కేసీఆర్ కేబినెట్ : మార్పులివే

Update: 2015-10-03 06:25 GMT
తెలంగాణ రాష్ర్ట కేబినెట్‌ ప్రక్షాళనపై మళ్లీ ఊహాగానాలు ఊపందుకున్నాయి. గవర్నర్‌ నరసింహన్‌ తో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు వరుస భేటీలతో ఈ ఊహాగానాలకు బలం చేకూరుతోంది. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ముగియగానే సీఎం కేసీఆర్‌ తన మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు చేయనున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల స‌మాచారం. ఇప్పటికే పలువురు మంత్రుల తీరుపై అసంతృప్తిగా ఉన్న సీఎం కేసీఆర్‌ కు..తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పలువురు మంత్రులు చిన్నపాటి సమస్యను కూడా సమర్ధవంతంగా డీల్‌ చేయలేకపోతున్నారన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో గవర్నర్‌ తో సీఎం కేసీఆర్‌ వరుస భేటీలు గులాబీ వర్గాల్లో ఉత్కంఠను రేపుతున్నాయి.

గత కొన్ని నెలలుగా కేబినెట్‌ లో ప్రక్షాళన ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్‌ తో సీఎం కేసీఆర్‌ వరుసగా రెండో రోజు శుక్రవారం కూడా సుదీర్ఘంగా భేటీ కావడం కేబినెట్‌ ప్రక్షాళన ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. కేసీఆర్‌ మంత్రి వర్గంలో ప్రస్తుతం ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు - 14 మంది మంత్రులు ఉన్నారు. ఈ లెక్క‌న మంత్రివర్గంలో ప్రస్తుతానికి ఖాళీలు లేవు. అయితే కేబినెట్‌ లో మహిళలకు స్థానం కల్పించడంతో పాటు, సామాజిక వర్గాల ప్రకారం కూడా కేసీఆర్‌ తన కేబినెట్‌ లో చోటు కల్పిస్తారని అటు ప్రభుత్వంలోను, ఇటు పార్టీలోనూ జోరుగా చర్చలు సాగుతున్నాయి. కానీ కొత్త వారిని తీసుకోవాలంటే మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చేయడమే సీఎం కేసీఆర్‌ ముందున్న కర్తవ్యం.

ప్రస్తుతం ఉన్న పలువురు మంత్రుల తీరుపై సీఎం కేసీఆర్‌ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దీనికితోడు సీఎం కేసీఆర్‌ ఆయా వేదికలపై, జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు, అంతర్గత చర్చల్లో - సీనియర్లు కలిసినప్పుడు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. మ‌రోవైపు టీఆర్‌ ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీయే పైచెయ్యి సాధిస్తూ వచ్చింది. కానీ, ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లో మాత్రం ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కోవడంలో మంత్రులు విఫలమయ్యారన్న అభిప్రాయంతో సీఎం కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం. చివరకు మజ్లిస్‌ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానం విషయంలో కూడా మంత్రులు అనుకున్నంత ప్రతిభను కన బర్చలేకపోయారన్న భావనలో కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అన్నదాతల ఆత్మహత్యలతో పాటు రుణమాఫీపై ప్రతిపక్షాలు నిలదీయడంతో తెలంగాణ సర్కార్‌ ఇరకాటంలో పడ్డ విషయం తెలిసిందే. ఇటువంటి అనేక విషయాలు మంత్రుల పట్ల సీఎం కేసీఆర్‌ కు అసంతృప్తిని కలిగించినట్లు సమాచారం.

అందుకే పలువురు మంత్రులను కేబినెట్‌ నుంచి తప్పించాలనే నిర్ణయానికి వచ్చి, గవర్నర్‌ ను కలిసి ఉండొచ్చని గుసగుసలు వినబడుతున్నాయి. తాజా పరిణామాలు ఆశావహుల్లో ఆశలు చిగురింప చేస్తుండగా...ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న పలువురిలో మాత్రం గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తున్నాయని తెలుస్తోంది. అయితే, కేబినెట్‌ ప్రక్షాళన చేపడితే ఎవరి పదవి ఉంటుంది? ఎవరి పదవి ఊడుతుంది? తెలియక మంత్రులు వారిలో వారే మదనపడుతున్నట్లు సమాచారం.

కేసీఆర్‌ కేబినెట్‌ లోని ఇద్దరు ముగ్గురు అమాత్యులపై కూడా ఇసుక దందా, ఫీజుల కమిషన్లు - సెటిల్‌ మెంటు దందా వంటి అవినీతి ఆరోపణలు వచ్చాయి. అవినీతి ఆరోపణల పేరుతో తాటికొండ రాజయ్యను బర్తరఫ్‌ చేసిన సీఎం కేసీఆర్‌ అవే ఆరోపణలు వచ్చిన అమాత్యులనూ తప్పించవచ్చని అంతటా ప్రచారం జరిగింది. కానీ, ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణాల వల్ల రాజయ్య బర్తరఫ్‌ వరకే కేసీఆర్‌ ఆగారని సమాచారం. ఇటీవలి కాలంలో కేసీఆర్‌ పార్టీ నేతలకు మంత్రి పదవి ఇస్తానని హామీలు ఇస్తున్నారు. క‌రీంనగర్‌ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే - తెలంగాణ సాంస్కృతిక సారధి రసమయి బాల్‌ కిషన్‌ కి హైదరాబాద్‌ వేదికగా ఓ సాంస్కృతిక వేదికపైనే మంత్రి పదవి ఇస్తానని వేదికపైనే ప్రకటించారు. కరీంనగర్‌ జిల్లాలో జరిగిన గోదావరి పుష్కరాల్లో పాల్గొనడానికి వెళ్లిన కేసీఆర్‌.. ధర్మపురి శాసనసభ్యుడు - చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ నూ మంత్రిని చేస్తానని బహిరంగంగానే ప్రకటించారు. ఈ ఇద్దరూ కరీంనగర్‌ జిల్లాకు చెందిన వారే. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు, ఇద్దరూ కేబినెట్‌ హోదాలో ఉన్నవారు కావడం కావ‌డం గ‌మ‌నార్హం. ఇప్పటికే కరీంనగర్‌ జిల్లా నుంచి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ - రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంత్రులుగా కొనసాగుతున్నారు.

కేసీఆర్‌ తన కేబినెట్‌ ను ప్రక్షాళన చేస్తే వరంగల్‌ - హైదరాబాద్‌ - నల్గొండ జిల్లాలకు చెందిన ఐదారుగురు మంత్రులకు ఉద్వాసన తప్పకపోవచ్చని తెలుస్తోంది. ఇంత వరకు కేబినెట్‌లో మహిళలకు స్థానం లేదు కాబ‌ట్టి కేబినెట్‌ లో మహిళలను తీసుకోవడంతో పాటు వివిధ సామాజిక వర్గాలకు చోటు కల్పిస్తారని అంటున్నారు. కేసీఆర్‌ తన కేబినెట్‌ ను ప్రక్షాళన చేస్తే వరంగల్‌ జిల్లాకు చెందిన కొండా సురేఖకు మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. అదే విధంగా ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్‌ గా ఉన్న పద్మాదేవేందర్‌ రెడ్డిని కూడా కేసీఆర్‌ తన కేబినెట్‌ లోకి తీసుకోవచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. నిజామాబాద్‌ జిల్లా 'రెడ్డి' వర్గానికి చెందిన ఓ సీనియర్‌ శాసనసభ్యుడికి కూడా మంత్రి పదవి దక్కవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఇప్పటికే పలువురు మంత్రుల పనితీరును కేసీఆర్‌ నిశితంగా పరిశీలిస్తున్నారు. వారి పనితీరు, అవినీతి ఆరోపణలు, సామాజిక వర్గాల నేపథ్యం ఇవన్నింటిని పరిశీలించి పలువురిపై వేటువేసే అవకాశం లేకపోలేదని సమాచారం. ఏది ఏమైనా ముఖ్యమంత్రిగా తనకున్న అధికారంతో కేసీఆర్‌ ఏ క్షణమైనా తన కేబినెట్‌ ను ప్రక్షాళన చేయొచ్చు.
Tags:    

Similar News