పార్టీల ఫ్రంట్ కాదు.. మాది ప్రజల ఫ్రంట్ : కేసీఆర్‌

Update: 2018-03-19 13:27 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త‌న రాజ‌కీయ జ‌ర్నీలో మ‌రో కీల‌క ఘ‌ట్టానికి ఇవాళ మొద‌టి అడుగు వేశారు. పశ్చిమ బెంగాల్ సచివాలయంలో మమతా బెనర్జీతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వాగతం పలికారు. ఆ రాష్ట్ర సచివాలయం చేరుకున్న కేసీఆర్‌కు.. మమత పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానం పలికారు. సీఎం కేసీఆర్ కూడా మమతకు పుష్పగుచ్ఛం ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావుతో మమత కాసేపు ముచ్చటించారు. అనంతరం మమత.. సీఎం కేసీఆర్‌ తో సహా తెలంగాణ ప్రతినిధులను సచివాలయంలోకి తీసుకువెళ్లి ఈ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ - ఎజెండా - ఇతర విషయాలపై చర్చిస్తున్నారు. దాదాపుగా రెండు గంటలకు పైగా ఈ సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడి ప్రసిద్ధ కాళీమాత ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు.

ఈ స‌మావేశం అనంత‌రం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.  దేశంలో గుణాత్మకమైన మార్పు కోసం తొలి అడగు పడిందని అన్నారు. ప్రజల అవసరాలు తీర్చడంలో కాంగ్రెస్ - బీజేపీలు విఫలమయ్యాయని కేసీఆర్ అన్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీతో భేటీ సంతృప్తికరంగా జరిగిందని తెలిపారు. ఏర్పాటు చేయబోయే ఫ్రంట్ పార్టీల ఫ్రంట్ కాదని, ప్రజల కోసం అని సీఎం అన్నారు. 70 ఏళ్ల కాంగ్రెస్ - బీజేపీ పాలనలో ఏం జరిగిందో అందరికీ తెలుసని, దేశంలో ఎన్ని సహజ వనరులున్నా ప్రజలకు జరిగింది శూన్యమని కేసీఆర్ అన్నారు. తమది ఇప్పటివరకున్న రోటీన్ మోడల్ ఫ్రంట్ కాదని, మాదో భిన్నమైన మొడల్ ఫ్రంట్ - ఫెడరల్ ఫ్రంట్ - ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉంటుందని సీఎం స్ఫష్టం చేశారు. దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారన్నారు.

పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ మీడియాతో మాట్లాడుతూ ఇది ఒక శుభపరిణామంగా భావిస్తున్నామన్నారు.  భవిష్యత్‌లో తమదే అతిపెద్ద కూటమి అని  స్పష్టం చేశారు. తెలంగాణ ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాలు - భవిష్యత్ కార్యాచరణ,- ఎజెండా ఇతర అంశాలపై చర్చించామ‌ని తెలిపారు. మిగతా పార్టీలను కూడా త్వరలో కలుస్తామని సీఎం మమతాబెనర్జీ తెలిపారు. సమావేశంలో రైతులు - వ్యవసాయంతోపాటు అన్ని అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. భావసారూప్యత గల అన్ని పార్టీలను కలుపుకొని పోతామని తెలిపారు.
Tags:    

Similar News