కబ్జాపై కేసీఆర్‌ మౌనమేల!?

Update: 2015-05-26 17:30 GMT
ఆక్రమణలు, కబ్జాలపై ఉక్కుపాదం మోపుతానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పదే పదే ప్రకటిస్తున్నారు. తమకు అత్యంత పవిత్రమైన ఉస్మానియా యూనివర్సిటీలో ఏకంగా మూడు ఎకరాలను కబ్జా చేసిన అధికార టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అక్కడ స్వాగత్‌ గ్రాండ్‌ హోటల్‌ కట్టారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆ హోటల్‌పై దాడి చేశారు కూడా.

విచిత్రం ఏమిటంటే, ఆ హోటల్‌పై దాడి చేసినందుకు విద్యార్థులపైనే కేసు పెట్టారు. వారినే అరెస్టు చేశారు. సచివాలయంలో ధర్నా చేసినందుకూ ఉస్మానియా విద్యార్థులనే అరెస్టు చేశారు. వారిపైనే నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టారు. కానీ, ఉస్మానియా భూములను కబ్జా చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి విషయంలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పల్లెత్తు మాట మాట్లాడడం లేదని, కనీసం చర్య కూడా తీసుకోవడం లేదని, విచారణ కూడా జరపడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

ఉస్మానియా యూనివర్సిటీలో మూడు ఎకరాలు అంటే కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. అక్కడి స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్‌ ప్రకటిస్తున్నారు. కానీ, సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే అక్కడి స్థలాలను కబ్జా చేసి హోటళ్లు కట్టారు. దీనిపై విద్యార్థులు ఆందోళన చేస్తున్నప్పుడు ప్రభుత్వం మాట్లాడాలి కదా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ముత్తిరెడ్డి కబ్జాపై తాము ప్రశ్నిస్తుంటే ముఖ్యమంత్రితోపాటు మంత్రులు చీమ కుట్టిన దొంగల్లా మౌనంగా ఉన్నారని, అంటే ఈ పాపంలో వారికి కూడా భాగస్వామ్యం ఉండి ఉంటుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ముత్తిరెడ్డి కబ్జాపై కేసీఆర్‌ తక్షణమే జోక్యం చేసుకోవాలని, దీనిపై విచారణ జరిపి కబ్జా సంగతి తేల్చాలని, అంత వరకు హోటల్‌ను మూసి వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

జూన్‌ ఒకటో తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే సింహ గర్జనలో కూడా ముత్తిరెడ్డి కబ్జాపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని, ఉస్మానియా భూములను కబ్జా చెర నుంచి విడిపించే వరకూ వదిలిపెట్టేది లేదని తేల్చి చెబుతున్నారు.

Tags:    

Similar News