పోల‌వ‌రంపై కొత్త పిడుగు వేసిన కేసీఆర్‌

Update: 2018-08-02 05:15 GMT
ఏపీ నిర్మిస్తున్న పోల‌వ‌రం ప్రాజెక్టుపై కొత్త కొర్రీ వేసేలా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఏపీ స‌ర్కారు నిర్మిస్తున్న పోల‌వ‌రంపై మొద‌ట్నించి అసంతృప్తితో ఉన్న కేసీఆర్‌.. తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వ వాద‌న‌ను సుప్రీంకోర్టులో అఫిడ‌విట్ రూపంలో దాఖ‌లు చేశారు.

పోల‌వ‌రంతో భ‌ద్రాచ‌లానికి మ‌ప్పు ఉంద‌న్న ఆందోళ‌న‌ను వ్య‌క్తం చేసింది. ఒక్క భ‌ద్రాచ‌ల‌మే కాదు.. బొగ్గుగ‌నుల ప్రాంతాల‌కు కూడా ముంపు బెడ‌ద ఉంద‌ని స్ప‌ష్టంచేసింది. ఈ స‌మ‌స్య‌ను తీర్చేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పేర్కొంది. పోల‌వ‌రం ప్రాజెక్టు కార‌ణంగా తెలంగాణ ప్రాంతంలోని కొంత భూభాగం ముంపున‌కు గుర‌య్యే అవ‌కాశం ఉండ‌టంతో ఇప్ప‌టికే ఆ ప్రాంతాల్ని ఏపీకి బ‌ద‌లాయించారు. ఈ నిర్ణ‌యంపై అప్ప‌ట్లోనే కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. కొంత‌కాలం ఈ అంశంపై పోరాటం చేయాల‌ని భావించినా.. ఆ త‌ర్వాత వెన‌క్కి త‌గ్గారు.

ఇదిలా ఉంటే.. పోల‌వ‌రం ప్రాజెక్టును వ్య‌తిరేకిస్తూ ఒడిశా ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో కేసు దాఖ‌లు చేసింది. దీనిపై జ‌రిగిన విచార‌ణ సంద‌ర్భంగా కేసు ప‌రిధిలోకి తెలంగాణ ప్ర‌భుత్వాన్ని తీసుకురావాల‌ని కోర‌టంతో సుప్రీం ఓకే చెప్పింది. ఈ నేప‌థ్యంలో పోల‌వ‌రం ప్రాజెక్టుపై ఉన్న అభ్యంత‌రాల్ని కోర్టుకు అఫిడ‌విట్ రూపంలో దాఖ‌లు చేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.

ఈ నేప‌థ్యంలో పోల‌వ‌రంపై త‌న‌కున్న అభ్యంత‌రాల్ని తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాది వైద్య‌నాథ‌న్ వాదించేలా నిర్ణ‌యం తీసుకున్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టును  50 ల‌క్ష‌ల క్యూసెక్కుల వ‌ర‌ద ప్ర‌వాహాన్ని అంచ‌నా వేసి నిర్మిస్తున్నార‌ని.. న‌దిలో ఒక్క‌సారిగా 50 ల‌క్ష‌ల క్యూసెక్కుల ప్ర‌వాహం న‌మోదైతే.. నీరు వెన‌క్కి మ‌ళ్లి భ‌ద్రాచ‌లంతో పాటు.. బొగ్గులు నిల్వ‌లు ఎక్కువ‌గా ఉండే.. మ‌ణుగూరు లాంటి ప్రాంతాలు ముంపున‌కు గుర‌య్యే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని పేర్కొన్నారు. తాము లేవ‌నెత్తిన అంశాలను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని.. పూర్తి స‌ర్వే నిర్వ‌హించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం సుప్రీంను కోరింది. భ‌ద్రాచ‌లం పేరుతో పోల‌వ‌రంపై కొత్త కొర్రీని కేసీఆర్ తెర మీద‌కు తెచ్చార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Tags:    

Similar News