కేసీఆర్‌ మెడకు చుట్టుకున్న 'విమోచన'

Update: 2016-09-17 04:20 GMT
ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవం. నిజాం పాలన నుంచి భారత యూనియన్‌ లో తెలంగాణ ప్రాంతం విలీనం అయిన రోజు. ఈ రోజును అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలనే డిమాండ్‌ ఇప్పుడు.. క్రమంగా కేసీఆర్‌ ప్రభుత్వం మెడకు చుట్టుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఒకప్పట్లో తాను కూడా.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలంటూ తాను కూడా డిమాండ్‌ చేసిన వ్యక్తిగా కేసీఆర్‌ కు పేరుంది. ఇప్పుడు తానే రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత.. విమోచన దినం గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఉండడం అనేది ఆయనలోని అవకాశ వైఖరికి నిదర్శనం అనే విమర్శలకు కారణమవుతుందని జనం అనుకుంటున్నారు. సరిగ్గా ఈ అంశాన్నే బాగా వాడుకోవడానికి విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.

విమోచన దినోత్సవం గురించి మాట్లాడేంత ధైర్యం కాంగ్రెస్‌ పార్టీకి ఎటూ లేదు గానీ.. ఇటు వామపక్షాలు - అటు భారతీయ జనతా పార్టీ రెండు వర్గాలూ.. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం గురించి చాలా గట్టిగా డిమాండ్‌ చేస్తున్నాయి. సాధారణంగా భిన్నధృవాలైన ఈ రెండు పార్టీలు విమోచన దినం విషయంలో మాత్రం కలిసి అడగకపోయినా.. ఒకే డిమాండ్‌ తో కేసీఆర్‌ ను ఇరుకున పెడుతుండడం విశేషం.

కేసీఆర్‌ ఇలాంటి చారిత్రక ద్రోహాలకు పాల్పడితే కాలగర్భంలో కలిసిపోతారంటూ.. వామపక్షాలు కేసీఆర్‌ ను హెచ్చరిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ.. ప్రభుత్వం అధికారికంగా చేయకపోవడమే ఛాన్స్‌ దొరికింది అన్నట్లుగా.. తమ పార్టీ తరఫున పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ.. జాతీయ వాద మైలేజీ సాధించడానికి - తెలంగాణలో దీన్ని వాడుకుని ఒక వర్గంలో బలపడడానికి చూస్తోంది. నిజానికి విమోచన దినోత్సవం నిర్వహణ అనేది ఏడాదికి ఒకసారి మాత్రమే చాలా స్వల్ప కాలం మాత్రమే వినిపించే డిమాండు. కేసీఆర్‌ దీనిని ఈ కొన్ని రోజులు ఇగ్నోర్‌ చేస్తూ.. రోజులు నెట్టుకొచ్చేస్తున్నారు. అలా కాకుండా ప్రతిపక్షాలు కూడా చిత్తశుద్ధితో పట్టుపడితే ప్రయోజనం ఉండొచ్చు అని జనం అనుకుంటున్నారు.
Tags:    

Similar News