కేసీఆర్‌ కు ఓయూ డాక్ట‌రేట్ వ‌ద్దంట‌

Update: 2017-03-05 09:48 GMT
గ‌త ఏడాది ఓ వార్త తెలుగు రాష్ర్టాల్లో తెగ ఆస‌క్తిని క‌లిగించింది. అదే...."తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీర్తికిరీటంలో ఇంకో క‌లికితురాయి చేర‌నుంది. తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను నెర‌వేర్చిన  కేసీఆర్ పేరు ఇకపై డాక్టర్ క‌ల్వ‌కుంట్ల‌ చంద్రశేఖరరావుగా మార‌నుంది. వచ్చే ఏడాది జరిగే శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక స్నాతకోత్సవం ఏర్పాటు చేసి అందులో సీఎం కేసీఆర్‌కు ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ను ప్రధానం చేయనుంది." అనే ప్ర‌చారం. అయితే కేసీఆర్‌ కు ఈ అవార్డు తీసుకోవ‌డం ఇష్టం లేదనే చ‌ర్చ జ‌రుగుతోంది.

ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడి 2017 ఏప్రిల్‌ కు 100 సంవత్సరాలు పూర్తి కానున్న నేపథ్యంలో యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రణాళికలను రూపొందిస్తోంది. శతాబ్ధి ఉత్సవాలకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని ఆహ్వానించగా..ఆయ‌న స‌మ్మ‌తించారు. శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక స్నాతకోత్సవం ఏర్పాటు చేయాలని ఆలోచనలో యూనివర్సిటీ అధికారులు ఉన్నారు. ఆ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కు గౌరవ డాక్టరేట్‌ ను ఇవ్వాలని భావించారు. ఈ మేర‌కు ప్ర‌తిపాద‌న‌లు రూపొందించి యూనివ‌ర్సిటీ అధికారులు విద్యాశాఖ మంత్రి ఉప‌ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రికి స‌మ‌ర్పించారు. ఆయ‌న ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు ఈ విష‌యం చెప్పారు. ఇది జ‌రిగి దాదాపు నెల కావ‌స్తోంది. అయితే ఇప్ప‌టికే కేసీఆర్ దీనికి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేన‌ట్లు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. దీంతో అధికారులు కేసీఆర్‌కు డాక్ట‌రేట్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయ‌లేక లేదంటే ప్ర‌య‌త్నాన్ని విరమించుకోలేక స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది.

కాగా, యూనివర్సిటీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు కేవ‌లం 18 మందికి మాత్ర‌మే గౌరవ డాక్టరేట్లను ఇచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ ను 1952లో భారత రత్న డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కు ప్రధానం చేశారు. ఆ తరువాత ఈ మధ్య కాలంలో మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ కు ఇచ్చారు. చివరిగా 2001లో అమెరికన్‌ లాబరేటరీ నిర్వహకుడు అరుణ్‌ నేత్రావళికి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ప్రధానం చేసింది. గత 15 సంవత్సరాలుగా యూనివర్సిటీ తరపున ఎవరీ గౌరవ డాక్టరేట్‌ ను ప్రధానం చేయలేదు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, అందులోనూ ప్రత్యేక రాష్ట్ర భావజాలాన్ని అందరికీ తెలిసేలా చేసి, ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలతో ఉద్యమం చేయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ ఇచ్చి గౌరవించాలని అధికారులు భావించారు. సీఎం కేసీఆర్‌ కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి కావడం విశేషం. ఆయన ఆర్ట్స్‌ కాలేజీ నుంచే ఎంఏ(లిటరేచర్‌) పట్టా పొందారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News