రాజ్ భవన్ లో కేసీఆర్.. అలా మొదలై.. ఇలా ముగించారట

Update: 2022-06-29 03:34 GMT
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భేటీ పూర్తైంది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై తీరు నచ్చక.. తానేమిటో ఇప్పటికే చూపించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తప్పనిసరి పరిస్థితుల్లో రాజ్ భవన్ కు వెళ్లాల్సి రావటం తెలిసిందే. తమిళ సైకు ముందు గవర్నర్ గా వ్యవహరించిన ఈ.ఎస్.ఎల్.నరసింహన్ ను గులాబీ బాస్ ఎంతగానో అభిమానించే వారే కాదు.. అంతకు మించిన ప్రేమాభిమానాల్ని పంచేవారు. గవర్నర్ పదవి నుంచి వైదొలిగిన తర్వాత వీడ్కోలు పలకటం కోసం ఎయిర్ పోర్టుకు వెళ్లిన వైనాన్ని మర్చిపోలేం. దేశంలో మరే ముఖ్యమంత్రి కూడా రాజ్ భవన్ కు వెళ్లి.. గవర్నర్ తో గంటల పాటు భేటీ కాని రీతిలో కేసీఆర్ వ్యవహరించేవారు.

అలాంటి ఆయన తమిళ సై గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే రాజ్ భవన్ కు వచ్చారు. మొదట్లో తమిళ సై.. కేసీఆర్ మధ్య బాగానే ఉన్నా.. ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డిని నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ తమిళ సై.. పెండింగ్ లో పెట్టటం నుంచి వారి మధ్య దూరం పెరిగింది.

అది అంతకంతకూ పెరగటమే కాదు.. గడిచిన తొమ్మిది నెలలుగా  రాజ్ భవన్ కు కూడా వెళ్లని పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఈ మధ్యనే ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుతో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తమిళ సై ఓపెన్ గానే చెప్పటం సంచలనంగా మారింది.

అయినప్పటికి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తన తీరును మార్చుకోలేదు. సీఎంతో విభేదాలు మొదలైన నాటి నుంచి రాజ్ భవన్ లో ఆమె నిర్వహిస్తున్న కార్యక్రమాలు కేసీఆర్ సర్కారుకు చురుకుపుట్టిస్తున్నాయి. ఇలాంటి వేళ.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారోత్సవం రాజ్ భవన్ లో జరగటం.. దీనికి తప్పక హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడటంతో.. చాలా కాలం తర్వాత ఆయన రాజ్ భవన్ లోకి అడుగు పెట్టారు.

ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన సందర్భంగా ఆయన తీరు ఎలా ఉంటుందన్న అంశంపై బోలెడంత చర్చ జరుగుతోంది. మంగళవారం రాజ్ భవన్ కు వెళ్లినఆయన మొదట్లో ముభావంగా ఉన్నట్లు కనిపించారు.

అయితే.. ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. అతిధిమర్యాదల్లో లోటు లేకుండా గవర్నర్ జాగ్రత్తలు తీసుకున్నారన్న మాట వినిపిస్తోంది. దీంతో.. మొదట్లో ముభావంగా వ్యవహరించిన సీఎం కేసీఆర్.. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత నిర్వహించిన తేనీటి విందులో గవర్నర్.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కలిసి ఉన్న సందర్భంగా చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. దీంతో వాతావరణం తేలిక పడిందన్న వాదన వినిపిస్తోంది. అయితే.. ఇదంతా తాత్కాలికమా? రానున్న రోజుల్లోనూ కంటిన్యూ అవుతుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News