కార్యక్రమం కాదే? మరి.. దానికి ఇంతలా హడావుడి చేయటం.. ముఖ్యమంత్రే స్వయంగా వచ్చి ఆదేశాలు జారీ చేయటం ఏమిటి చెప్మా?


Tags:    

Similar News