కొత్త వ్యూహం: దుబ్బాకలో చేయని సారు సాగర్ లో చేస్తున్నారుగా?

Update: 2021-02-07 03:30 GMT
కేసీఆర్ కుటుంబ అడ్డాగా చెప్పే దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఓటమిపాలుకావటం తెలిసిందే. షాకింగ్ గా మారిన ఈ ఫలితానికి కారణం కేసీఆర్ చేసిన వరుస తప్పులేనని చెప్పాలి. మితిమిరీన భరోసా.. తమ బలం మీద హద్దులు దాటిన నమ్మకం.. ఇవన్నీ దుబ్బాక ప్రతికూల ఫలితానికికారణమయ్యాయి. అన్నింటికి మించి.. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న కేసీఆర్.. తాను రావాల్సిన అవసరం లేదని.. దుబ్బాక ప్రజలు ఎన్నికల్లో విజయాన్ని తమకు ఇస్తారన్న నమ్మకంతో ఉండేవారు.

కేసీఆర్ ఆలోచనలు ఇలా ఉంటే.. దుబ్బాక ప్రజల ఆలోచనలు మరోలా ఉన్నాయి. వాటిని పసిగట్టి.. వ్యతిరేకతను సానుకూలతగా మార్చుకుంటే ఫలితం మరోలా ఉండేది. దుబ్బాకలో ఏం తప్పులు చేశామో.. వాటిని రిపీట్ కాకుండా ఉండేలా చేయటమే కేసీఆర్ తాజా ప్లానింగ్ గా చెబుతున్నారు. మరికొద్ది నెలల్లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో.. అంతకు ముందే కీలక ప్రాజెక్టును ప్రారంభించటం ద్వారా  సాగర్ ఉప ఎన్నిక ప్రచారాన్ని షురూ చేస్తున్నట్లుగా చెప్పాలి.

తాజాగా దీనికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నెల పదిన నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారాన్ని ఆయన షురూ చేస్తున్నట్లుగా చెప్పాలి. సాధారణంగా ఉప ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ దూరంగా ఉంటారు. అందుకు భిన్నంగా ఆయన సాగర్ లో తన వ్యూహాన్ని మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాగర్ ఫలితం కీలకంగా మారటంతో.. కేసీఆర్ మరింత అలెర్టుగా ఉన్నారు. దుబ్బాక.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా జరిగిన పొరపాట్లను రిపీట్ కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇందులో భాగంగా ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టును తెర మీదకు తీసుకురావటంతో పాటు.. నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి వీలుగా తన తాజా నిర్ణయంతో జిల్లా వాసుల మనసుల్ని గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 10న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో హాలియాలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. అదే రోజు ఉదయం పది గంటలకు నాగార్జునసాగర్ ప్రాజెక్టును పరిశీలించటం.. మధ్యాహ్నం 12.30 గంటలకు నెల్లికల్లులో తొమ్మిది ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాదు.. బహిరంగ సభలో నల్గొండ జిల్లా డెవలప్ మెంట్ కు అవసరమైన వంతెనలు.. రోడ్లు.. విద్యాసంస్థలు.. ఇతర పనులను సీఎం ఇక్కడ మంజూరు చేయనున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా దుబ్బాక ఉప ఎన్నికకు భిన్నమైన వ్యూహంతో కేసీఆర్ అడుగులు వేస్తున్నారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News