ఏపీకి కేసీఆర్ గిఫ్టు 200 కోట్లు

Update: 2015-10-25 08:49 GMT
 తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ రాజధాని అమరావతికి రావడమే ఇటీవల కాలంలో అతిపెద్ద పరిణామం.. ఆయన రాక, చంద్రబాబు ఆయనకు ఇచ్చిన గౌరవ మర్యాదలూ అన్నీరాజకీయంగా ఆసక్తి రేపాయి. అయితే, అంతకంటే ఆశ్చర్యకరమైన విషయానికీ అమరావతి శంకుస్థాపన కార్యక్రమం వేదికయ్యేదని.. కొద్దిలో అది మిస్సయిందని సమాచారం.  తెలంగాణ తరఫున అమరావతికి రూ.200 కోట్ల నజరానా ప్రకటించాలని కేసీఆర్ అనుకుని వచ్చినట్లు సమాచారం.

నిజానికి చంద్రబాబు పిలవగానే అంగీకరించి అమరావతికి వచ్చిన కేసీఆర్ అక్కడ తనకు మంచి ప్రాధాన్యం దక్కుతుందునిముందే తెలుసుకున్నారు. శిలాఫలకంపై ఆయన పేరు వేసిన సంగతి చంద్రబాబు ముందే కేసీఆర్ కు చెప్పారు. దీంతో కేసీఆర్ కూడా తెలంగాణ తరఫున ఆంధ్రప్రదేశ్ రాజధానికి భారీ విరాళం ప్రకటించాలని అనుకున్నారు. అయితే... ప్రధాని మోడీ పాల్గొన్న ఆ సభలో ఆయన కేంద్రం తరఫున ఏమైనా ప్రకటిస్తారని అంతా అనుకున్నట్లే కేసీఆర్ కూడా అనుకున్నారు. ప్రధాని ప్రకటన తరువాత తెలంగాణ తరఫున తాను ప్రకటించాలని అనుకున్నారు. అయితే, ప్రధాని ఏమీ ఇవ్వకపోయేసరికి.. కేసీఆర్ కూడా మిన్నకుండిపోయారట. ప్రధాని ఇవ్వకుండా తాను ప్రకటిస్తే అది ఆయన్ను ఇరుకునపెట్టినట్లు అవుతుందన్న ఉద్దేశంతోనే కేసీఆర్ మౌనం పాటించారట.

మొత్తానికి ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రధాని ఉత్త చేయి చూపించినా నిత్యం మండిపడే పొరుగు రాష్ట్రం సీఎం 200 కోట్లు ఇవ్వాలనుకోవడం చిన్న విషయమేం కాదు. మోడీ తో సంబంధం లేకుండా కేసీఆర్ కనుక అదే రోజు ఈ సహాయం ప్రకటించి ఉంటే, ఆంధ్రుల మనస్సుల్లో, చరిత్రలో కూడా చిరస్థాయిగా నిలిచిపోయేవారు.. అంతేకాదు, ప్రధానికి కూడా ఏపీకి ప్యాకేజీ ప్రకటించక తప్పనిపరిస్థితి కల్పించేవారు.
Tags:    

Similar News