సీఎం పదవి ప్రజలు పెట్టిన భిక్ష: కేసీఆర్

Update: 2021-04-14 14:02 GMT
ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని.. పరిణతితో ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ ప్రజలకు సూచించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియా పరిధిలోని అనుములలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు.

తనకు జానారెడ్డి సీఎం పదవిని భిక్షగా పెట్టారని కొందరు చెబుతున్నారని.. సీఎం పదవి వస్తే ఆయనే ముఖ్యమంత్రి అయ్యేవాడని.. తనకు సీఎం పదవి ప్రజలు పెట్టిన భిక్ష అని సీఎం కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ నేతలు సక్కగుంటే గులాబీ జెండా ఎందుకు ఎగిరిందని కేసీఆర్ ప్రశ్నించారు.

పదవుల కోసం తెలంగాణను కాంగ్రెస్ వదిలిపెడితే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పదవులు వదులుకుందన్నారు. 60 ఏళ్లు పాలించి తెలంగాణను ఆగమాగం చేశారని కేసీఆర్ ఆరోపించారు.హాలియాలో సభకు ఎన్నో అడ్డంకులు సృష్టించాలని చాలా మంది చూశారని కేసీఆర్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు పెట్టుకోవచ్చని.. తనను ప్రజలతో కలువకుండా చేయాలనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో విచక్షణతో ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. వాస్తవాలు కళ్లముందే ఉన్నాయని.. ప్రజలు ఆగం కాకుండా ఓటేయాలని కేసీఆర్ కోరారు. కాంగ్రెస్ నేత జానారెడ్డి నాగార్జున సాగర్ కు చేసింది శూన్యమని కేసీఆర్ ఆరోపించారు. 30 ఏళ్ల అనుభవం ఉన్న జానారెడ్డి హాలియాకు డిగ్రీ కాలేజీ కూడా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు నీళ్లు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

మిత్రుడు నోముల నర్సింహాయ్యను కోల్పోవడం బాధాకరమని కేసీఆర్ చెప్పారు. వామపక్ష పార్టీల్లో ఉంటూ ఉద్యమించిన ఆయనను గుర్తించి ఆయన కొడుకు నోముల భగత్ ను ఆశీర్వదించాలని కోరారు.
Tags:    

Similar News