టీఆర్ ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యులు వారిద్ద‌రే

Update: 2016-04-06 10:48 GMT
తెలంగాణలో వలసల ఎఫెక్ట్‌ తో ప్రతిపక్షం అన్నది నామ్‌ కేవాస్తేగా మారిపోయింది. కొత్తగా గులాబీ కండువాలు కప్పుకున్న ఎమ్మెల్యేల బలంతో రెండు రాజ్యసభ స్థానాలను గెలుచుకునే బలం టీఆర్ ఎస్‌ కు ఉంది. జూన్ 2 నాటికి తెలంగాణలో రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. కాంగ్రెస్‌ సభ్యుడు వి. హన్మంతరావు, టీడీపీ నుంచి ఎంపికైన గుండు సుధారాణిల పదవీ కాలం ముగుస్తుంది. ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారులకు సమాచారం కూడా అందింది. దాంతో రాజకీయంగా కదలికలు మొదలయ్యాయి.

ఎన్నిక సంఘంకు అందిన స‌మాచారం నేప‌థ్యంలో టీఆర్ ఎస్ నుంచి రాజ్యసభకు ఎవరు వెళ్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు అధికారపక్షం నుంచి కేకే ఒక్కరే రాజ్యసభలో ఉన్నారు. ఇప్పుడు మరో ఇద్దరు కూడా రాజ్యసభకు వెళ్లే అవకాశం దక్కింది. దాంతో పార్టీ ఎలాంటి వారిని ఎంపిక చేస్తుంది..? గులాబీ బాస్ మనసులో ఎవరున్నారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీఆర్ ఎస్ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లాలనుకుంటున్న ఆశావహుల జాబితా పెద్దగానే కనిపిస్తోంది.. అయితే సీఎం కేసీఆర్‌ ఏ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలన్న లెక్కలేసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారితో పాటు మైనార్టీలకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న చర్చ  పార్టీలో నడుస్తోంది. ఇక కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన వారు కూడా రాజ్యసభ సీటు పై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మైనార్టీకి ఇవ్వాలనుకుంటే ఎవరికి అవకాశం ఇస్తారు.? పార్టీలో అలాంటి నాయకుడు ఎవరున్నారన్న చర్చ కూడా ఉంది.

మరోవైపు మీడియాకు చెందిన ఇద్దరు ప్ర‌ముఖులు కూడా రాజ్యసభ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరిలో ఒక్కరికి తప్పకుండా ఛాన్స్‌ దక్కుతుందన్న టాక్‌ వినిపిస్తోంది. ఆ ఒకరికి సీఎం కమిట్ మెంట్ ఇచ్చారన్న ప్రచారం కూడా ఉంది. మొత్తం మీద రాజ్యసభకు వెళ్లేది ఎవరో కానీ, కేసీఆర్ ఎవరిని రాజ్యసభకు పంపించాలనుకుంటే వారే ఫైనల్ కాబట్టి… ముఖ్యనేతలు కూడా ఎవరికి ఛాన్స్‌ దక్కుతుందన్న దానిపై నోరు మెదపడం లేదు.
Tags:    

Similar News