బీసీల‌పై కేసీఆర్ స్పెష‌ల్ ఫోక‌స్‌..అందుకే కీల‌క నిర్ణ‌యం

Update: 2020-02-27 16:29 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిపాల‌న‌లో త‌న‌దైన శైలిలో ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ద‌ఫా తెలంగాణ‌లోని వివిధ కులాల్లో మెజార్టీగా ఉన్న‌ బీసీల‌పై కేసీఆర్ ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టారు. ఈ మేర‌కు కేసీఆర్ స‌ర్కారు ప్ర‌వేశ‌పెట్ట‌నున్న ప‌థ‌కాల గురించి తాజాగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ వెల్ల‌డించారు. బీసీల సంక్షేమం కోసం సాగ‌నున్న ఈ ప‌థ‌కం కేసీఆర్ పేరుతో ఉండ‌నుండ‌టం అస‌లు ట్విస్ట్‌.

తెలంగాణ‌లోని యువతకు ముఖ్యంగా బీసీల‌కు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేందుకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేరిట కొత్త పథకానికి రూపకల్పన చేశారు.  కేసీఆర్ ఆపద్బంధు పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. కేసీఆర్ ఆపద్బంధు పథకం కింద ఐదుగురు ఎంబీసీ యువకులకు ఒకటి చొప్పున అంబులెన్స్‌ లు పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డిసైడ‌యింది. అయితే, ఈ ప్రాజెక్టు ప్రారంభానికి ముందు పైలట్ ప్రాజెక్టు రూపంలో అమలు చేయ‌నున్నారు.

తెలంగాణ‌ బీసీ సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్ ఈ ప్రాజెక్టు గురించి వివ‌రిస్తూ - బీసీ సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు ఒక అంబులెన్స్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ ఫ‌లితాల‌ను అధ్య‌య‌నం చేసిన తర్వాత పెద్ద ఎత్తున విస్తరించనున్న‌ట్లు తెలిపారు. దీంతో పాటుగా పదివేల మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని మంత్రి  వెల్ల‌డించారు. ఈ రెండు పథకాల‌కు సంబంధించి క‌స‌ర‌త్తు జ‌రుగుతోంద‌ని, త్వరలోనే పూర్తి విధివిధానాలను రూపొందించి అమ‌లు చేస్తామ‌ని మంత్రి వెల్ల‌డించారు.
Tags:    

Similar News