తిట్టే వాళ్ల‌కు కొత్త బిరుదు ఇచ్చిన కేసీఆర్‌

Update: 2018-06-05 04:23 GMT
ఏ స్థానంలో ఉన్న వారైనా స‌రే విమ‌ర్శ‌ల్ని త‌ట్టుకోలేరు. అందునా కేసీఆర్ లాంటి అధినేత‌కు విమ‌ర్శ‌లు ఏ మాత్రం న‌చ్చ‌వు. వీలైతే పొగ‌డాలే కానీ త‌ప్పు ప‌ట్ట‌టం ఏమిట‌ని ఆయ‌న అనుకుంటూ ఉంటారు. త‌న‌లాంటి మేధావి.. ఫాంహౌస్ లో కూర్చొని రోజుల త‌ర‌బ‌డి మ‌ధ‌నం త‌ర్వాత ఏదైనా ఐడియా వేసి.. ప‌థ‌కాన్ని అనౌన్స్ చేస్తే ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయి చిన్న‌పిల్ల‌ల మాదిరి సంబ‌ర‌ప‌డిపోవాలే కానీ.. అందులో బొక్క‌లు వెతికే ప‌ని చేయ‌టం ఏమిట‌న్న‌ది కేసీఆర్ క్వ‌శ్చ‌న్.

నిజ‌మే.. త‌ప్పుల్ని ఎత్తి చూపించాల్సిన మీడియాను ఎప్పుడో త‌న దారికి తెచ్చుకున్న కేసీఆర్‌ కు రాజ‌కీయ‌ ప్ర‌త్య‌ర్థుల నోటికి తాళాలు వేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నా.. కుద‌ర‌టం లేదు. ఇప్ప‌టికే విప‌క్షాల‌ను భారీగా దెబ్బ తీసిన‌ప్ప‌టికీ అదేమీ కేసీఆర్‌ కు స‌రిపోవ‌టం లేదు. అందుకే ఇప్పుడాయ‌న డైరెక్ట్ గా రంగంలోకి దిగారు.

బ‌హిరంగ వేదిక‌ను అస‌రా చేసుకొని త‌న ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డ్డారు. తాను ఇటీవ‌ల ప్ర‌వేశ పెట్టిన రైతుబంధు ప‌థ‌కంతో 89 శాతం మంది అన్న‌దాత‌లు సంతృప్తిక‌రంగా ఉన్న‌ట్లుగా వ్యాఖ్యానించిన ఆయ‌న‌.. త‌న‌ను విమ‌ర్శిస్తున్న వారిపై తీవ్ర‌స్థాయిలో చెల‌రేగిపోయారు. కేసీఆర్‌కు కోపం వ‌స్తే ప‌రిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందే. అందునా.. త‌న డ్రీమ్ ప‌థ‌కంపై ప్ర‌త్య‌ర్థులు చేసే విమ‌ర్శ‌ల‌తో ఉడికిపోయిన ఆయ‌న‌.. తాజాగా విరుచుకుప‌డ్డారు.

రైతు బంధు ప‌థ‌కానికి తోడుగా.. అన్న‌దాత‌ల‌కు అండ‌గా నిలిచే బీమాకు సంబంధించి ఎల్ ఐసీ సంస్థ‌తో ఒప్పందం చేసుకున్న నేప‌థ్యంలో ఏర్పాటు చేసిన స‌భ‌లో కేసీఆర్ మాట్లాడారు. త‌నను.. త‌న ప్ర‌భుత్వ ప‌థ‌కాల్ని త‌ప్పు ప‌ట్టే వారికి పంచ్ ఇచ్చేలా ఒక పిట్ట‌క‌థ‌ను చెప్పారు.

కొంత‌మంది ఎప్పుడూ తిడుతూనే ఉంటార‌ని.. వారెవ‌రో చెబుతానంటూ కేసీఆర్ చెప్పిన పిట్ట‌క‌థ ఎఫెక్ట్ మిస్ కాకూడ‌దంటే ఆయ‌న మాట‌ల్లోనే చెప్పాలి. ఇంత‌కీ ఆయ‌నేం చెప్పారంటే.. "శ్రీ‌రాముడు లంక‌పై యుద్ధానికి వెళ్లాడు. అప్పుడు జ‌రిగిందంతా ధ‌ర్మ యుద్ధం. పొద్దున్నే యుద్ధం షురూ చేయాలి. సాయంత్రం అయ్యేస‌రికి గంట కొట్ట‌టంతో యుద్ధం బంద్ చేయ‌టం ఉండేది. ఒక రోజు యుద్ధం ముగిసిన త‌ర్వాత రాముల‌వారు త‌న సైన్యంతో కూర్చొని మాట్లాడారు. ఆ స‌మ‌యంలో రాముల‌వారిని కొంద‌రు ఒక ప్ర‌శ్న వేశారు. మ‌న ప‌క్క ధ‌ర్మం ఉంది. కానీ మ‌న సైన్య‌మంతా కోతులు. అవ‌త‌లి సైన్య‌మంతా రాక్ష‌సులు. వారితో గెల‌వ‌టం ఎలా? అన్న ప్ర‌శ్న‌కు రాముడు బ‌దులిస్తూ.. నా ద‌గ్గ‌ర రామబాణం ఉంది. అది వేస్తే ప్ర‌త్య‌ర్థులంద‌రూ చ‌నిపోతారు. కానీ.. అంద‌రూ చ‌నిపోతే అది ధ‌ర్మం కాదు క‌దా అన్నాడు. అయినా.. త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో రాముడు త‌న రామ‌బాణాన్ని ప్ర‌యోగించ‌టంతో అంద‌రూ చ‌నిపోతారు"

"అలా చ‌నిపోయిన వారిలో కొంద‌రు అర్ధాయుష్షుతో ఉన్న వారు ఉన్నారు. సీత‌మ్మ‌ను చెర నుంచి విడిపించి తిరిగి వెళ్లిపోతున్న వేళ‌.. అర్దాయుష్షుతో చ‌నిపోయిన వారు రాముడుకి ఎదురుప‌డ్డారు. త‌మ‌కు న్యాయంగా బ‌త‌కాల్సి ఉన్నా.. రామ‌బాణం పుణ్య‌మా అని తామంతా సగం ఆయుష్షుకే చ‌నిపోయాం క‌దా.. మ‌రి మా మిగిలిన ఆయువు సంగ‌తి ఏంటంటూ శ్రీ‌రాముడ్ని ప్ర‌శ్నించారు. దానికి రాముడు బదులిస్తూ.. మీరు క‌లియుగంలో ఊరికో న‌లుగురు చొప్పున పుట్టండి. మ‌నుషుల్ని పీక్కు తినండ‌ని చెప్పాడు. అలాంటోళ్లే ఇప్పుడు త‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు" అంటూ పిట్ట‌క‌థ‌ను ముగించారు.

మొత్తానికి త‌న‌ను త‌ప్పు ప‌ట్టే రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల్ని రామబాణం కార‌ణంగా చ‌నిపోయిన అర్థాయుష్షు రాక్ష‌సుల‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేశార‌ని చెప్పాలి. ప్ర‌త్య‌ర్థుల్ని బండ‌కేసి బాదిన‌ట్లుగా విమ‌ర్శించ‌టంలో కేసీఆర్ కు మించినోళ్లు ఉండ‌ర‌న్న‌ది తాజా పిట్ట‌క‌థ మ‌రోసారి రుజువు చేస్తుంద‌ని చెప్పాలి.
Tags:    

Similar News