కేసీఆర్ కు యాసిడ్ టెస్ట్ గా మార‌నున్న ఎన్నిక‌లు!

Update: 2019-07-06 07:55 GMT
అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థుల్ని చిత్తు చేయ‌ట‌మే కాదు.. స‌మీప భ‌విష్య‌త్తులో కోలుకోకుండా చేయ‌టంలో పూర్తిస్థాయి స‌క్సెస్ సాధించిన గులాబీ బాస్ కేసీఆర్ కు ఆర్నెల్లలోనే సీన్ మొత్తం మారిపోయిందంటున్నారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌టం ద్వారా మ‌రో ఐదేళ్ల వ‌ర‌కూ త‌న‌కు తిరుగు ఉండ‌ని రీతిలో ప్లాన్ చేసిన ఆయ‌న‌.. అందుకు త‌గ్గ‌ట్లే ముంద‌స్తుకు వెళ్ల‌టం.. త‌న వ్యూహం ప్ర‌కారం భారీ విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌టం తెలిసిందే.

అయితే.. ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు కేసీఆర్ కు మ‌హా ఇబ్బందిగా మారాయి. ఎన్నిక‌ల్లో ఓడిన బాధ కంటే కూడా.. తెలంగాణ‌లో పొలిటిక‌ల్ వాక్యూమ్ ఉంద‌ని.. టీఆర్ ఎస్ కు ప్ర‌త్యామ్నాయం కోసం తెలంగాణ ప్ర‌జ‌లు త‌పిస్తున్నార‌న్న సంకేతం సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు స్ప‌ష్టం చేసిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. దీనికి తోడు ఊహించ‌ని రీతిలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న మోడీషాలు.. త‌మ‌కు ఎప్ప‌టి నుంచో కొరుకుడుప‌డ‌ని ద‌క్షిణాది మీద దృష్టి పెట్టే అవ‌కాశం వ‌చ్చింది. తెలంగాణ‌లో నాలుగు ఎంపీ స్థానాల్లో గెలిచిన నేప‌థ్యంలో.. స‌రిగ్గా ప్ర‌య‌త్నిస్తే తెలంగాణ‌లో కాషాయ‌జెండా ఎగుర‌వేయ‌టానికి అవ‌కాశం ఉంద‌న్న విష‌యం బీజేపీ అధినాయ‌క‌త్వానికి అర్థ‌మైంద‌ని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. మ‌రో నెల‌లో జ‌రుగుతుంద‌ని భావిస్తున్న మున్సిపోల్స్.. కార్పొరేష‌న్ ఎన్నిక‌లు కేసీఆర్ అండ్ కోకు మ‌హా క‌ష్టంగా మారాయ‌ని చెబుతున్నారు. స్థానిక ఎన్నిక‌ల్లో స్థానిక అంశాలకే ప్రాధాన్య‌త ఉంటుంది. అయితే.. తెలంగాణ ప్ర‌భుత్వం మీద ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాల‌న్న ఉద్దేశంతో బీజేపీ అధినాయ‌క‌త్వం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 138 మున్సిపాలిటీల‌ను.. కార్పొరేష‌న్ల‌కు జ‌రిగే ఎన్నిక‌ల్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకోవాల‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం బీసీ కోటా గ‌ణ‌న జ‌రుగుతోంది. దీనిపై కాస్తంత స్ప‌ష్ట‌త వ‌చ్చిన వెంట‌నే ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్నారు.

తెలంగాణ రాజ‌కీయ ముఖ‌చిత్రాన్ని ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నాల నేప‌థ్యంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో త‌మ ప‌ట్టును ప్ర‌ద‌ర్శించాల‌న్న ఆలోచ‌న‌లో క‌మ‌ల‌నాథులు ఉన్న‌ట్లు చెబుతున్నారు. బీజేపీ దూకుడు నేప‌థ్యంలో గ‌తంలో మాదిరి మున్సిప‌ల్ ఎన్నిక‌లు ఉండ‌వంటున్నారు.

ఒక‌వేళ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కాస్త తేడా వ‌చ్చినా గులాబీద‌ళంలో క‌ల‌క‌లం మొద‌లువుతుంద‌ని.. అది బీజేపీకి మేలు చేస్తుంది కాబ‌ట్టి.. ఆ దిశ‌గా పావులు క‌దిపే అవ‌కాశం ఉందంటున్నారు. ఇలా వ్యూహ‌ప్ర‌తివ్యూహాల నేప‌థ్యంలో జ‌రిగే ఎన్నిక‌లు కేసీఆర్ రాజ‌కీయ భ‌విష్య‌త్తును ప్ర‌భావితం చేస్తాయ‌ని చెబుతున్నారు.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌ క్లీన్ స్వీప్ చేయ‌టం మిన‌హా మ‌రో మార్గం లేద‌ని చెబుతున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌కు ఏ మాత్రం అవ‌కాశం వ‌చ్చినా ఇబ్బంది త‌ప్ప‌దంటున్నారు. ఏదిఏమైనా త్వ‌ర‌లో జ‌రిగే మున్సిప‌ల్.. కార్పొరేష‌న్ ఎన్నిక‌లు కేసీఆర్ కు యాసిడ్ టెస్ట్ గా మారుతున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 
Tags:    

Similar News