మోడీకి కాళేశ్వ‌రం పిలుపు బంద్ అయిన‌ట్లేనా?

Update: 2019-06-17 05:47 GMT
తాను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన కాళేశ్వ‌రం ప్రాజెక్టును అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభించాల‌ని.. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం క్రెడిట్ ను త‌న ఖాతాలోనే వేసుకోవాల‌ని త‌పిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అందుకు త‌గ్గ‌ట్లే ప‌క్కా ప్లాన్ చేయ‌టం తెలిసిందే. ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని.. ఏపీ.. మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రుల్ని పిల‌వ‌టం ద్వారా.. ఈ కార్య‌క్ర‌మానికి అద‌న‌పు ఆక‌ర్ష‌ణ తేవాల‌ని భావించారు.

ఇందులో భాగంగా ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రికి కాళేశ్వ‌రం ప్రాజెక్టు ఆహ్వానాన్ని త‌న‌కు తానే మ‌హారాష్ట్రకు వెళ్లి మ‌రీ పిలిచి రావ‌టం తెలిసిందే. ఈ రోజు ఏపీకి వెళుతున్న కేసీఆర్‌.. మ‌రి ప్ర‌ధాన‌మంత్రి మాటేమిటి? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి మోడీని లిస్ట్ లో నుంచి కేసీఆర్ తీసేసిన‌ట్లుగా చెబుతున్నారు.

ప్ర‌ధానితో భేటీ అయ్యేందుకు ఇటీవ‌ల తెగ ప్ర‌య‌త్నం చేస్తున్న కేసీఆర్ కు నిరాశ ద‌క్క‌టం తెలిసిందే. ఆయ‌న రిక్వెస్ట్ ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోని పీఎంవో.. మోడీతో భేటీకి టైం ఇవ్వ‌లేదు. ఈ కార‌ణంతోనే ఢిల్లీలో ఇటీవ‌ల జ‌రిగిన నీతిఆయోగ్ మీటింగ్ కు కూడా కేసీఆర్ వెళ్ల‌లేదు. తానెంత ట్రై చేసినా టైం ఇవ్వ‌ని మోడీని.. కాళేశ్వ‌రం ప్రారంభోత్స‌వానికి పిలిస్తే మాత్రం వ‌స్తారా? అన్న సందేహంలో కేసీఆర్ ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి మోడీని ఆహ్వానం లిస్టు నుంచి ప‌క్క‌న పెట్టేసిన‌ట్లుగా తెలుస్తోంది. మోడీని ఆహ్వానించ‌ని నేప‌థ్యంలో.. ఈ కార్య‌క్ర‌మానికి మోడీ శిష్యుడు క‌మ్ మ‌హారాష్ట్ర సీఎం ఫ‌డ్న‌వీస్ వ‌స్తారా? అన్న‌ది సందేహంగా మారింది. ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న ప‌రిస్థితుల‌ను చూస్తే.. కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి మోడీకి ఆహ్వానం ఇవ్వ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News