కేసీఆర్ ఫుల్ హ్యాపీ పూర్తిగా పోవటం ఖాయమట

Update: 2016-10-26 19:30 GMT
అనుకున్న టైంకి అనుకున్నట్లుగా పనిని పూర్తి చేయటానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహం కాస్త భిన్నంగా ఉంటుంది. టార్గెట్ ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని రీచ్ అయ్యే భారం మొత్తాన్ని అప్పగించేసి.. తాను మాత్రం చూస్తుండిపోతారు. లెక్క తేడా కొడుతుంటే హెచ్చరికలు చేస్తారే తప్పించి.. హడావుడి పడరు. ఎలాంటి ఇష్యూలో అయినా.. కూల్ గా ఉండే సత్తా ఆయన సొంతం. మొన్నటికి మొన్న జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటు ముచ్చటే తీసుకోండి. ఆఖరి క్షణం వరకూ ఆయన చేసిన మార్పులు చూసినోళ్లంతా.. అసలు పని జరుగుతుందా? అని కంగారు పడ్డారు. కానీ.. కేసీఆర్ లో మాత్రం ఇసుమంత టెన్షన్ పడింది లేదు. నిజానికి అదే ఆయన బలంగా చెప్పాలి. అనుకున్న పనిని.. అనుకున్నట్లుగా చేయగలిగే సత్తా ఉన్న వారిని ఎంపిక చేసుకునే విషయంలో కేసీఆర్ కు వందకు వంద మార్కులు పడతాయనే చెప్పాలి.

కొత్త జిల్లాల్ని సక్సెస్ ఫుల్ గా లాంఛ్ చేసేసిన తర్వాత.. తన సన్నిహితులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సందర్భంగా కేసీఆర్.. కాస్తంత ఓపెన్ అయ్యారు. తాను చాలా హ్యాపీగా ఉన్నట్లుగా చెప్పిన ఆయన.. కొత్త జిల్లాల ఏర్పాటుపై తానెంత సంతోషంగా ఉన్న విషయాన్ని చెప్పేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దాదాపు రెండున్నరేళ్లకు దగ్గరకు వస్తున్నా.. ఇంతకు ముందు ఈ తరహా వ్యాఖ్య ఆయన నోటి నుంచి వచ్చింది లేదు. అంత హ్యాపీగా ఉన్న కేసీఆర్ కు.. ఈ సంతోషం ఎక్కువ కాలం ఉండేట్లుగా లేదని చెప్పాలి.

తాజాగా చోటు చేసుకున్న పరిణామమే దీనికి కారణంగా చెప్పాలి. పార్టీ ఫిరాయించి గులాబీ కారు ఎక్కేసిన ఎమ్మెల్యేల ఇష్యూలో సుప్రీం కోర్టు చేసిన కీలక వ్యాఖ్యలే దీనికి కారణంగా చెబుతున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఆయా పార్టీలు చేసిన ఫిర్యాదుల్ని ఎప్పటి లోపు పరిష్కరిస్తారన్న అంశంపై సమాధానాన్ని నవంబరు 8 లోపు చెప్పాలని తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారిని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో.. ఆ రోజు నాటికి పార్టీ ఫిరాయింపు నేతల విషయంలో కీలక నిర్ణయం తీసుకోని పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు.

కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ లోకి చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసును తాజాగా విచారించిన కోర్టు.. దీనిపై తెలంగాణ న్యాయవాదిని ప్రశ్నించారు. అయితే.. తమకు నోటీసులు ఇవ్వలేదని చెప్పటం ఆయన చెప్పగా.. తాము గతంలోనే నోటీసులు ఇచ్చామని పిటీషనర్ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. దీంతో.. కల్పించుకున్న న్యాయమూర్తి.. ఎప్పటి లోపు ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకుంటారో నవంబరు 8న స్పష్టం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో తర్వాత వాయిదా నాటికి జంపింగ్ నేతలపై స్పీకర్ వేటు వేస్తారన్న అభిప్రాయాన్ని కొందరు బలంగా వినిపిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే.. తెలంగాణ ప్రభుత్వానికి అంతకు మించిన భారీ షాక్ మరొకటి ఉండదనే చెప్పాలి. తనకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరించే కేసీఆర్ కు.. సుప్రీం తీర్పు కారణంగా వేరే పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలపై వేటు పడితే.. వెనువెంటనే తెలంగాణ తెలుగుదేశం సైతం రంగంలోకి దిగి.. తమ పార్టీ నుంచి ఫిరాయించిన వారి జాబితాను సుప్రీంకు సమర్పించి.. న్యాయం కోరే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు స్పందన కేసీఆర్ హ్యాపీ నెస్ ను దాదాపుగా దెబ్బ తీసే అవకాశమే ఎక్కువన్న భావన వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News