కేసీఆర్ క‌ల‌ల సౌధానికి ఎన్ని డిజైన్లు వ‌చ్చాయంటే?

Update: 2019-07-24 05:33 GMT
సంప‌న్న రాష్ట్రం కాస్తా అప్పుల కుప్ప‌గా మారిందంటూ విప‌క్షాలు విరుచుకుప‌డుతున్న వేళ‌.. త‌న క‌ల‌ల సౌదాల్ని క‌ట్టే విష‌యంలో వెన‌క్కి త‌గ్గే ఆలోచ‌నే లేద‌న్న విష‌యాన్ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాను క‌ట్టాల‌ని భావిస్తున్న కొత్త స‌చివాల‌యానికి సంబంధించిన డిజైన్ల విష‌యంలో క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ఒక‌వైపు డైలీ బేసిస్ లో కొత్త నిర్మాణానికి సంబంధించి త‌మ ప్ర‌భుత్వంపై వేసిన కేసుల విష‌యంలో కోర్టుల నుంచి నెగిటివ్ కామెంట్లు వ‌స్తున్నప్ప‌టికి కేసీఆర్ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌టం లేద‌ని చెప్పాలి. వాస్తు కార‌ణంగా స‌చివాల‌యాన్ని స‌రికొత్త‌గా సిద్ధం చేయాల‌నుకుంటున్న కేసీఆర్.. బ‌య‌ట‌కు మాత్రం వ‌స‌తులు ఏ మాత్రం బాగోలేని కార‌ణ‌మ‌ని చెప్ప‌టం తెలిసిందే.

తెలంగాణ కొత్త స‌చివాల‌యానికి సంబంధించి ఇప్ప‌టికే ఎనిమిది న‌మూనాల్ని సిద్ధం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. స‌చివాల‌య భ‌వ‌నం తెలంగాణ సంప్ర‌దాయం ఉట్టిప‌డేలా ఉండాల‌న్న విష‌యాన్ని ముందే స్ప‌ష్టం చేసి.. డిజైన్ల‌ను ఆ తీరులో త‌యారు చేయించిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇప్ప‌టివ‌ర‌కూ వ‌చ్చిన ఎనిమిది డిజైన్ల‌ను కేసీఆర్ ప‌రిశీలించిన‌ట్లు చెబుతున్నారు. ఆ మ‌ధ్య‌న త‌మిళ‌నాడుకు చెందిన ఒక ఆర్కిటెక్ట్ స్వ‌చ్ఛందంగా పంపిన న‌మూనా సీఎం కేసీఆర్ ను అమితంగా ఆక‌ర్షించ‌ట‌మే కాదు.. భారీ గుమ్మ‌టాల‌తో ఉన్న ఆ న‌మూనాకుద‌గ్గ‌ర‌గా ఉండే డిజైన్ ను సిద్ధం చేయాల‌ని చెప్పిన‌ట్లుగా చెబుతారు.

తాజాగా ఆ డిజైన్ కు మ‌రిన్ని హంగులు స‌మ‌కూర్చేలా చేయాల‌ని అధికారుల‌కు చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. కొత్త స‌చివాల‌యం కోసం వ‌చ్చిన డిజైన్ల‌లో బాగున్న భాగాల్ని.. ఇప్ప‌టికే న‌చ్చిన డిజైన్ కు జ‌త చేయాల‌ని.. అలా వ‌చ్చిన డిజైన్ల‌లో ముక్క‌లు.. ముక్క‌లుగా ఉన్న సానుకూలాంశాల్ని క‌లిపి స‌రికొత్త డిజైన్ చేయాల‌న్న‌ది కేసీఆర్ అభిమ‌తంగా చెబుతున్నారు.

ఇలా ఫైన‌ల్ గా త‌యారు చేసిన కొన్ని న‌మూనాల్ని ఎంపిక చేసిన‌ టెక్నిక‌ల్ క‌మిటీ మంత్రివ‌ర్గ ఉప సంఘానికి ఇవ్వ‌నుంది. వాటిని మంత్రులు ప‌రిశీలించి మ‌ళ్లీ మార్పులు చేర్పులు చేసి అవ‌స‌ర‌మైతే ముఖ్య‌మంత్రికి ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పినా.. సీఎం త‌న క‌ల‌ల సౌధం డిజైన్ ను ఎవ‌రి చేతిలోనే ఎందుకు పెడ‌తార‌ని.. ఆయ‌న స్వ‌యంగా స‌మీక్షిస్తార‌న్న మాట వినిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మ‌రోవైపు ప్ర‌స్తుతం ఉన్న స‌చివాల‌యం ప‌టుత్వం ఎలా ఉంద‌న్న అంచ‌నా వేస్తున్న క‌మిటీ ఏ రిపోర్ట్ ఇస్తుంద‌న్న‌ది మ‌రో ఆస‌క్తిక‌ర అంశంగా మారింది. ముఖ్య‌మంత్రి నోటి వెంట వ‌చ్చిన అగ్నిప్ర‌మాదాల‌కు అవ‌కాశం అన్న మాట క‌మిటీ నివేదిక‌లో ఉంటుంద‌ని చెప్పినా.. ఆ ఒక్క అంశంతోనే భ‌వ‌నాల్ని నేల‌మ‌ట్టం చేసేందుకు క‌మిటీ ఓకే అంటుందా? అన్న‌దిప్పుడు సందేహం మారింది.



Tags:    

Similar News