ఈ టుమ్రీ స‌వాల్‌ కు కేసీఆర్ స్పందిస్తే భూకంప‌మే!

Update: 2018-04-29 05:09 GMT
కోట్లాది మందిని క‌న్వీన్స్ చేసి ఉండొచ్చు. క‌రోడా లాంటి కాంగ్రెస్ పార్టీకి మ‌రో దారి లేకుండా తెలంగాణ ఇవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి తీసుకొచ్చి ఉండొచ్చు.. కానీ.. తెలంగాణ మ‌లిద‌శ ఉద్య‌మానికి పురిటిగ‌డ్డ లాంటి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ద‌గ్గ‌ర‌కు సీఎంగా కేసీఆర్ వెళ్ల‌గ‌లుగుతారా?  అన్న స‌వాలు విన్నంత‌నే టుమ్రీగా అనిపించొచ్చు. కానీ.. త‌ర‌చి చూస్తే మాత్రం ఇందులో క‌నిపించే వాస్త‌వం చూస్తే.. కేసీఆర్ స‌త్తా ఏమిటో ఇట్టే అర్థ‌మై ఉండొచ్చు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కు ఒక గుణం ఉంది. ఆయ‌న స‌వాళ్ల‌కు ఇట్టే రియాక్ట్ అవుతారు. ఆ మాట‌కు వ‌స్తే.. స‌వాళ్ల‌తోనే తెలంగాణ‌ను సాధించారు. ఎవ‌రైనా స‌రే.. కాస్తంత సెన్సిబుల్ గా స‌వాల్ విసిరితే.. దాన్లో నుంచి సెంటిమెంట్ లింకును బ‌య‌ట‌కు తీసి మ‌రి ఓకే అనేసేవారు. స‌వాల్ విసిరినోళ్లు.. ఎందుకు స‌వాల్ విసిరామ‌ని త‌ల ప‌ట్టుకునేలా చేసే స‌త్తా కేసీఆర్ సొంతం.

ఉద్య‌మ‌నేత నుంచి తెలంగాణ అధికార‌ప‌క్ష అధినేత‌గా అవ‌త‌రించిన త‌ర్వాత కూడా కేసీఆర్ కు అప్పుడ‌ప్పుడు స‌వాళ్లు విస‌రాల‌నిపిస్తుంది. అంతే..చేతిలో ఉండే మైకును స‌రి చేసుకొని మ‌రీ స‌వాళ్ల‌తో గాండ్రిస్తారు. త‌న‌కు స‌మాధానం చెప్ప‌లేని రీతిలో ఆయ‌న స‌వాళ్లు ఉంటాయి. కానీ.. అదంతా ఒక‌ప్ప‌టి మాట‌. ఇప్పుడు సీన్ మారిపోయింది. మొన్న‌టికి మొన్న తాను నివాసం ఉండే ప్ర‌గ‌తి భ‌వ‌న్లో 150 గ‌దులు ఉన్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు చేశార‌ని.. ఉత్త‌మ్ కానీ ఇంటికి వ‌స్తే.. తానే ద‌గ్గ‌రుండి మ‌రీ తానుంటున్న ఇంటిని చూపిస్తాన‌ని చెప్పారు. ఉత్త‌మ్ తో పాటు మీడియాను కూడా తీసుకురావాల‌న్న కండిష‌న్ పెట్టారు.

నిజానికి ఉత్త‌మ్ ఎప్పుడు 150 గ‌దుల‌తో ప్ర‌గ‌తిభ‌వ‌న్ క‌ట్టార‌న్న వ్యాఖ్య చేయ‌లేదు. అన‌ని మాట‌ను అన్న‌ట్లుగా చెప్పి.. స‌వాల్ విస‌ర‌టం కేసీఆర్ మాత్ర‌మే చేయ‌గ‌లిగే ప‌ని. కానీ.. ఆయ‌న చెప్పిన‌ట్లుగా తాను ఉంటున్న ప్ర‌గ‌తిభ‌వ‌న్ విలావంతంగా ఉండ‌ద‌న్న విష‌యాన్ని నిరూపించ‌గ‌ల‌రా? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం రావటం లేదు. ఈ మ‌ధ్య‌నే ప‌శ్చిమ‌బెంగాల్ కు వెళ్లిన సంద‌ర్భంగా ఆ రాష్ట్రం సీఎం మ‌మ‌త‌ను క‌లిశారు కేసీఆర్‌. తన ఆడంబ‌ర జీవితానికి..మ‌మ‌త సింఫుల్ లైఫ్ స్టైల్ కు తేడాను ఆయ‌న గ‌మ‌నించే ఉండొచ్చు. కానీ.. దీదీ మాదిరి ఉండే ద‌మ్ము త‌న‌లో ఉంద‌ని చెప్పే ధైర్యం కేసీఆర్‌ కు ఉందా? అన్న‌ది ప్ర‌శ్న‌.

కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి తీవ్ర‌స్థాయిలో మండిప‌డిన కేసీఆర్ పై ఆ పార్టీకి చెందిన నేత‌లు కొంద‌రు రియాక్ట్ అయ్యారు. వారిలో సీనియ‌ర్ నేత షబ్బీర్ అలా ఒక‌రు. ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన చిన్న‌మాట విన్నంత‌నే ఆస‌క్తిక‌రంగానే కాదు.. మాట‌లు చెప్పే కేసీఆర్‌.. ష‌బ్బీర్ నోటి నుంచి వ‌చ్చిన స‌వాల్‌ కు రియాక్ట్ కాగ‌ల‌రా? అన్న ప్ర‌శ్న రాక మాన‌దు. ఇంత‌కీ ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన స‌వాల్ ఏమిటంటే.. అయ్యా కేసీఆర్.. నువ్వు మ‌హా మొన‌గాడివి క‌దా.. నీకు ద‌మ్మే ఉంటే.. హైద‌రాబాద్ కు ఓ మూల‌న ఉండే ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యానికి వెళ్ల గ‌ల‌వా?  అంత పెద్ద వ‌ర్సిటీలో ఎక్క‌డికి వెళ్లాల‌న్న డౌట్ కూడా అక్క‌ర్లేదు. తెలంగాణ ఉద్య‌మానికి కేంద్ర బిందువుగా ఉండేదే అర్ట్స్ కాలేజీ. అక్క‌డికి వెళితే చాలు అంటూ స‌వాల్ విసిరారు షబ్బీర్‌.

ఉస్మానియాకు వెళ్లాల్సి వ‌స్తుంద‌న్న ఉద్దేశంతో శ‌తాబ్ది ఉత్స‌వాల ముఖం కూడా చూడ‌ని కేసీఆర్‌.. నిజంగానే అక్క‌డికి వెళితే వ్య‌తిరేక‌త అనే భూకంపం రావ‌టం ఖాయం. హైద‌రాబాద్ కేంద్రంగా భూకంపం సృష్టిస్తాన‌ని చెప్పిన కేసీఆర్‌.. అది అవుతుందో లేదో కానీ.. ఉస్మానియాకు వెళితే మాత్రం భూకంపం రావ‌టం ఖాయ‌మ‌న్న ష‌బ్బీర్ మాట‌లు నిజం కాద‌న్న విష‌యాన్ని కేసీఆర్ చేత‌ల్లో చేసి చూపించ‌గ‌ల‌రా?


Tags:    

Similar News