వాళ్ల జాయినింగ్స్ కు కేసీఆర్ రాలేదేం?

Update: 2018-06-30 17:30 GMT
టీఆర్ ఎస్ పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి ఒక కొత్త త‌ర‌హా విధానాన్ని అమ‌లు చేస్తున్నారు. పాతిక మంది కావొచ్చు.. యాభై మంది కావొచ్చు.. కొన్ని సంద‌ర్భాల్లో వంద‌లాది మంది కావొచ్చు. కొత్త‌వారుపార్టీలో జాయిన్ అవుతున్నారంటే చాలు.. టీఆర్ ఎస్ హెడ్డాఫీసుకు పిలిపించ‌టం.. వారిని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడ‌టం.. కొత్త‌వారికి స్వాగ‌తం ప‌ల‌క‌టం చేస్తుంటారు.

ఈ సంద‌ర్భంగా మీడియాను పిల‌వ‌టం.. అవ‌స‌రానికి అనుగుణంగా.. అప్ప‌టి ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లుగా ఎవ‌రిని టార్గెట్ చేయాలో వారిని చేస్తూ.. విమ‌ర్శ‌ల పేరుతో నిప్పులు కురిపించేవారు.  కేసీఆర్ మాట‌ల తీవ్ర‌త ఎలా ఉంటుందో తెలిసిందే కాబ‌ట్టి.. వాటిని పత్రిక‌ల్లో ప్ర‌ముఖంగా ప్ర‌చురించేవారు. ఇక్క‌డ ఇంకో మాట కూడా చెప్పాలి. ప్ర‌ముఖంగా ప్ర‌చురించ‌టానికి అవ‌స‌ర‌మైన తెర వెనుక మంత్రాంగాన్ని ప‌క్కాగా నిర్వ‌హించేవారు (అన్ని సంద‌ర్భాల్లో కాదు కానీ.. ఎక్కువ సంద‌ర్భాల్లోన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు) ఇలా జాయినింగ్స్ పేరుతో త‌ర‌చూ మీడియాలో ద‌ర్శ‌నం ఇవ్వ‌టం ఒక అల‌వాటుగా మారింది.

నిజానికి జాయినింగ్స్ ను ఒక క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో.. వ్యూహాత్మ‌కంగా నిర్వ‌హించేవారు. తెలంగాణ వ్యాప్తంగా ఒక మారు మూల ప్రాంతానికి చెందిన ఒక వ‌ర్గానికి చెందిన వారో.. ఉద్యోగ సంఘాల వారో.. కుల‌వృత్తుల వారో జాయిన్ అవుతున్నా.. దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్య‌త క‌న్నా అధికంగా ఇవ్వ‌టం టీఆర్ ఎస్ లో అల‌వాటు.

ఉద్య‌మ రోజుల్లో టీఆర్ ఎస్ అధినేత ఇప్పటిమాదిరే ఆయ‌న‌కు న‌చ్చిన‌ప్పుడు.. తోచిన‌ప్పుడు టీఆర్ ఎస్ కార్యాల‌యానికి వ‌చ్చేవారు. కొన్ని సంద‌ర్భాల్లో వారం.. ప‌ది రోజుల వ‌ర‌కూ కూడా ఆయ‌న క‌నిపించేవారు కాదు. జాయినింగ్స్ విష‌యంలోనూ ఆయ‌న తీరు భిన్నంగా ఉండేది. మూడు గంట‌ల‌కు అని చెప్పి గంట నుంచి గంట‌న్న‌ర ఆల‌స్యంగా వ‌చ్చిన సంద‌ర్భాలెన్నో.

అప్ప‌టివ‌ర‌కూ కేసీఆర్ కోసం వెయిట్ చేసేవారు. కొద్దిమందిలో అసంతృప్తి వ్య‌క్త‌మైనా.. ఆయ‌న వ‌చ్చి.. మాట్లాడిన త‌ర్వాత కొత్త ఉత్సాహంతో తిరిగి వెళ్లే వారు. వెయిటింగ్ వేళ‌లో ప్ర‌ద‌ర్శించిన చిరాకును తిరిగి వెళ్లేట‌ప్పుడు అస్స‌లు గుర్తుంచుకునే వారు కాదు. అదే కేసీఆర్ మేజిక్ కూడా. ఇలా.. జాయినింగ్స్ కు టీఆర్ ఎస్ లో ప్రాధాన్య‌త ఉంది. ఉద్య‌మం త‌ర్వాత పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా ఈ జాయినింగ్స్ గ‌తంలో మాదిరే ఉద్య‌మ స్ఫూర్తి అన్న‌ట్లుగా సాగుతున్నాయి. పార్టీలో ఎవ‌రు చేరుతున్నా.. అధినేత కేసీఆర్ రావ‌టం.. పార్టీలో చేరుతున్న వారిని ఉద్దేశించి మాట్లాడ‌టం అల‌వాటుగా మారింది.

ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న‌ప్ప‌టికీ.. జాయినింగ్స్ విష‌యంలో ఆయ‌న పాత విధానాన్నే పాటించే వారు. తాను సీఎం కాబ‌ట్టి జాయినింగ్స్ ను నిర్ల‌క్ష్యం చేసే మాట ఉండ‌దు. తీరిక లేని షెడ్యూల్‌ లోనూ.. టైం సెట్ చేసుకుంటార‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది. అలాంటిది తాజాగా ఆస‌క్తిక‌ర‌మైన స‌న్నివేశం క‌నిపించింది.

హైద‌రాబాద్‌.. సికింద్రాబాద్‌ కు చెందిన ఆర్య‌వైశ్యులు పెద్ద ఎత్తున టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారి జాయినింగ్స్ ఎప్ప‌టి మాదిరే టీఆర్ ఎస్ హెడ్డాఫీసులో జ‌రిగాయి.కాకుంటే.. వారి జాయినింగ్స్ కు పార్టీ అధినేత కేసీఆర్ కాకుండా.. ఆయ‌న కుమారుడు క‌మ్ కేటీఆర్ స్వాగ‌తం ప‌ల‌క‌టం విశేషంగా మారింది. రోటీన్ దృశ్యానికి భిన్నంగా కేసీఆర్ బ‌దులుగా కేటీఆర్ ఆ బాధ్య‌త‌ను తీసుకున్నారు. తండ్రి రాని లోటును తీర్చే క్ర‌మంలో కేసీఆర్ మాదిరే నిప్పులు చెరిగారు. ఈ సంద‌ర్భంగా రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై అన‌కూడ‌ని ప‌దాన్ని కూడా ప్ర‌యోగించ‌టం గ‌మ‌నార్హం. చిన్న చిన్న వ‌ర్గాల జాయినింగ్స్ కు హాజ‌ర‌య్యే సీఎం కేసీఆర్‌.. జంట న‌గ‌రాల ఆర్య‌వైశ్యుల జాయినింగ్స్ విష‌యంలో హాజ‌రు కాక‌పోవ‌టం ఏమిటి? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

త‌న‌కు చెందిన ఒక్కో బాధ్య‌త‌ను క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో కొడుకు కేటీఆర్ కు అప్ప‌జెబుతున్న కేసీఆర్‌.. జాయినింగ్స్ సంద‌ర్భంగా పార్టీలో చేరాల‌నుకునే వారికి స్వాగ‌తం ప‌లికే గురుత‌ర బాధ్య‌తను కూడా అప్ప‌జెప్పారా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌ర అంశంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News