ముందస్తు ఎన్నికల చర్చ వేళ.. ఊళ్లోనే ఉండాలంటూ కేసీఆర్ అల్టిమేటం

Update: 2022-07-13 05:30 GMT
దమ్ముంటే కేంద్రం ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికల తేదీని ప్రకటిస్తే.. తాము కూడా అసెంబ్లీని రద్దు చేస్తామంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటతో రాజకీయ వాతావరణం వేడెక్కిపోయిన వైనం తెలిసిందే.

ఓపక్క జోరు వర్షాలు కురుస్తూ..చలితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా.. పొలిటికల్ హీట్ మాత్రం ఓ రేంజ్లో ఉన్న పరిస్థితి. దీంతో ముందస్తు ఎన్నికలు రానున్నాయా? లేదంటే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయా? అన్న చర్చ అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

ఇదిలా ఉంటే.. పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పార్టీ ఎమ్మెల్యేలంతా తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్ని వీడొద్దని.. ఎవరికి వారు ఊళ్లల్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

ఎమ్మెల్యేలంతా ప్రజాక్షేత్రంలోనే ఉండాలని.. అందుకు తగ్గ ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవాలన్న సూచన చేశారు. ఓపక్క పొలిటికల్ హీట్ పెరుగుతున్న వేళ.. అందుకు తగ్గట్లు నియోజకవర్గాల్లోనే ఉండాలన్న మాట వ్యూహాత్మకమేనని చెబుతున్నారు.

గడిచిన మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి వేళ.. వారికి అందుబాటులో ఉండటంతో పాటు.. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. సమస్యల్ని గుర్తించి.. వాటి పరిష్కారం కోసం పని చేయాలన్నదే కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. దీనికి తోడు.. వివిధ మార్గాల్లో నిర్వహిస్తున్న సర్వే ఫలితాలు సైతం సానుకూలంగా ఉన్నాయని.. ఇలాంటి వేళ.. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలపై మరింత ఫోకస్ పెంచేందుకు వీలుగా కేసీఆర్ తాజా ఆదేశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు.

అంతేకాదు.. తాను చేయిస్తున్న సర్వేలలో సరైన సానుకూలత లేదంటూ కొందరు ఎమ్మెల్యేలపై వస్తున్న రిపోర్టులకు తగ్గట్లు.. వారి విషయంలో కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద తీసుకోనున్నట్లు చెబుతున్నారు. ఏమైనా.. నియోజకవర్గాల్ని దాటొద్దంటూ చెప్పిన సీఎం కేసీఆర్ మాటను గులాబీ ప్రజాప్రతినిధులు తూచా తప్పకుండా ఫాలో అవుతున్నట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News