ప్రజా ఆశీర్వాదం...వెలిగిపోవాలె...!!!

Update: 2018-09-27 06:03 GMT
తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజా ఆశీర్వాద సభల పేరిట తమ ప్రచారాన్ని మొదలు పెట్టింది. ప్రగతి నివేదన సభలో జరిగిన తప్పులు ఈ సారి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ ప్రజా ఆశీర్వాద సభలు విజయవంతం చేయడానికి మంత్రులు - ఎంపీలు - ఎమ్మెల్యేలు కష్టపడాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఆదేశించారు. సభల ఏర్పాట్లు పక్కాగా ఉండాలని,  ప్రతి సభకు కనీసం 3 లక్షల మందిని తీసుకురావాలని తమ అభ్యర్తులను కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని హుస్నాబాద్‌ లో ఈ నెల 7 ప్రారంభించిన కె.చంద్రశేఖర రావు వివిధ కారణాల రీత్యా బహిరంగ సభలను పట్టించుకోలేదు. కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీలు మహాకూటమి పేరుతో దూకుడు పెంచుతూండడంతో తాము కూడా ఇక ప్రజల్లోకి వెళ్లాలని కల్వకుంట్ల వారు పార్టీ సీనియర్లకు చెప్పినట్లు సమాచారం. పార్టీ సీనియర్ నాయకులు కాని - మంత్రులు కాని - శాసనసభ్యులు కాని - ఇతర నాయకులు కాని తెలంగాణ భవన్‌ కు - ప్రగతి భవన్‌ కు రావాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాల్లోనే ఉండి ప్రచార బాధ్యతలను దగ్గరుండి పర్యవేక్షించాలని కూడా కేసీఆర్ ఆదేశించినట్లు చెబుతున్నారు.

అక్టోబర్ మూడు నుంచి వరుసగా అన్ని జిల్లాల్లోనూ బహిరంగ సభలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకుల భావిస్తున్నారు. ఎప్పుడు... ఎక్కడ సభలు ఉంటాయని - ఆ సభలకు ఎవరు బాధ్యతలు తీసుకుంటారు వంటి అంశాలతో ప్రతి సభకు సంబంధించి ఓ నివేదిక రూపొందించి తమ అగ్రనేతకు ఇవ్వాలని జిల్లా నాయకులను సమాచారం వెళ్లింది. ఈ పనులను పర్యవేక్షించేందుకు తెలంగాణభవన్‌ లో ఓ సెల్‌ ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ముందుగా వివిధ జిల్లాల్లో ఉన్న అసంతృప్తులను వీలైనంత త్వరగా బుజ్జగించాలని - వారు వినకపోతే కఠిన చర్యలకు కూడా వెనుకాడవద్దని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు గట్టి ఆదేశాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఎవరైతే ఎదురుతిరిగి పార్టీ ఓటమి కోసం పని చేస్తున్నారో అక్కడ తెరాస అభ్యర్ధులు గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో విజయం సాధించేలా చూడాలని - ఇది ఇతర నాయకులకు కూడా గుణపాఠం కావాలని ఆయన అన్నట్లు సమాచారం. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సమితి అక్టోబర్ నెల 3 వ తేదీ నుంచి ప్రచార జోరును - వ్యూహ ప్రతివ్యూహాలను పదునుపెట్టే అవకాశం ఉంది.
Tags:    

Similar News