కామెడీగా మారిన నాటి కేసీఆర్ ముంద‌స్తు మాట‌!

Update: 2018-09-06 10:39 GMT
రాజ‌కీయాల్లో మాట‌కు ఉండే ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు. ఒకే ఒక్క మాట తేడాతో హీరో కాస్తా జీరో అయ్యే ప‌రిస్థితి. అందుకే చెబుతారు ప‌బ్లిక్ గా అంద‌రి ముందు చెప్పే మాట‌లు ఆచితూచి అన్న‌ట్లుగా ఉండాలే త‌ప్పించి.. ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా.. కామెడీగా.. కాస్తంత ఎట‌కారంగా మాట్లాడితే విమ‌ర్శ‌లు ఎదుర్కొవాల్సి ఉంటుంది. తాజాగా తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇప్పుడు అలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నార‌ని చెప్పాలి.

కొద్ది రోజుల క్రితం రాత్రి వేళ.. మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేయ‌టం తెలిసిందే. అప్ప‌టికే కేసీఆర్ ముంద‌స్తుకు వెళ్లే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా పెద్ద ఎత్తున వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇలాంటి వేళ‌.. ఉత్సుక‌త‌తో ఒక విలేక‌రి నాటి సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి.. ముంద‌స్తు ఎప్పుడు ఉంటుంద‌న్న‌ట్లుగా ఒక ప్ర‌శ్న వేశారు. దానికి స‌మాధానం చెప్ప‌టం ఇష్టం లేని కేసీఆర్‌.. త‌న ఆయుధ‌మైన ఎట‌కారాన్ని బ‌య‌ట‌కు తీసి.. భ‌లేవాడివ‌య్యా... ముంద‌స్తుకు వెళుతుంటే మంత్రుల‌కు కూడా తెలీకుండా రాజ్ భ‌వ‌న్ కు వెళ‌తారు తెలుసా? అంటూ వేళాకోళం ఆడేశారు.

నిజ‌మే క‌దా.. ముంద‌స్తుకు వెళ్లే విషయంలో ఆ మాత్రం గుట్టుగా ఉంచ‌కుండా ఉంటారా? అన్న భావ‌న క‌లిగినా.. క‌నీసం మంత్రుల‌కు కూడా చెప్ప‌కుండా రాజ్ భ‌వ‌న్ కు వెళ్ల‌టం మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల్ని న‌మ్మ‌కంలోకి తీసుకోన‌ట్లు క‌దా?  అలా చేస్తే..వారిని అవ‌మానించిన‌ట్లేక‌దా? అన్న సందేహాలు క‌లిగినా.. కేసీఆర్ తో పెట్టుకోవ‌టం ఎందుకులే అన్న‌ట్లుగా మౌనంగా ఉండిపోయారు.

గ‌తాన్ని ఇక్క‌డ క‌ట్ చేసి వ‌ర్త‌మానానికి వ‌స్తే.. మంత్రుల‌కు కూడా చెప్ప‌మ‌న్న మాట‌ను ఇవాళ కేసీఆర్ ఫాలో అయ్యారా? అన్న ప్ర‌శ్న వేసుకుంటే ఆన్స‌ర్ కేసీఆర్ మాట‌కు భిన్నంగా రాక మాన‌దు. మంత్రుల సంగ‌తి త‌ర్వాత‌.. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు.. దేశంలో రాజ‌కీయాల మీద అవ‌గాహ‌న ఉన్న వారికి.. తెలంగాణ రాజ‌కీయాల్ని ఫాలో అయ్యే  ప్ర‌తి ఒక్క‌రికి  కేసీఆర్ ముంద‌స్తుకు వెళ్ల‌నున్న విష‌యం క్లియ‌ర్ గా తెలీట‌మే కాదు.. చివ‌ర‌కు ఆయ‌న ఆ నిర్ణ‌యాన్ని ఏ టైంలో తీసుకుంటార‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేశారు. ఎట‌కారం ఆడేట‌ప్ప‌డు కాస్త ఆచితూచి ఆడితే లాభం కేసీఆర్ కే అన్న మాట వినిపిస్తోంది. ప్ర‌శ్న వేసిన రోజున ప‌వ‌ర్లో ఉన్న సీఎం సారూ కామెడీ చేసినా.. తాను చెప్పిన మాట‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించటం ద్వారా కేసీఆర్ మాట‌ ఇప్పుడు కామెడీగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 

Tags:    

Similar News