తెలంగాణలో బోలెడన్ని ఎయిర్ పోర్ట్ లు

Update: 2016-06-17 05:09 GMT
కేంద్ర ప్రభుత్వం తాజాగా సరికొత్త విమానయాన పాలసీని ప్రకటించిన నేపథ్యంలో.. అందుకు తగ్గట్లుగా తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయాల్ని తీసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం తెలంగాణ మొత్తంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ తప్పించి మరో ఎయిర్ పోర్ట్ లేదు. వాస్తవానికి నిజాం కాలంలోనే తెలంగాణలో వరంగల్.. నిజామాబాద్.. అదిలాబాద్.. రామగుండంలలో ప్రాంతీయ విమానాశ్రయాలు ఉండేవి. ఉమ్మడి రాష్ట్రంలో అవి మూతపడటం.. వాటిని తిరిగి తెరవాలన్న డిమాండ్ ఇప్పటికి అమలు కాని పరిస్థితి.

తాజాగా మోడీ సర్కారు తీసుకొచ్చిన కొత్త పాలసీని ఊతంగా చేసుకొని తెలంగాణ వ్యాప్తంగా కొత్త ఎయిర్ పోర్ట్ లను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో కేసీఆర్ సర్కారు ఉన్నట్లుగా చెబుతున్నారు. వరంగల్.. నిజామాబాద్.. అదిలాబాద్.. కొత్త గూడెంలతో పాటు హైదరాబాద్ శివారులో మరో ఎయిర్ పోర్ట్ నిర్మించాలన్న ఆలోచనలో తెలంగాణ సర్కారు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మించిన సందర్భంగా చేసుకున్న నిబంధన కొత్త ఎయిర్ పోర్ట్ ల ఏర్పాటు విషయంలో ఇబ్బందికరంగా మారిందన్న మాట వినిపిస్తోంది.

శంషాబాద్ కు 150 కిలోమీటర్ల దూరంలో కొత్త విమానాశ్రయాల్ని ఏర్పాటు చేయకూడదన్న రూల్ ఉన్న నేపథ్యంలో.. దాన్ని ఏ విధంగా అధిగమించాలన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. వరంగల్ లో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేయాలని ఉన్నా.. హైదరాబాద్ కు 142 కిలోమీటర్లు మాత్రమే దూరంగా ఉండటంతో.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ తో చేసుకున్న ఒప్పందం అడ్డుగా నిలుస్తుందని చెబుతున్నారు. హైదరాబాద్ నగర శివారులో మరో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేయాలన్న కృతనిశ్చయంతో కేసీఆర్ సర్కారు ఉన్నా.. ఈ నిబంధనే బంధనంగా మారింది.

అయితే.. కర్ణాటక.. మహారాష్ట్రలలో 150 కిలోమీటర్ల లోపే విమానాశ్రయాల్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. ఆ రాష్ట్రాలకు అదెలా సాధ్యమైందన్న అంశాన్ని పరిశీలించి.. దాన్ని తెలంగాణకు అప్లై చేయాలన్న ఆలోచనలో తెలంగాణ సర్కారు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. రానున్న రోజుల్లో తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో కేసీఆర్ అండ్ కో ఉన్నట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News