తుమ్మ‌ల‌కు ఖాయ‌మే!... కేసీఆర్ వ్యూహమేంటో?

Update: 2019-02-08 17:22 GMT
టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు వ్యూహం ఏమిటో అర్థం కాక ఆయ‌న సొంత పార్టీ నేత‌ల‌తో పాటు జ‌నం కూడా ఇంకా అయోమ‌యంలోనే ఉన్నారు. ఏది చేసినా... వ్యూహాత్మ‌కంగా చివ‌రి నిమిషం దాకా అస‌లు వ్యూహాన్ని వెల్ల‌డించ‌ని కేసీఆర్‌... తాను చేయాల‌నుకున్న ప‌నుల‌న్నింటినీ ముహూర్తాలు పెట్టుకుని మ‌రీ చేస్తుంటారు. తెలంగాణ‌కు రెండో ద‌ఫా సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన కేసీఆర్‌... పూర్తి స్థాయి కేబినెట్ లేకుండానే పాల‌న‌ను సాగిస్తున్నారు. దీనిపై ఇంటా బ‌య‌టా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నా... కేసీఆర్ ఏమాత్రం ప‌ట్టించుకోకుండానే తాను అనుకున్న రీతిలోనే ముందుకు సాగుతున్నారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఎల్లుండి (ఈ నెల 10న‌) కేసీఆర్ త‌న కేబినెట్ ను విస్త‌రించ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారికంగా ఇప్ప‌టిదాకా ఎలాంటి స‌మాచారం లేకున్నా... 10వ తేదీన ఉన్న ముహూర్తాల‌ను బ‌ట్టి ఈ త‌ర‌హా అంచ‌నాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 10న శ్రీ‌పంచ‌మి.. ఈ శుభ ముహూర్తాన ఏ ప‌ని చేప‌ట్టినా అంతా శుభ‌మేన‌ని కేసీఆర్ తో పాటు అంద‌రూ భావిస్తారు. ఈ క్ర‌మంలోనే ఈ ముహూర్తాన‌నే కేసీఆర్ త‌న కేబినెట్ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం పెట్టుకున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ ద‌ఫా విస్త‌ర‌ణ‌లో త‌న కేబినెట్ ను పూర్తి స్థాయిలో విస్త‌రించేందుకు కూడా కేసీఆర్ సిద్ధంగా లేర‌ట‌. ఈ ద‌ఫా ఆరు నుంచి ఎనిమిది మంది దాకా మంత్రుల‌ను త‌న కేబినెట్ చేర్చుకోవాల‌ని - ఇక పూర్తి స్థాయి కేబినెట్ విస్త‌ర‌ణ‌ను సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాతేన‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. స‌రే కేబినెట్ విస్త‌ర‌ణ‌ను కాస్తంత ప‌క్క‌న‌పెడితే... ఈ ద‌ఫా విస్త‌ర‌ణ‌లో ఎవ‌రెవ‌రికి బెర్తులు ద‌క్కుతాయ‌న్న విష‌యంపై మ‌రో ఆసక్తిక‌ర‌మైన వాద‌న వినిపిస్తోంది. ఇప్ప‌టికే కేబినెట్ విస్త‌ర‌ణ‌లో త‌న‌కు ఎలాగూ బెర్తు ద‌క్క‌ద‌ని ఫిక్స‌యిపోయిన కేసీఆర్ మేన‌ల్లుడు త‌న్నీరు హ‌రీశ్ రావు త‌న మినిస్ట‌ర్ క్వార్ట‌ర్‌ను ఖాళీ చేసేసి త‌న సొంతింటికి వెళ్లిపోయారు. సార్వత్రిక ఎన్నిక‌ల్లో భాగంగా హ‌రీశ్ రావును ఎంపీగా పోటీ చేయించాల‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్టుగా కొత్త వాద‌న వినిపిస్తోంది. ఈ వాద‌న క‌రెక్టేనంటూ హ‌రీశ్ కూడా త‌న మినిస్ట‌ర్ క్వార్ట‌ర్‌ ను ఖాళీ చేసేశారు. ఇక త‌న త‌న‌యుడు కేటీఆర్‌ కు కూడా ఈ ద‌ఫా కేబినెట్ విస్త‌ర‌ణ‌లో బెర్తు ఇవ్వ‌రాద‌నే కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. ఇటీవ‌లే పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన కేటీఆర్‌... పూర్తి స్థాయిలో పార్టీపై ప‌ట్టు సాధించాల‌న్న ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

వీరిద్ద‌రిని ప‌క్క‌న‌పెడితే...గ‌త కేబినెట్ లో కేసీఆర్ అత్య‌ధిక ప్రాధాన్యం ఇచ్చింది తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకే. 2014లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడినా... ఆ త‌ర్వాత తుమ్మ‌ల‌ను పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్‌... ఆయ‌న‌ను త‌న కేబినెట్ లో చేర్చుకుని ఎమ్మెల్సీని చేశారు. అయితే త‌న ఫేట్ మొత్తం తిరగ‌బ‌డిన చందంగా మొన్న‌టి ఎన్నికల్లోనూ పాలేరు నుంచి బ‌రిలోకి దిగిన తుమ్మ‌ల మ‌ర‌లా ఓట‌మిపాల‌య్యారు. గెలిచినోళ్ల‌కే ఈ సారి కేబినెట్ బెర్తుల‌ని కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న‌కు అనుగుణంగా...  తుమ్మ‌ల త‌న మినిస్ట‌ర్ క్వార్ట‌ర్‌ను ఖాళీ చేసేందుకు ఉద్యుక్తుడ‌య్యార‌ట‌. అయితే కేసీఆర్ ఆయ‌న‌ను వారించార‌ని, తాను చెప్పేదాకా మినిస్ట‌ర్ క్వార్ట‌ర్‌ను ఖాళీ చేయొద్ద‌ని తుమ్మ‌ల‌కు ఆదేశాలు వెళ్లాయ‌ని తెలుస్తోంది. ఓ ప‌క్క హ‌రీశ్ మినిస్ట‌ర్ క్వార్ట‌ర్‌ ను ఖాళీ చేస్తున్నా మిన్న‌కుండిపోయిన కేసీఆర్‌... తుమ్మ‌ల‌ను మాత్రం నిలువ‌రించ‌డం చూస్తుంటే... తొలి విస్త‌ర‌ణ‌లోనే తుమ్మ‌ల‌కు బెర్తు ఖాయ‌మ‌నే వాద‌నే వినిపిస్తోంది. అసెంబ్లీ బ‌రిలో తుమ్మ‌ల ఓడినా... ముందుగానే మినిస్ట‌ర్ గిరీ ఇచ్చేసి త్వ‌ర‌లోనే మండ‌లికి జ‌ర‌గ‌నున్న ఎన్నికల్లో ఆయ‌న‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాల‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్లుగా క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఎన్నిక‌ల్లో ఓడిన వాళ్ల‌కు ఈ సారి మంత్రులుగా అవ‌కాశం ఇవ్వ‌న‌ని ప్ర‌క‌టించిన కేసీఆర్‌... తుమ్మ‌ల విష‌యంలో మాత్రం త‌న మాట‌ను మార్చేసుకున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. చూద్దాం... ఎల్లుండి ఏం జ‌రుగుతుందో?

Tags:    

Similar News