కేసీఆర్ మాట‌..మాది బీ టీం కాదు..స్టేట్స్ టీం

Update: 2018-12-24 03:44 GMT
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకువస్తామని - కచ్చితంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అయితే ఫ్రంట్ ఏర్పాటు విషయంలో తొందరపాటుకు పోకుండా సరైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ తో కేసీఆర్ భేటీ ముగిసింది. తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. భేటీ వివరాలు వెల్లడించారు. ``దేశంలో గుణాత్మక మార్పు అవసరం. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. దేశంలో ఇంకా చాలామంది నాయకులతో మాట్లాడే అవసరం ఉంది. ఇప్పుడే మా ప్రయత్నాలు మొదలు పెట్టినం. త్వరలో మరోసారి నవీన్ పట్నాయక్‌ తో భేటీ అవుతా. నవీన్ పట్నాయక్ రైతుల కోసం చేస్తున్న కృషి అభినందనీయం. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. రైతు బంధు లాంటి పథకాన్ని ఒడిశాలో అమలు చేస్తున్నందుకు సంతోషం. మరికొంత మంది జాతీయ స్థాయి నేతలతో చర్చలు జరుపుతాను. మేం ఎవరికీ తోక పార్టీలం కాదు. దేశంకోసం ఏదైనా చేయాలనే అభిప్రాయాన్ని నవీన్ పట్నాయక్ వెలిబుచ్చారు`` అని సీఎం కేసీఆర్ తెలిపారు.

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుతో పాటు దేశ రాజకీయాలపై ఇరువురూ చర్చించామని కేసీఆర్ తెలిపారు. బీజేపీ-కాంగ్రెస్‌ కి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ఈ కలయిక ఉపయోగపడుతుందన్నారు. రాజకీయాల్లో గుణాత్మక మార్పు అవసరం అని నవీన్ చెప్పారని కేసీఆర్ తెలిపారు. త్వరలో మరోసారి ముఖ్యమంత్రి నవీన్‌ ను కలుస్తానని కేసీఆర్ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని కలయికలు ఉంటాయని తెలియజేశారు. మేం ఎవరికీ బీ-టీమ్ కాదు.. మాది స్టేట్స్ టీమ్ అని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ - బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఏర్పాటు రానుందని.. ప్రత్యామ్నాయ ఫ్రంట్‌పై తమకు నమ్మకం ఉందని అన్నారు. మరికొంతమంది ప్రాంతీయ పార్టీల నేతలతో కలుస్తానని కేసీఆర్ చెప్పారు. దేశం కోసం ఏదైనా చేయాలని పట్నాయక్ తనతో చెప్పినట్టు కేసీఆర్ మీడియాకు తెలిపారు.
Tags:    

Similar News