కేసీఆర్ కేబినెట్ రేసులో ఆ ఇద్దరు.?

Update: 2019-06-14 04:57 GMT
తెలంగాణలో ఎన్నికలన్నీ అయిపోయాయి. ఇక పాలన మొదలు పెట్టబోతున్నారు కేసీఆర్. జూన్ 21న కాశేశ్వరం ప్రాజెక్టు ను  ప్రారంభించనున్నారు. అయితే ఇన్నాళ్లు ఎన్నికల హోరుతో మంత్రివర్గాన్ని విస్తరించిన కేసీఆర్ ఇప్పుడు దానిపై దృష్టి సారించినట్లు సమాచారం. త్వరలోనే కేబినెట్ లోకి కేటీఆర్ - హరీష్ లను తీసుకోబోతున్నట్లు సమాచారం.

అయితే జిల్లాల వారీగా సామాజిక సమీకరణాలను లెక్కలేస్తున్న కేసీఆర్ ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తన మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదు. దీంతో అక్కడ ఎవరిని మంత్రిని చేస్తారన్న ప్రశ్న ఆసక్తిగా మారింది.

పోయిన సారి మంత్రిగా వ్యవహరించిన తుమ్మల నాగేశ్వరరావు ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయిన నేతకు మంత్రి పదవి ఇవ్వలేమని కేసీఆర్ తేల్చేశారు. దీంతో ఉమ్మడి ఖమ్మం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్. ఈయన కాంగ్రెస్ పార్టీ లోంచి 2014 గెలిచారు. ఆ తర్వాత కారెక్కారు. ఆది నుంచి టీఆర్ ఎస్ వాది కాకపోయినా ఈయన కేటీఆర్ కు బాగా సన్నిహితుడు.. కమ్మ సామాజికవర్గం. ఇక రెండో రేసులో సత్తుపల్లి నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య ఉన్నారు. ఈయన టీడీపీ నుంచి గెలిచి ఆ తర్వాత మంత్రి పదవి హామీతోనే కారెక్కారు. ఎస్సీ సామాజికవర్గ కోణం కూడా ఈయనకు మంత్రి పదవి ఇవ్వడానికి కలిసివస్తుంది.

ఇలా ఈ ఇద్దరు ఇప్పుడు ఖమ్మం నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఖచ్చితంగా ఆ జిల్లాకు ఒక పదవి ఇవ్వాల్సిన పరిస్థితుల్లో కేసీఆర్ ఎవరివైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తిగా మారింది.



Tags:    

Similar News