కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌తో కొత్త హీట్ మొద‌లైంది

Update: 2017-10-26 05:51 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌ట‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపిందని అంటున్నారు. గ్రామ‌పంచాయ‌తీల‌కు గ‌డువులోగా ఎన్నికలు జరపనున్నట్లు కేసీఆర్ ప్రకటించడంతో గ్రామాల్లో రాజకీయ వేడి రాజుకుంది. 2018 జూలై నెలాఖరుకు గ్రామపంచాయతీ పాలకవర్గాల గడువు ముగియనుంది. ఈలోపే మే లేదా జూన్‌ 2018లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమీషన్‌ సిద్దమవుతుంది. 500పైన జనాభా ఉన్న గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చాలని నిర్ణయించడం - నేడో - రేపో జీవో విడుదల కానుండటంతో తెలంగాణ‌లోని దాదాపుగా అన్ని జిల్లాలో పంచాయతీల సంఖ్య పెరగనుంది. ఇప్పటికే ఎన్నికల కమీషన్‌ ఓటర్ల నమోదును పూర్తిచేసింది. ఎన్నికల నిర్వహణకు అవరమైన పోలింగ్‌ బూత్‌ లు - బ్యాలెట్లు - ఇతర ఏర్పాట్లు సిద్దం చేయాలని పంచాయతీ అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది.

జిల్లాల పునర్విభజన తరువాత జరుగుతున్న తొలి పంచాయతీ ఎన్నికలు కావడంతో రిజర్వేషన్లలలో మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉండటంతో ఆయా పంచాయతీలలోని జనాభా ఆదారంగా రిజర్వేషన్లపై అప్పుడే అంచనాలు వేస్తూ ఎన్నికలకు పంచాయతీల పెద్దలు సిద్దమవుతున్నారు. తండాలను పంచాయతీలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించడంపట్ల గిరిజనులు సంబరాలు చేసుకుంటున్నారు. 2014 నుంచి తండాలు పంచాయతీలుగా మారుతాయని ఎదిరి చూస్తున్న వారికి సీఎం కేసీఆర్‌ శుభవార్త చెప్పడంతో సంబరాలు మిన్నంటాయి. మ‌రోవైపు తండాలను పంచాయతీలుగా మార్చే దిశగా ప్రభుత్వంలో కదలిక వచ్చింది. బుధవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్‌ శుక్రవారంలోగా తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

మ‌రోవైపు ఎన్నికల కమీషనర్‌ జిల్లాల వారిగా పర్యటిస్తూ కలెక్టర్లను -ఎస్పీలను సమాయత్తం చేస్తున్నారు. పంచాయతీరాజ్‌ చట్టంలో సమూల మార్పులను తీసుకువచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉండటం, సర్పంచ్‌లో జవాబుదారి తనాన్ని పెంచే విధంగా సంస్కరణలు తీసురావటాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. ఎన్నికలు ప్రత్యక్షంగా ఉండాలని పరోక్షంగా ఉండకూడదని అంటున్నారు. ఎన్నిక‌ల విధానంపై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకున్నా పరోక్ష ఎన్నికలవైపు ప్రభుత్వం మొగ్గుచూపే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
Tags:    

Similar News