కేటీఆర్ ప్రచారం చేస్తే ట్రాఫిక్ జాం ఉండదా?

Update: 2016-01-29 04:27 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమైనా చెప్పగలరు. నిజానికి అదే ఆయన సత్తా కూడా. తెలంగాణ అధికారపక్షం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ఎందుకు పాల్గొనటం లేదంటే ఆయన చెప్పిన సమాధానం వింటే కాసింత షాక్ తగలాల్సిందే.

తాను ప్రచారం చేస్తే ట్రాఫిక్ జాం అవుతుందని.. హైదరాబాద్ ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసమే తాను ప్రచారం చేయటం లేదని చెప్పుకొచ్చారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం పగ్గాల్ని కేటీఆర్ కు అప్పగించామని.. ఆయనే దాన్ని చూస్తారని కేసీఆర్ బయటకు చెప్పుకోలేరు. కొడుకు సమర్థతకు గ్రేటర్ ఎన్నికల ఫలితాలు లిట్మస్ టెస్ట్ మాదిరిగా చూసుకుంటున్న కేసీఆర్ ఆ విషయాన్ని చెప్పలేని పరిస్థితుల్లో ఉండటంతో.. తాను ప్రచారం చేస్తే ట్రాఫిక్ జాం అవుతుందని చెప్పి తప్పుకునే ప్రయత్నం చేశారు.

ఒకవేళ కేసీఆర్ ప్రచారం చేస్తే ట్రాఫిక్ జాం అవుతుందన్నదే నిజమే అయితే.. మరి.. మంత్రి కేటీఆర్ ప్రచారం చేస్తే ట్రాఫిక్ జాం కాదా? అన్నది ఒక ప్రశ్న. దీనికి కేసీఆర్ ఏమని సమాధానం చెబుతారు? తనతో పోలిస్తే.. తన కొడుకు ప్రచారం కాస్త తక్కువనే చెప్పదలుచుకున్నారా? అన్నది మరో ప్రశ్న. ఏమైనా.. తాను చేస్తే ట్రాఫిక్ జాం అయ్యే ఎన్నికల ప్రచారం తన కుమారుడు కేటీఆర్ చేస్తే మాత్రం ట్రాఫిక్ జాం కాదా? అన్న ప్రశ్నతోనే.. కేసీఆర్ కవరింగ్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది.
Tags:    

Similar News