పెద్ద నోట్ల రద్దుపై కేసీఆర్ అసంతృప్తి..?

Update: 2016-11-11 04:41 GMT
పెద్దనోట్ల రద్దు అంటూ ప్రధాని మోడీ చేసిన సంచలన ప్రకటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలపటమే కాదు.. చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నారంటూ పొగిడేయటం తెలిసిందే. ఈ ఇష్యూపై బాబు రియాక్షన్ ఇలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందన ఏమిటి? ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు? అన్న సందేహాలు వినిపించాయి. అయితే.. ఆయన స్పందన ఎక్కడా బయటకు వచ్చింది లేదు. కొత్త కొత్త నిర్ణయాల్ని తీసుకోవటంలో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ.. వ్యవస్థల్ని మార్చే అంశాలపై ఆసక్తిని చూపే కేసీఆర్ లాంటి అధినేత పెద్దనోట్ల రద్దుపై ఎలా స్పందించారన్నది ప్రశ్న అయినా సమాధానం మాత్రం లభించలేదు.

ఈ లోటును తీరుస్తూ తాజాగా ఆయన స్పందన ఏమిటన్న విషయంపై కొంత సమాచారం బయటకు వచ్చింది. ఒక అగ్ర దినపత్రిక ప్రచురించిన కథనం ప్రకారం.. కేసీఆర్ వైఖరిని చూచాయగా చెబుతూ.. సదరు సమాచారం అంతా తమకు అనధికారికంగా ‘‘తెలిసిన’’ విషయాలుగా పేర్కొనటం గమనార్హం. తరచూ గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యే ముఖ్యమంత్రి కేసీఆర్.. గురువారం దాదాపు నాలుగు గంటలకు పైనే గవర్నర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనతో పాటు సీనియర్ అధికారుల్ని వెంట తీసుకొని వెళ్లటం గమనార్హం.

ఈ సందర్భంగా మోడీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు అంశం.. దాని కారణంగా చోటు చేసుకునే పరిణామాలతో పాటు ఏపీకి చెందిన సచివాలయ భవనాల అంశంతో పాటు పలు అంశాలు సుదీర్ఘంగా చర్చించినట్లుగా చెబుతున్నారు. మిగిలిన అంశాల్ని పక్కన పెడితే.. మోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దుపై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాలకు కేంద్రం చెల్లించాల్సిన పన్నుల వాటా తగ్గింపు కారణంగా నష్టం వాటిల్లుతుందని.. అది సరిపోదన్నట్లుగా తాజాగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నట్లుగా ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది.

పెద్ద నోట్ల రద్దు కారణంగా తెలంగాణ రాష్ట్రానికి వెయ్యి కోట్ల నుంచి రూ.2వేల కోట్ల వరకూ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న అంచనాను కేసీఆర్ వేసినట్లుగా చెబుతున్నారు. స్థిరాస్థి లావాదేవీలతో పాటు.. భూముల రిజిస్ట్రేషన్లు.. మోటారు వాహనాల క్రయ విక్రయాలు.. లగ్జరీ.. ఎక్సైజ్ పన్నుతో పాటు పలు రంగాల్లో పన్ను ఆదాయం భారీగా తగ్గే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో చిన్న వ్యాపారులతో పెద్ద వాటా అని.. నగదుతోనే ఎక్కువ లావాదేవీలు జరుగుతుంటాయని.. తాజా ఆంక్షలకారణంగా రాష్ట్రం ఇబ్బందులకు గురి అవుతుందని.. ఓపక్క కేంద్రం నుంచి వచ్చే ఆదాయం తగ్గిపోయి.. మరోవైపు పెద్దనోట్ల రద్దు నిర్ణయం రాష్ట్రానికి ఇబ్బందికరంగా మారుతుందన్న భావనను గవర్నర్ వద్ద కేసీఆర్ వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి కేసీఆర్ నోటి నుంచి వచ్చిన ఇబ్బందులు అన్ని రాష్ట్రాల వారికి ఉంటాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. కానీ.. అలాంటి విషయాన్ని పట్టించుకోకుండా తన రాష్ట్రానికి మాత్రమే ఇబ్బంది జరుగుతుందన్నట్లుగా మాట్లాడటం సరికాదన్న వాదన వినిపిస్తోంది. వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు సాహసోపేతమైన నిర్ణయాలు అవసరం. అలాంటి వాటిని స్వాగతించాల్సింది పోయి.. తాత్కాలికంగా పోయే ఆదాయం గురించి కేసీఆర్ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం ఏందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. చూస్తుంటే.. పెద్ద నోట్ల రద్దుపై మోడీ తీసుకున్న నిర్ణయం కేసీఆఱ్ వ్యతిరేకమన్న భావన వ్యక్తమవుతోంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News