లెక్క ప‌క్కాః కేసీఆరే కింగ్‌ మేక‌ర్‌

Update: 2016-05-24 10:59 GMT
తెలంగాణ‌లో కారు జోరు కొన‌సాగుతోంద‌నేందుకు ఇదే నిద‌ర్శ‌నం. ఎన్నిక ఏద‌యినా త‌మ‌ను ప్ర‌జ‌లు గెలిపిస్తుండ‌ట‌మే టీఆర్ ఎస్‌ కు మ‌ద్ద‌తుకు నిద‌ర్శ‌న‌మ‌ని ఇటీవ‌ల జ‌రిగిన పాలేరు ఉప ఎన్నిక‌ల ఫ‌లితం అనంత‌రం గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ విశ్లేషించారు. అయితే ఆ గెలుపు కోసం ఏం చేయాలో ముంద‌స్తుగానే సిద్ధం చేసుకోవ‌డమే ఈ విజ‌య‌ప‌రంప‌ర‌కు కార‌ణ‌మ‌ని చెప్తున్నారు. తాజాగా జ‌ర‌గ‌నున్న రాజ్య‌స‌భ ఎన్నిక‌లే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని విశ్లేషిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రెండు రాజ్య‌స‌భ స్థానాల‌కు ఎంపిక నోటిఫికేష‌న్ విడుద‌ల అయిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నికకు అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ పార్టీ ఇప్ప‌టివ‌ర‌కు త‌న అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌లేదు. అయితే బ‌రిలో నిలిచేవారు ఎవ‌ర‌యిన‌ప్ప‌టికీ గెలుపు మాత్రం గులాబీ నాయ‌కుల‌దే అని రాజ‌కీయ‌వ‌ర్గాలు చెప్తున్నాయి. ఇందుకు త‌గిన విశ్లేష‌ణ‌లు కూడా వారు చేస్తున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కో రాజ్యసభ సభ్యుడిని ఎన్నుకోవాలంటే కనీసం 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ లెక్కన రెండు స్థానాలకు 82 మంది ఎమ్మెల్యేలు కావాలి. ప్రస్తుతం తెలంగాణ శాసనసభలో టీఆర్ ఎస్‌ కు 86 మంది ఎమ్మెల్యేలున్నారు. పాలేరులో గెలుపుతో ఈ సంఖ్య 87కు చేరింది. దీంతో టీఆర్ ఎస్‌ పార్టీ చాలా సునాయాసంగా రెండు రాజ్యసభ స్థానాలను తన ఖాతాలో వేసుకుంటుంది. మిగిలిన పార్టీలేవి టీఆర్ ఎస్‌ కు కనీసం దరిదాపుల్లో కూడా లేకపోవడం విశేషం.

టీఆర్ ఎస్‌ కు రెండు రాజ్య‌స‌భ సీట్ల‌ను గెలుచుకునే ఎమ్మెల్యేల సంఖ్య లేన‌ప్ప‌టికీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ ను ప్రారంభించి ఎమ్మెల్యేల‌ను వ్యూహాత్మ‌కంగా టీఆర్ ఎస్ గూటికి చేర్చుకున్నారు. ఇలా బీఎస్‌పీ - కాంగ్రెస్‌ - టీడీపీ - వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు కారెక్కేశారు. దీంతో టీఆర్ ఎస్‌ కు త‌మ నాయ‌కుల‌ను గెలిపించుకోవ‌డానికంటే ఎక్కువ మెజార్టీయే ఉంది. కాబ‌ట్టి ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్‌ దే గెలుపు అనేది ఖాయం. ఈ నేప‌థ్యంలో పెద్దల సభకు ఎవరిని పంపించాలనే దానిపై టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కేవ‌లం పేర్లు ఖ‌రారు చేయ‌డ‌మే మిగిలింది. మొత్తంగా కేసీఆర్ కింగ్ మేక‌ర్‌ గా నిలుస్తున్నార‌నేది పొలిటిక‌ల్ స‌ర్కిల్‌ లో జోరుగా విన‌వ‌స్తున్న టాక్‌.
Tags:    

Similar News