కేసీఆర్ అంటే భయం.. భక్తి ఉండాలా.?

Update: 2019-09-13 04:05 GMT
భయం.. భక్తి.. ప్రత్యర్థులకు టన్నుల లెక్కన ఇవ్వడం కేసీఆర్ కు అలవాటు.. చేతికి మట్టి అంటకుండా పనులు పూర్తి చేయడంలో కేసీఆర్ దిట్ట అని రాజకీయ వర్గాల్లో పేరుంది. ఉమ్మడి రాజధానిగా పదేళ్లు హైదరాబాద్ ను ఉంచి రాజకీయం చేయాలనుకున్న చంద్రబాబు.. తెలంగాణ, ఏపీ విడిపోయాక కేసీఆర్ కు కొరకరాని కొయ్యగా మారిపోయారు. కానీ ఒకే ఒక్క ‘ఓటుకు నోటు’తో ఆయనను అమరావతి సాగనంపిన సామర్థ్యం కేసీఆర్ సొంతం. వ్యూహాత్మకంగా ధిక్కారుల పనిపట్టడంలో కేసీఆర్ ది అందెవేసిన చేయి.

కేసీఆర్ బలం, బలగమల్లా.. పోలీసులు, అధికారం.. పార్టీపై గుత్తాధిపత్యం.. వీటిని ప్రయోగించే నేతలను అదుపులో ఉంచుకుంటారు. కానీ అలిగేషన్స్ లేని నేతలు చాలా మంది ఉంటారు. వారు ఇలాంటి వాటికి లొంగరు.. పైగా ఎన్నికల ముందర ఇవేవీ పనిచేయవు. అప్పుడు కప్పల తక్కెడ ఎక్కువ. అసంతృప్తులు ప్రత్యర్థి పార్టీలోకి వలసలు పోవడానికి ఆస్కారం ఎక్కువ.

నిజానికి మహమూద్ అలీ పోయిన ప్రభుత్వంలో మైనార్టీ కోటాలో డిప్యూటీ సీఎం. ఈసారి ఆయనను తప్పించి మరో టీఆర్ఎస్ మైనార్టీ ఎమ్మెల్యే అయిన షకీల్ కు ఆయన స్థానంలో మంత్రి పదవి ఇచ్చి భర్తీ చేయవచ్చు. కానీ జూనియర్ అని షకీల్ ను కేసీఆర్ పక్కనపెట్టడం.. ఆయన బీజేపీ వైపు చూడడం కాకతాళీయంగా జరిగింది ఏమీ కాదు.. మహమూద్ అలీ ప్రత్యక్ష్యంగా ఇంతవరకు గెలిచింది లేదు. వయసు రీత్యా ఆయనను పక్కకు పెట్టవచ్చు. అదే భోదన్ ఎమ్మెల్యే షకీల్ వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.. పైగా మైనార్టీ విద్యాధికుడు. ఈయనకు మంత్రి ఇవ్వవచ్చనే వాదనలో న్యాయముందనే అభిప్రాయం వినిపిస్తోంది..

అయితే ఇలాంటి అసంతృప్తులెన్నో పార్టీలో నివ్వురు గప్పిన నిప్పులా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణతో భగ్గుమన్నాయి. ఇప్పుడు కేసీఆర్ అంటే పార్టీలో భయం, భక్తి లేకుండా పోయాయని వరుస పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. ఈటల  - రసమయి - జోగురామన్న - మైనంపల్లి - నాయిని - అరికపూడి సహా చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. ఈ అగ్ని పర్వతం రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి (బహుశా 2024) బద్దలయ్యే అవకాశాలే ఎక్కువ. రెండు సార్లు అధికారం కేసీఆర్ కు సంతృప్తినిచ్చినా అన్ని ఏళ్లు ఏ పదవి లేకుండా ఉండడం నేతలు జీర్ణించుకోవడం లేదు. ఇప్పుడీ అసంతృప్తి సెగ గులాబీ దండును వచ్చే 2024 ఎన్నికల్లో ఏం చేస్తుందనేది రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది. 
Tags:    

Similar News